Tata Punch vs Hyundai Exter : టాటా పంచ్ వర్సెస్ హ్యుందాయ్ ఎక్స్టర్.. ఆరు లక్షలకే మైక్రో ఎస్‌యూవీల యుద్ధం.

Tata Punch vs Hyundai Exter : టాటా పంచ్ వర్సెస్ హ్యుందాయ్ ఎక్స్టర్.. ఆరు లక్షలకే మైక్రో ఎస్‌యూవీల యుద్ధం.
X

Tata Punch vs Hyundai Exter : భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో ప్రస్తుతం మైక్రో ఎస్‌యూవీల హవా నడుస్తోంది. ముఖ్యంగా రూ.6లక్షల బడ్జెట్‌లో కారు కొనాలనుకునే మధ్యతరగతి ప్రజలకు టాటా పంచ్, హ్యుందాయ్ ఎక్స్టర్ ప్రధాన ఎంపికలుగా నిలుస్తున్నాయి. ఈ రెండు కార్లు కూడా స్టైలిష్ డిజైన్, అదిరిపోయే ఫీచర్లు, నమ్మకమైన పెర్ఫార్మెన్స్‌తో వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. అయితే మీ అవసరాలకు ఏ కారు సరిపోతుంది? సేఫ్టీ ముఖ్యమా లేక ఫీచర్లు కావాలా? అన్న విషయంలో క్లారిటీ రావాలంటే ఈ రెండింటి మధ్య ఉన్న కీలక వ్యత్యాసాలను తెలుసుకోవాల్సిందే.

ముందుగా ఇంజిన్ సామర్థ్యాన్ని పరిశీలిస్తే.. టాటా పంచ్ 1.2 లీటర్ రెవోట్రాన్ 3-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. ఇది 86.5 HP పవర్‌ను, 115 NM టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది పెట్రోల్, పెట్రోల్+సిఎన్‌జి ఆప్షన్లలో లభిస్తుంది. దీని మైలేజీ లీటరుకు సుమారు 18.82 కి.మీ.గా కంపెనీ చెబుతోంది. మరోవైపు, హ్యుందాయ్ ఎక్స్టర్ 1.2 లీటర్, 4-సిలిండర్ కప్పా పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇది పంచ్ కంటే తక్కువగా అంటే 81.8 HP పవర్, 113.8 NM టార్క్‌ను ఇస్తుంది. అయితే ఎక్స్టర్ ఇంజిన్ 4-సిలిండర్ కావడం వల్ల డ్రైవింగ్ స్మూత్‌గా ఉంటుంది. శబ్దం తక్కువగా వస్తుంది. ఏప్రిల్ 2025 నుంచి దీని బేస్ వేరియంట్‌లో కూడా సిఎన్‌జి ఆప్షన్ అందుబాటులోకి వచ్చింది.

ఫీచర్ల విషయానికి వస్తే.. టాటా పంచ్ బేస్ మోడల్‎లో రియర్ పార్కింగ్ సెన్సార్లు, సెంట్రల్ లాకింగ్, ఫ్రంట్ పవర్ విండోస్, 4-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి అవసరమైన సదుపాయాలు ఉన్నాయి. హ్యుందాయ్ ఎక్స్టర్ బేస్ మోడల్ (EX)లో కూడా ఇవే ఫీచర్లతో పాటు స్పీడ్ సెన్సింగ్ ఆటో లాక్, సీట్ బెల్ట్ ప్రిటెన్షనర్లు, డిజిటల్ టీఎఫ్‌టీ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి అదనపు సౌకర్యాలు లభిస్తాయి. లోపల క్యాబిన్ స్పేస్, ప్రీమియం లుక్ పరంగా ఎక్స్టర్ స్వల్ప ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది.

సేఫ్టీ పరంగా చూస్తే ఈ రెండింటి మధ్య పెద్ద యుద్ధమే నడుస్తోంది. టాటా పంచ్ ఈ విభాగంలో తిరుగులేని రారాజుగా నిలిచింది. గ్లోబల్ ఎన్‌క్యాప్ క్రాష్ టెస్ట్‌లో పంచ్ 5-స్టార్ రేటింగ్ సాధించి అత్యంత సురక్షితమైన కారుగా గుర్తింపు పొందింది. దీనిలో డ్యూయల్ ఎయిర్‌బ్యాగులు, ఈఎస్పీ వంటి ఫీచర్లు ఉన్నాయి. అదే హ్యుందాయ్ ఎక్స్టర్ విషయానికి వస్తే, దీనికి ఇంకా అధికారిక క్రాష్ టెస్ట్ రేటింగ్ వెలువడలేదు. అయితే హ్యుందాయ్ మాత్రం తన కస్టమర్ల కోసం ఎక్స్టర్ అన్ని వేరియంట్లలో 6 ఎయిర్‌బ్యాగులను స్టాండర్డ్‌గా అందిస్తూ సేఫ్టీలో రాజీ పడలేదని నిరూపిస్తోంది. ఏది ఏమైనా, గట్టి బాడీ స్ట్రక్చర్ కావాలనుకునే వారు పంచ్‌ను, ఎక్కువ ఎయిర్‌బ్యాగులు కావాలనుకునే వారు ఎక్స్టర్‌ను ఇష్టపడుతున్నారు.

చివరిగా ధర విషయానికి వస్తే, ఈ రెండు కార్లు కూడా పోటీ పడుతున్నాయి. టాటా పంచ్ బేస్ మోడల్ ధర రూ.5,49,990 నుంచి ప్రారంభమవుతుండగా, హ్యుందాయ్ ఎక్స్టర్ బేస్ మోడల్ రూ.5,48,742 వద్ద స్వల్పంగా తక్కువకు లభిస్తోంది. టాప్ మోడల్ ధరలు కూడా దాదాపు రూ.10.50 లక్షల నుంచి రూ.10.75 లక్షల మధ్యలో ఉన్నాయి. మీకు పక్కా సేఫ్టీ, గరుకైన రోడ్లపై వెళ్లడానికి మంచి పవర్ కావాలంటే టాటా పంచ్ బెస్ట్. అలా కాకుండా స్మూత్ ఇంజిన్, అదిరిపోయే ఫీచర్లు, 6 ఎయిర్‌బ్యాగులు కావాలనుకుంటే హ్యుందాయ్ ఎక్స్టర్ సరైన ఎంపిక.

Tags

Next Story