Tata Motors : రోడ్లపై టాటా మోటార్స్ విశ్వరూపం.. కొత్త 15 కార్లతో మార్కెట్ పై దండయాత్ర.

Tata Motors : భారతీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ భవిష్యత్తు కోసం భారీ స్కెచ్ వేసింది. అటు పెట్రోల్/డీజిల్ (ICE), ఇటు ఎలక్ట్రిక్ విభాగాల్లో కలిపి మొత్తం 15 కొత్త మోడళ్లను మార్కెట్లోకి తీసుకురాబోతున్నట్లు ప్రకటించింది. ఈ ప్రణాళికలో అందరినీ ఆకర్షిస్తున్న ప్రధాన అంశం.. ఒకప్పుడు రోడ్లపై రారాజుగా వెలిగిన టాటా సియెర్రా మళ్ళీ సరికొత్త హంగులతో తిరిగి రాబోతుండటం. దీనితో పాటు ప్రీమియం ఎలక్ట్రిక్ కార్ల కోసం అవిన్యా అనే కొత్త సబ్-బ్రాండ్‌ను కూడా టాటా పరిచయం చేస్తోంది.
టాటా మోటార్స్ తన సియెర్రా లైనప్‌ను రెండు రకాలుగా అభివృద్ధి చేస్తోంది. ఒకటి ఎలక్ట్రిక్ వెర్షన్, మరొకటి పెట్రోల్/డీజిల్ ఆల్-వీల్ డ్రైవ్ (AWD) మోడల్. సియెర్రా ఈవీ ఆగస్టు 2026 నాటికి మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే అదిరిపోయే రేంజ్‌ను ఇస్తుందని సమాచారం. ఇక ఆఫ్‌రోడింగ్ ఇష్టపడే వారి కోసం AWD వెర్షన్ 2027లో లాంచ్ కానుంది. 2020లో హెక్సా మోడల్‌ను ఆపేసిన తర్వాత టాటా నుంచి రాబోతున్న మొట్టమొదటి 4X4 ఐసీఈ మోడల్ ఇదే కావడం గమనార్హం.
టాటా మోటార్స్ ఒక కొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీపై కూడా పని చేస్తోంది, దీనికి ప్రస్తుతం టాటా స్కార్లెట్ అనే కోడ్ నేమ్ పెట్టారు. దీనిని ఆటోమొబైల్ వర్గాల్లో మినీ సియెర్రా అని పిలుస్తున్నారు. దీని డిజైన్ సియెర్రా నుంచి స్ఫూర్తి పొంది బాక్సీ లుక్‌లో ఉండబోతోంది. ఇందులో నెక్సాన్ లో వాడే 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో పాటు కొత్తగా రూపొందిస్తున్న 1.5 లీటర్ ఇంజిన్లను కూడా అమర్చబోతున్నారు. ఇది అటు పెట్రోల్ వెర్షన్ లోనూ, ఇటు ఎలక్ట్రిక్ వెర్షన్ లోనూ అందుబాటులోకి రానుంది.
రాబోయే టాటా సియెర్రా ఎస్‌యూవీలు ARGOS (ఆల్-టెర్రైన్ రెడీ, ఓమ్నీ-ఎనర్జీ, జియోమెట్రీ స్కేలబుల్ ఆర్కిటెక్చర్) ప్లాట్‌ఫారమ్ ఆధారంగా తయారవుతున్నాయి. ఈ ప్లాట్‌ఫారమ్ ప్రత్యేకత ఏంటంటే, ఇది విభిన్న రకాల బాడీ స్టైల్స్, ఇంజిన్ ఆప్షన్లను సపోర్ట్ చేస్తుంది. సియెర్రా ఈవీలో క్లోజ్డ్ గ్రిల్, కొత్త అల్లాయ్ వీల్స్, అప్‌డేటెడ్ బంపర్లు ఉండబోతున్నాయి. హ్యారియర్ ఈవీలో ఉండే కొన్ని ఫీచర్లను కూడా ఇందులో చూసే అవకాశం ఉంది.
టాటా మోటార్స్ తన ఈవీ విభాగంలో మరింత పట్టు సాధించేందుకు అవిన్యా అనే సబ్-బ్రాండ్‌ను కూడా సిద్ధం చేస్తోంది. దీని కింద రాబోయే కార్లు భవిష్యత్ డిజైన్లతో, అత్యంత విలాసవంతమైన ఫీచర్లతో ఉండబోతున్నాయి. మొత్తానికి టాటా మోటార్స్ తన 15 కొత్త మోడళ్లతో ఇండియన్ రోడ్లపై సరికొత్త విప్లవాన్ని తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ఇది గనుక సక్సెస్ అయితే ఎస్‌యూవీ మార్కెట్లో టాటాకు తిరుగుండదని విశ్లేషకులు భావిస్తున్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
