Tata Motors : జనవరిలో టాటా కార్ల సునామీ...నెక్సాన్, పంచ్ దెబ్బకు ప్రత్యర్థులు విలవిల.

Tata Motors : టాటా మోటార్స్ ఇండియన్ రోడ్లపై తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. 2026 సంవత్సరం ప్రారంభంలోనే టాటా కార్లు బాక్సాఫీస్ హిట్ సినిమాల్లా కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాయి. ముఖ్యంగా టాటా నెక్సాన్, టాటా పంచ్ అనే రెండు కార్లు కలిసి మార్కెట్లో తుఫాను సృష్టించాయి. 2026 జనవరి నెలలో కంపెనీ మొత్తం 70,222 ప్యాసింజర్ వాహనాలను విక్రయించి, వార్షిక ప్రాతిపదికన 46.1 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఈ భారీ అమ్మకాలతో టాటా మోటార్స్, హ్యుందాయ్ మరియు మహీంద్రా కంపెనీలను వెనక్కి నెట్టి భారతదేశంలో రెండో అతిపెద్ద కార్ల కంపెనీగా అవతరించింది. టాటా అమ్మకాల్లో సగానికి పైగా వాటా కేవలం నెక్సాన్ మరియు పంచ్ మోడళ్లదే కావడం విశేషం. జనవరిలో 23,365 మంది నెక్సాన్‌ను ఎంచుకోగా, 19,257 మంది పంచ్ కారును కొనుగోలు చేశారు.
కేవలం పెట్రోల్, డీజిల్ కార్లు మాత్రమే కాదు, ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో కూడా టాటా తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. జనవరిలో టాటా ఈవీల అమ్మకాలు 72.7 శాతం వృద్ధితో 9,052 యూనిట్లకు చేరాయి. టియాగో ఈవీ, నెక్సాన్ ఈవీ, పంచ్ ఈవీలకు వస్తున్న ఆదరణ టాటాను ఎలక్ట్రిక్ సెగ్మెంట్‌లో రారాజుగా నిలబెట్టింది. విదేశీ ఎగుమతుల్లో కూడా 844 యూనిట్లతో తన ఉనికిని చాటుకుంది. భద్రతకు పెద్దపీట వేసే టాటా కార్ల వైపు కస్టమర్లు మొగ్గు చూపడం ఈ విజయానికి ప్రధాన కారణం.
మరోవైపు, తాజాగా లాంచ్ అయిన టాటా సియెర్రా మార్కెట్లో ఊహించని రీతిలో బుకింగ్స్‌ను రాబడుతోంది. ఈ మోడల్ బుకింగ్ విండో ఓపెన్ చేసిన కేవలం 24 గంటల్లోనే 70,000 పైగా బుకింగ్స్ రావడం చూస్తుంటే, రాబోయే రోజుల్లో ఇది మరిన్ని రికార్డులను తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది. సియెర్రా క్లాసిక్ లుక్, మోడ్రన్ ఫీచర్లు కస్టమర్లను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. టాటా మోటార్స్ చరిత్రలోనే ఈ జనవరి నెల ఒక గోల్డెన్ మంత్‌గా నిలిచిపోయింది.
ప్రస్తుతం టాటా నెక్సాన్ దేశంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న కారుగా మొదటి స్థానంలో నిలవగా, టాటా పంచ్ మూడో స్థానంలో (ఎస్ యూవీ విభాగంలో రెండో స్థానం) నిలిచింది. మారుతి డిజైర్ స్వల్ప తేడాతో రెండో స్థానాన్ని దక్కించుకుంది. టాటా మోటార్స్ అందిస్తున్న సేఫ్టీ ఫీచర్లు, అదిరిపోయే డిజైన్లు, ఈవీ ఆప్షన్లు మిగతా బ్రాండ్లకు గట్టి పోటీనిస్తున్నాయి. రాబోయే బడ్జెట్ ప్రభావం, కొత్త మోడళ్ల రాకతో టాటా తన నంబర్ 2 స్థానాన్ని మరింత పటిష్టం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
