Tata : డీజిల్ టెన్షన్ లేదు..మైలేజ్ రికార్డులు బద్దలు..పెట్రోల్ వెర్షన్‌లో టాటా ఎస్‌యూవీల విశ్వరూపం.

Tata : టాటా మోటార్స్ తన ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీలైన హారియర్, సఫారీలను పెట్రోల్ ఇంజిన్‌తో లాంచ్ చేసి మార్కెట్లో సంచలనం సృష్టించింది. ఇప్పటివరకు డీజిల్ కార్లకే పరిమితమైన ఈ మోడల్స్, ఇప్పుడు సరికొత్త 1.5 లీటర్ హైపేరియన్ టర్బో-GDi పెట్రోల్ ఇంజిన్‌తో రానున్నాయి. టాటా హారియర్ పెట్రోల్ ప్రారంభ ధరను రూ.12.89 లక్షలుగా నిర్ణయించగా, సఫారీ పెట్రోల్ ధర రూ.13.29 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి మొదలవుతుంది. ఈ ధరలు డీజిల్ వెర్షన్ల కంటే చాలా తక్కువగా ఉండటం విశేషం.
ఈ రెండు ఎస్‌యూవీల్లో ఉపయోగించిన కొత్త ఇంజిన్ 170 PS పవర్, 280 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది మ్యాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. పెట్రోల్ ఇంజిన్ కావడంతో క్యాబిన్ లోపల సౌండ్, వైబ్రేషన్లు చాలా తక్కువగా ఉంటాయి, దీనివల్ల ప్రయాణం ఎంతో స్మూత్‌గా సాగుతుంది. మైలేజ్ విషయంలో కూడా టాటా రికార్డులు సృష్టిస్తోంది. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రకారం.. హారియర్ పెట్రోల్ మ్యాన్యువల్ వెర్షన్ తన సెగ్మెంట్‌లో అత్యధిక మైలేజీని నమోదు చేసింది.
కొత్త పెట్రోల్ హారియర్, సఫారీలు కేవలం పవర్‌కే పరిమితం కాలేదు, ఫీచర్ల విషయంలోనూ దుమ్మురేపుతున్నాయి. ఇందులో 36.9 సెంటీమీటర్ల భారీ ఇన్ఫోటైన్‌మెంట్ టచ్‌స్క్రీన్, డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేసే ఆడియో సిస్టమ్ ఉన్నాయి. ఇక టెక్నాలజీ పరంగా.. ఇన్-బిల్ట్ డ్యాష్‌క్యామ్ ఉన్న డిజిటల్ రియర్ వ్యూ మిర్రర్, మెమరీ ఫంక్షన్ గల ORVMలు, డ్యూయల్ కెమెరా వాషర్ సిస్టమ్ వంటి అదిరిపోయే ఫీచర్లు ఉన్నాయి. వాయిస్ అసిస్టెంట్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీతో ఈ కార్లు స్మార్ట్‌గా మారాయి.
సేఫ్టీ విషయంలో టాటా అంటేనే నమ్మకం. కొత్త పెట్రోల్ మోడల్స్ కూడా భారత్ NCAP క్రాష్ టెస్ట్‌లో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను సాధించాయి. వీటిలో లెవల్-2 అడాస్ సిస్టమ్ ఉంది, ఇందులో 22 రకాల సేఫ్టీ ఫీచర్లు ప్రయాణికులకు పూర్తి రక్షణ కల్పిస్తాయి. పెట్రోల్ కారు అయినా, డీజిల్ కారు అయినా భద్రతలో మాత్రం తగ్గేదే లేదని టాటా నిరూపించింది.
వేరియంట్లు మరియు వెర్షన్లు: హారియర్ పెట్రోల్ Smart, Pure, Adventure మరియు Fearless వేరియంట్లలో లభిస్తోంది. ఇందులో స్పెషల్ Dark మరియు Red Dark ఎడిషన్లు కూడా ఉన్నాయి. ఇక సఫారీ పెట్రోల్ Smart, Pure, Adventure మరియు Accomplished వేరియంట్లలో 6-సీటర్ మరియు 7-సీటర్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది. ఎంపిక చేసిన వేరియంట్లలో డార్క్ ఎడిషన్లు కూడా లభిస్తాయి. మొత్తంమీద, ఈ పెట్రోల్ ఎస్‌యూవీల రాకతో ఇతర కంపెనీల కార్లకు గట్టి పోటీ ఎదురుకానుంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

