Tata Punch EV : కొత్త ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే..టాటా పంచ్ ఈవీ ఫేస్‌లిఫ్ట్ వచ్చేస్తోంది.

Tata Punch EV : టాటా మోటార్స్ తన ఎలక్ట్రిక్ వాహనాల సామ్రాజ్యాన్ని విస్తరించడంలో జెట్ స్పీడ్‌తో దూసుకుపోతోంది. 2030 నాటికి ఐదు కొత్త ఈవీ మోడళ్లను తీసుకురావాలనే లక్ష్యంతో ఉన్న టాటా, తన మోస్ట్ సక్సెస్‌ఫుల్ మైక్రో ఎస్‌యూవీ పంచ్ ఈవీని సరికొత్త ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. సియెర్రా ఈవీ విడుదలకు ముందే, ఈ సరికొత్త పంచ్ ఈవీ మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. డిజైన్ నుంచి రేంజ్ వరకు ఈ కొత్త మోడల్‌లో ఎలాంటి భారీ మార్పులు ఉండబోతున్నాయో తెలుసుకుందాం.
పవర్‌ఫుల్ జెన్-2 మోటార్
కొత్త పంచ్ ఈవీ ఫేస్‌లిఫ్ట్‌లో రాబోతున్న అతిపెద్ద మార్పు జెనరేషన్-2 ఎలక్ట్రిక్ మోటార్. ప్రస్తుతం ఉన్న మోడల్ కంటే ఇది మరింత శక్తివంతమైనది. ఇప్పటికే కొత్త నెక్సాన్ ఈవీలో వాడుతున్న ఈ టెక్నాలజీని ఇప్పుడు పంచ్‌లోకి కూడా తీసుకువస్తున్నారు. దీనివల్ల కారు వేగం పెరగడమే కాకుండా, ఎక్కడికైనా వెళ్లేటప్పుడు మంచి పికప్, స్మూత్ డ్రైవింగ్ అనుభూతిని ఇస్తుంది.
పెద్ద బ్యాటరీ.. అదిరిపోయే రేంజ్
టాటా పంచ్ ఈవీ బేస్ మోడల్ బ్యాటరీ సామర్థ్యాన్ని పెంచే ఆలోచనలో ఉంది కంపెనీ. ప్రస్తుతం ఉన్న 25 kWh బ్యాటరీని 30 kWhకి అప్‌గ్రేడ్ చేసే అవకాశం ఉంది. దీనివల్ల ఒక్కసారి ఛార్జ్ చేస్తే కారు ప్రయాణించే దూరం గణనీయంగా పెరుగుతుంది. రేంజ్ విషయంలో టెన్షన్ పడే వారికి ఇది నిజంగా శుభవార్త. అలాగే, లోపల ఉన్న 10.24 అంగుళాల టచ్‌స్క్రీన్‌ను తీసేసి, హారియర్ ఈవీ తరహాలో 12.2 అంగుళాల భారీ హై-రిజల్యూషన్ స్క్రీన్‌ను అమర్చబోతున్నారు.
సేఫ్టీలో అడాస్ మ్యాజిక్
సేఫ్టీ విషయంలో టాటా ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటుంది. ఈసారి పంచ్ ఈవీలో సెగ్మెంట్లోనే మొదటిసారిగా ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్) ఫీచర్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇప్పటికే ఇందులో 360-డిగ్రీ కెమెరా, నాలుగు చక్రాలకు డిస్క్ బ్రేకులు, బ్లైండ్ స్పాట్ మానిటర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. వీటికి తోడు అదాస్ కూడా తోడైతే, ఈ కారు సేఫ్టీలో రారాజుగా మారుతుంది.
పాదచారుల కోసం ఏవీఏఎస్
ఎలక్ట్రిక్ కార్లు వెళ్లేటప్పుడు శబ్దం రాదు, దీనివల్ల రోడ్డుపై నడిచే వారు కారు వస్తుందని గమనించలేరు. ఈ సమస్యను పరిష్కరించడానికి టాటా AVAS (Acoustic Vehicle Alerting System) ను తీసుకువస్తోంది. కారు తక్కువ స్పీడ్‌లో ఉన్నప్పుడు ఒక రకమైన శబ్దాన్ని చేస్తూ పాదచారులను అలర్ట్ చేస్తుంది. ఇది కర్వ్ ఈవీ, హారియర్ ఈవీలలో మనం ఇప్పటికే చూశాం. మొత్తం మీద కొత్త అవతారంలో రాబోతున్న పంచ్ ఈవీ ఈవీ మార్కెట్‌ను మరోసారి షేక్ చేయడం ఖాయం.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

