Tata Punch EV : అందానికి అందం.. రేంజ్ లో కింగ్.. టాటా పంచ్ ఈవీ ఫేస్ లిఫ్ట్ వచ్చేస్తోంది.

Tata Punch EV : అందానికి అందం.. రేంజ్ లో కింగ్.. టాటా పంచ్ ఈవీ ఫేస్ లిఫ్ట్ వచ్చేస్తోంది.
X

Tata Punch EV : టాటా మోటార్స్ తన టాటా పంచ్ EVని కొత్త హంగులతో మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 20న లాంచ్ కానున్న ఈ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ కేవలం పైన మెరుగులు దిద్దడమే కాకుండా, లోపల కూడా భారీ మార్పులతో వస్తోంది. ప్రస్తుత పంచ్ ఈవీలో వెనుక సీటు ప్రయాణికులకు ఏసీ వెంట్స్ లేకపోవడం ఒక పెద్ద లోటుగా ఉండేది. కానీ కొత్త ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లో ఈ సమస్య తీరనుంది. పెట్రోల్ వెర్షన్ పంచ్‌లో ఇప్పటికే ఈ ఫీచర్ ఉండగా, ఇప్పుడు ఈవీలో కూడా వెనుక వైపు ఏసీ వెంట్లను అమర్చుతున్నారు. దీనివల్ల ఎండకాలంలో వెనుక కూర్చునే ప్రయాణికులకు కూడా చల్లని ప్రయాణం అందుతుంది.

పంచ్ ఈవీ చూడటానికి చిన్నదిగా ఉన్నా, లోపల మరింత సౌకర్యవంతంగా మార్చబోతున్నారు. ముఖ్యంగా వెనుక సీటులో ముగ్గురు కూర్చున్నప్పుడు కొంచెం ఇరుకుగా అనిపించేది. ఈసారి టాటా కర్వ్ మోడల్ తరహాలో సీట్ డిజైన్ మార్చి, వెనుక ప్రయాణికులకు లెగ్ రూమ్, షోల్డర్ రూమ్ పెరిగేలా ప్లాన్ చేస్తున్నారు. దీనివల్ల లాంగ్ జర్నీలు మరింత హాయిగా సాగుతాయి.

ఎలక్ట్రిక్ కార్లంటే అందరూ చూసేది రేంజ్. ప్రస్తుతం ఉన్న 35 kWh బ్యాటరీ ప్యాక్ పేపర్ మీద 421 కిలోమీటర్లు అని చెబుతున్నా, రియల్ టైమ్‌లో సుమారు 250 కిలోమీటర్ల మైలేజీ మాత్రమే ఇస్తోంది. కొత్త అప్‌డేట్‌లో సాఫ్ట్‌వేర్ ఆప్టిమైజేషన్ ద్వారా లేదా బ్యాటరీ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (BMS) మెరుగుపరచడం ద్వారా రియల్ వరల్డ్ రేంజ్ మరికాస్త పెరిగే అవకాశం ఉంది. బ్యాటరీ సైజు మారకపోయినా, ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఇంకాస్త ఎక్కువ దూరం ప్రయాణించేలా టెక్నాలజీని వాడుతున్నారు.

టాటా పంచ్ ఈవీ టాప్ మోడల్ ధర 15 లక్షల పైమాటే. అయితే ఈ రేంజ్‌లో నెక్సాన్ EV (45 kWh బ్యాటరీ), మార్కెట్లోకి కొత్తగా వచ్చిన MG విండ్సర్ EV గట్టి పోటీ ఇస్తున్నాయి. అందుకే తన కస్టమర్లను నిలబెట్టుకోవడానికి టాటా ఈ ఫేస్‌లిఫ్ట్ ద్వారా ఫీచర్లను పెంచి, ధరను మాత్రం అందుబాటులో ఉంచే ప్రయత్నం చేస్తోంది.

Tags

Next Story