EV Sales : ఈవీ మార్కెట్‌లో టాటాదే హవా.. నవంబర్‌లో ఏకంగా ఎన్ని కార్లు అమ్మిందో తెలుసా ?

EV Sales : నవంబర్ 2025లో దేశీయ ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్‌లో పండుగల సందడి కనిపించలేదు. అక్టోబర్‌లో భారీ కొనుగోళ్ల తర్వాత, ఈసారి డిమాండ్ కాస్త నెమ్మదించడంతో చాలా బ్రాండ్‌ల అమ్మకాలు నెలవారీగా తగ్గాయి. అయినప్పటికీ టాప్-3 బ్రాండ్‌ల ర్యాంకింగ్‌లలో మాత్రం ఎటువంటి మార్పు లేదు. ఈసారి కూడా టాటా మోటార్స్ అత్యధిక అమ్మకాలతో మళ్లీ అగ్రస్థానం దక్కించుకుంది.
1. టాటా మోటార్స్
ఈవీ మార్కెట్‌లో డిమాండ్ తగ్గినప్పటికీ టాటా మోటార్స్ నవంబర్‌లో 6,096 యూనిట్లను విక్రయించింది. దీని ద్వారా కంపెనీ దాదాపు 41 శాతం మార్కెట్ వాటాను తన వద్దే ఉంచుకుంది. టాటా ఈ బలమైన స్థానాన్ని దక్కించుకోవడానికి ప్రధాన కారణం దాని సరసమైన, విభిన్నమైన ఎలక్ట్రిక్ కార్ల శ్రేణి. టియాగో ఈవీ, పంచ్ ఈవీ, నెక్సాన్ ఈవీ, కర్వ్ ఈవీ, హారియర్ ఈవీ వంటి మోడళ్లు వినియోగదారులలో నిరంతరం ప్రజాదరణ పొందుతూనే ఉన్నాయి. అక్టోబర్ (7,363) తో పోలిస్తే నవంబర్‌లో అమ్మకాలు తగ్గినా, టాటాదే నంబర్ వన్ స్థానం.
2. ఎంజీ మోటార్
ఎంజీ మోటార్స్ నవంబర్‌లో 3,658 యూనిట్లను విక్రయించి, సుమారు 25 శాతం మార్కెట్ వాటాను సాధించింది. అక్టోబర్ (4,744) తో పోలిస్తే అమ్మకాలు తగ్గినా, ఎంజీ స్థిరంగా నంబర్ 2 ర్యాంక్‌ను నిలబెట్టుకుంది. ఎంజీ బెస్ట్ సెల్లింగ్ మోడల్ విండ్‌సర్ ఈవీ మార్కెట్‌లో మంచి పట్టు సాధించింది. దీనితో పాటు ZS EV, కామెట్ EV మోడళ్లు కూడా ప్రజాదరణ పొందాయి. ప్రీమియం, సరసమైన విభాగాలలో స్ట్రాంగ్ పోర్ట్‌ఫోలియోను నిర్వహించడం ఎంజీ ప్రత్యేకత.
3. మహీంద్రా
మహీంద్రా ఈసారి 2,920 యూనిట్లను విక్రయించి 19 శాతం మార్కెట్ వాటాను దక్కించుకుంది. అక్టోబర్ (3,989) తో పోలిస్తే అమ్మకాలు తగ్గినప్పటికీ XUV400, కొత్తగా విడుదలైన XEV 9e, BE.6 వంటి మోడళ్ల కారణంగా కంపెనీ ఈవీ రంగంలో క్రమంగా బలోపేతం అవుతోంది. కొత్త XEV, BE సిరీస్‌లు మార్కెట్‌లోకి వచ్చిన తర్వాత మహీంద్రా ఉనికి మరింత ప్రభావవంతంగా మారింది.
4. ఇతర బ్రాండ్‌ల పరిస్థితి
మార్కెట్‌లోని టాప్ 3 బ్రాండ్‌లతో పోలిస్తే, ఇతర పెద్ద కంపెనీల ఈవీ అమ్మకాలు దాదాపు 3 శాతం మార్కెట్ వాటాకు పరిమితం అయ్యాయి.
కియా (Kia): 463 యూనిట్లు (ప్రధాన మోడళ్లు: EV6, EV9)
BYD: 417 యూనిట్లు (ప్రధాన మోడళ్లు: Atto 3, Seal)
హ్యుందాయ్ (Hyundai): 370 యూనిట్లు (ప్రధాన మోడళ్లు: Kona EV, Ioniq 5)
రాబోయే నెలల్లో, కొత్త మోడళ్ల విడుదల, ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు పెరగడం ద్వారా ఈవీ మార్కెట్ మళ్లీ ఊపందుకుంటుందని నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

