Tata Motors : ఎస్‌యూవీ మార్కెట్‌లో టాటా మోటార్స్ దండయాత్ర..జనవరిలో రికార్డు స్థాయి అమ్మకాలు.

Tata Motors : భారత ఆటోమొబైల్ రంగంలో మినీ, కాంపాక్ట్ ఎస్‌యూవీల హవా కొనసాగుతోంది. 2026 జనవరి నెల అమ్మకాల గణాంకాలను పరిశీలిస్తే.. ఈ విభాగంలో దేశీయ దిగ్గజం టాటా మోటార్స్ తన పట్టును మరింత బిగించింది. గతేడాది ఇదే సమయంతో పోలిస్తే ఈ సెగ్మెంట్ అమ్మకాలు 13.26 శాతం పెరిగి, మొత్తం 1,21,150 యూనిట్లు అమ్ముడయ్యాయి. టాటా నుంచి వచ్చిన రెండు మోడళ్లు నెక్సాన్, పంచ్ మార్కెట్‌ను ఊడ్చేశాయి. టాటా నెక్సాన్ ఏకంగా 23,365 యూనిట్ల అమ్మకాలతో మొదటి స్థానంలో నిలవడమే కాకుండా, 51.75 శాతం వృద్ధిని నమోదు చేసి ప్రత్యర్థులకు చుక్కలు చూపించింది.
టాటా పంచ్ 19,257 యూనిట్ల అమ్మకాలతో రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ రెండు మోడళ్ల దెబ్బకు మారుతి సుజుకికి చెందిన బ్రెజ్జా మూడో స్థానానికి పరిమితమైంది. బ్రెజ్జా 17,486 యూనిట్లు అమ్ముడుపోగా, త్వరలోనే దీనికి సంబంధించిన కొత్త వెర్షన్ రానుండటం విశేషం. మారుతి ఫ్రాంక్స్ అమ్మకాలు గతంతో పోలిస్తే కాస్త తగ్గి 13,353 యూనిట్ల వద్ద నిలిచాయి. హ్యుందాయ్ వెన్యూ 12,413 యూనిట్లు, కియా సోనెట్ 10,998 యూనిట్ల అమ్మకాలతో టాప్-5 రేసులో కొనసాగుతున్నాయి. ముఖ్యంగా కియా సోనెట్ అమ్మకాలు ఏకంగా 52.88 శాతం పెరగడం గమనార్హం.
మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌ఓ 8,845 యూనిట్ల అమ్మకాలతో నిలకడగా కొనసాగుతుండగా, హ్యుందాయ్ ఎక్స్‌టర్ మాత్రం 5,621 యూనిట్లకే పరిమితమైంది. అయితే, ఎక్స్‌టర్ కొత్త మోడల్ వచ్చే నెలలో విడుదల కానుండటంతో అమ్మకాలు మళ్ళీ పుంజుకుంటాయని కంపెనీ భావిస్తోంది. ఈ లిస్టులో ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే.. స్కోడా కైలాక్ అమ్మకాలు ఏకంగా 159.26 శాతం పెరిగి 3,220 యూనిట్లకు చేరుకున్నాయి. టయోటా టైజర్, నిస్సాన్ మాగ్నైట్ కూడా తమ వంతు పోటీని ఇస్తూ దాదాపు 2,500 యూనిట్ల చొప్పున విక్రయించబడ్డాయి.
కొన్ని కార్లు దుమ్మురేపుతుంటే, మరికొన్ని మాత్రం వెనుకబడిపోతున్నాయి. రెనాల్ట్ కైగర్ 703 యూనిట్లు, మారుతి జిమ్నీ 591 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. జిమ్నీలో త్వరలోనే అడాస్ వంటి అధునాతన సేఫ్టీ ఫీచర్లు రాబోతున్నాయి, తద్వారా అమ్మకాలు పెరుగుతాయని మారుతి ఆశపడుతోంది. ఇక కియా సైరోస్ అమ్మకాలు భారీగా క్షీణించి కేవలం 275 యూనిట్లకు పడిపోయాయి. అయితే, దీని ఎలక్ట్రిక్ వెర్షన్ రాకతో సీన్ మారుతుందని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. మొత్తానికి చిన్న ఎస్‌యూవీల యుద్ధంలో టాటా ప్రస్తుతానికి విజేతగా నిలిచింది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
