Tata Punch : అదిరిపోయే లుక్‌తో మైండ్ బ్లాక్ చేస్తున్న టీజర్..హారియర్, సఫారీ రేంజ్‌లో టాటా పంచ్ స్టైల్.

Tata Punch : టాటా మోటార్స్ నుంచి ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న చిన్నపాటి సునామీ రానే వచ్చింది. భారత మార్కెట్‌లో మైక్రో ఎస్‌యూవీ సెగ్మెంట్‌ను ఏలుతున్న టాటా పంచ్ ఇప్పుడు కొత్త అవతారంలో మెరవడానికి సిద్ధమైంది. ఇప్పటివరకు కేవలం టెస్టింగ్ షాట్లలో మాత్రమే కనిపించిన ఈ కారు, ఇప్పుడు మొదటిసారి అధికారికంగా తన రూపాన్ని టీజర్ ద్వారా బయటపెట్టింది. జనవరి 13న జరగబోయే గ్రాండ్ లాంచ్ కంటే ముందే ఈ టీజర్ నెట్టింట సెన్సేషన్ సృష్టిస్తోంది.
టాటా మోటార్స్ విడుదల చేసిన చిన్న వీడియో క్లిప్‌ను గమనిస్తే, పంచ్ ఫేస్‌లిఫ్ట్ తన పాత మోడల్ కంటే చాలా భిన్నంగా, ప్రీమియంగా కనిపిస్తోంది. ముఖ్యంగా దీని ఫ్రంట్ డిజైన్ టాటా ప్రీమియం ఎస్‌యూవీలైన హారియర్, సఫారీలను గుర్తుకు తెస్తోంది. ఇందులో కొత్తగా డిజైన్ చేసిన LED DRLs ఉన్నాయి, వీటికి పియానో బ్లాక్ ఎలిమెంట్స్ తో ఫినిషింగ్ ఇచ్చారు. సరికొత్త పాలిగోనల్ హెడ్‌లైట్ యూనిట్, రీడిజైన్ చేసిన ఫ్రంట్ బంపర్ ఈ కారుకు మునుపటి కంటే చాలా పవర్‌ఫుల్ మరియు అగ్రెసివ్ లుక్‌ను ఇచ్చాయి.
కారు సైడ్ ప్రొఫైల్ పాతదానిలాగే ఉన్నప్పటికీ, కొత్తగా వచ్చిన స్టైలిష్ అలాయ్ వీల్స్ పంచ్‌కు సరికొత్త కళను తెచ్చాయి. అయితే అసలు మ్యాజిక్ కారు వెనుక భాగంలో జరిగింది. హారియర్, సఫారీలలో చూసినట్లే.. కారు వెడల్పు మొత్తాన్ని కవర్ చేసే కనెక్టెడ్ లైట్ స్ట్రిప్ ఇప్పుడు పంచ్ ఫేస్‌లిఫ్ట్‌లో కూడా చేరింది. టెయిల్ ల్యాంప్ డిజైన్ కూడా పూర్తిగా మారిపోయింది. ఇవన్నీ ఒక కొత్త బ్లూ కలర్ షేడ్‌లో కనిపించడం విశేషం. ఈ మార్పులన్నీ చూస్తుంటే పంచ్ ఫేస్‌లిఫ్ట్ మార్కెట్‌లో మళ్ళీ నంబర్ వన్ స్థానాన్ని సుస్థిరం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.
కేవలం బయట మార్పులే కాదు, లోపల కూడా టాటా మోటార్స్ భారీగా ఫీచర్లను జోడించబోతోంది. పెద్ద టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, కొత్త డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, మరిన్ని ప్రీమియం ఫీచర్లు ఇందులో ఉండే అవకాశం ఉంది. సేఫ్టీ విషయంలో ఇప్పటికే 5-స్టార్ రేటింగ్‌తో దూసుకుపోతున్న పంచ్, ఇప్పుడు కొత్త లుక్‌తో వినియోగదారులను ఆకట్టుకోనుంది. జనవరి 13న కంపెనీ ధరలు, ఇతర పూర్తి వివరాలను వెల్లడించనుంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

