Tata Punch Facelift 2026 : మారుతికి చుక్కలు చూపిస్తున్న టాటా పంచ్..సరికొత్త లుక్ తో వచ్చేస్తోంది.

Tata Punch Facelift 2026 : టాటా మోటార్స్ తన సక్సెస్ ఫుల్ మోడల్ పంచ్‌ను కొత్త హంగులతో మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమైంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న పంచ్ మోడల్ అమ్మకాల్లో టాప్‌లో ఉన్నప్పటికీ, మారుతున్న కాలానికి అనుగుణంగా దీనికి 2026 ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను కంపెనీ ప్లాన్ చేస్తోంది. ఇటీవల రోడ్ల మీద టెస్టింగ్ చేస్తున్న సమయంలో కనిపించిన ఈ కారు ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ కొత్త పంచ్ చూడటానికి దాదాపు ప్రొడక్షన్ వెర్షన్ లాగే ఉండటంతో, 2026 మొదటి అర్ధభాగంలోనే ఇది లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
కొత్త టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ డిజైన్ చాలా వరకు పంచ్ ఈవీ నుంచి స్ఫూర్తి పొందింది. ముఖ్యంగా కారు ముందు భాగంలో కొత్త బంపర్, సన్నటి ఎల్‌ఈడీ డీఆర్ఎల్ సెటప్ ఈ కారుకు ప్రీమియం లుక్ ఇస్తాయి. హెడ్‌లైట్స్ ఇప్పుడు వెర్టికల్ గా అమర్చబడ్డాయి. సైడ్ ప్రొఫైల్‌లో కొత్త అలాయ్ వీల్స్ రాబోతున్నాయి. కారు వెనుక భాగంలో కూడా కనెక్టెడ్ టెయిల్ ల్యాంప్స్ వచ్చే అవకాశం ఉందని లీకైన సమాచారం ద్వారా తెలుస్తోంది. పాత పంచ్ రఫ్ అండ్ టఫ్ లుక్‌ను అలాగే ఉంచుతూనే, ఒక మోడరన్ టచ్ ఇచ్చారు.
కారు లోపల అడుగుపెడితే మార్పులు స్పష్టంగా కనిపిస్తాయి. ఇందులో టాటా నెక్సాన్ తరహాలో ఇల్యూమినేటెడ్ టాటా లోగో ఉన్న కొత్త స్టీరింగ్ వీల్ ఉండబోతోంది. డాష్ బోర్డ్ మీద 10.25 ఇంచుల భారీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. అంతేకాకుండా 10.25 ఇంచుల ఫుల్ డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే కూడా రానుంది. వేసవిలో ఉపశమనం కోసం వెంటైలేటెడ్ ఫ్రంట్ సీట్లు, వైర్‌లెస్ ఛార్జర్ వంటి ఫీచర్లు కూడా ఈ మైక్రో ఎస్‌యూవీలో ఉండబోతున్నాయి.
టాటా కార్లు అంటేనే సేఫ్టీకి మారుపేరు. ఈసారి పంచ్ ఫేస్‌లిఫ్ట్‌లో సెగ్మెంట్‌లో ఎప్పుడూ లేని విధంగా లెవల్ 2 ఏడీఏఎస్ ఫీచర్‌ను తీసుకురాబోతున్నట్లు సమాచారం. దీనికి తోడు 360 డిగ్రీ కెమెరా సిస్టమ్ కూడా ఉండటంతో, ఇరుకైన సందుల్లో పార్కింగ్ చేయడం చాలా సులభం అవుతుంది. 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి ఫీచర్లు కారు సేఫ్టీని మరింత పెంచుతాయి.
మెకానికల్ గా చూస్తే పెద్ద మార్పులేమీ ఉండకపోవచ్చు. ప్రస్తుతం ఉన్న 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ నే ఈ ఫేస్‌లిఫ్ట్ లోనూ కొనసాగిస్తారు. ఇది 86 bhp పవర్, 113 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే 5-స్పీడ్ మాన్యువల్, ఏఎంటీ గేర్‌బాక్స్ ఆప్షన్లు ఉంటాయి. మైలేజీ ప్రియుల కోసం టాటా ఫేమస్ ట్విన్ సిలిండర్ సీఎన్‌జీ (iCNG) మోడల్ కూడా అందుబాటులో ఉంటుంది.
టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ ధర సుమారు రూ.6.5 లక్షల నుంచి 11 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉండే అవకాశం ఉంది. ఇది మార్కెట్లోకి వస్తే హ్యుందాయ్ ఎక్స్టర్, మారుతి ఫ్రాంక్స్ వంటి కార్లకు గట్టి పోటీ ఇవ్వడం ఖాయం.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

