Tata Safari : నెలకు రూ. 21 వేలతో ఇంటికి టాటా సఫారీ.. రాజసం ఉట్టిపడే ఎస్‌యూవీ వివరాలివే.

Tata Safari : భారతదేశపు రోడ్లపై రాజసం ఉట్టిపడేలా ప్రయాణించాలంటే అందరికీ గుర్తొచ్చే పేరు టాటా సఫారీ. 1998లో తొలిసారిగా భారత్ మార్కెట్లోకి అడుగుపెట్టిన ఈ ఎస్‌యూవీ, అప్పట్లో ఒక విప్లవాన్ని సృష్టించింది. మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్‌గా తనదైన ముద్ర వేసుకున్న సఫారీ, కాలానుగుణంగా ఎన్నో మార్పులు చెందుతూ ప్రస్తుతం సరికొత్త అవతారంలో అలరిస్తోంది. మీరు కూడా ఈ మెగా ఎస్‌యూవీని సొంతం చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే దీని ధర, ఫీచర్లు, మీరు నెలనెలా చెల్లించాల్సిన ఈఎంఐ లెక్కలేంటో పూర్తి వివరంగా చూద్దాం.
ప్రస్తుత తరం టాటా సఫారీ కేవలం స్టైలిష్‌గానే కాదు, సాంకేతికంగా కూడా ఎంతో పటిష్టమైంది. దీనిని జేఎల్ఆర్ కి చెందిన ప్రఖ్యాత D8 ప్లాట్‌ఫారమ్ ఆధారంగా రూపొందించిన OmegaArc ఆర్కిటెక్చర్‌పై నిర్మించారు. ఇదే ప్లాట్‌ఫారమ్‌పై ల్యాండ్ రోవర్ డిస్కవరీ స్పోర్ట్, రేంజ్ రోవర్ ఎవోక్ వంటి విలాసవంతమైన కార్లు కూడా తయారవుతాయి. ఇది 6-సీటర్, 7-సీటర్ ఆప్షన్లలో లభిస్తుంది. దీని ఎక్స్‌షోరూమ్ ధర రూ.13.29 లక్షల నుంచి ప్రారంభమై టాప్ మోడల్ రూ.25.96 లక్షల వరకు ఉంటుంది. అయితే ఆన్-రోడ్ ధరలు మీ నగరాన్ని బట్టి మారుతుంటాయి.
మీరు సఫారీలో అత్యంత విలాసవంతమైన టాప్ వేరియంట్ సఫారీ అకాంప్లిష్డ్ X+ 6S AT కొనాలని అనుకుంటే, దాని లెక్క ఇలా ఉంటుంది. దీని ఎక్స్‌షోరూమ్ ధర రూ.25.96 లక్షలు. మీరు మొత్తం ధరపై లోన్ తీసుకుని, వడ్డీ రేటు 9.5% గా ఉంటే.. మీరు ఎంచుకునే కాలాన్ని బట్టి ఈఎంఐలు మారుతాయి.
ఒకవేళ మీరు 3 ఏళ్ల (36 నెలలు) కాలానికి లోన్ తీసుకుంటే, నెలకు సుమారు రూ.32,033 ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. అదే 4 ఏళ్ల (48 నెలలు) కాలానికి అయితే నెలకు రూ.25,123, 5 ఏళ్ల (60 నెలలు) కాలానికి అయితే నెలకు రూ.21,002 వరకు ఈఎంఐ పడుతుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, మీరు ఎంత ఎక్కువ డౌన్ పేమెంట్ కడితే, నెలవారీ ఈఎంఐ అంత తక్కువగా ఉంటుంది. అలాగే బ్యాంకులు, మీ సిబిల్ స్కోర్ ఆధారంగా వడ్డీ రేట్లు కూడా మారుతుంటాయి.
సఫారీలో అత్యాధునిక సేఫ్టీ ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇందులో 7 ఎయిర్‌బ్యాగ్స్, ఏడీఏఎస్ (ADAS) టెక్నాలజీ, 360-డిగ్రీ కెమెరా, పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు వంటి ప్రీమియం ఫీచర్లు ప్రయాణాన్ని మరింత సుఖమయం చేస్తాయి. కేవలం లగ్జరీ మాత్రమే కాదు, పవర్‌ఫుల్ 2.0 లీటర్ క్రయోటెక్ డీజిల్ ఇంజిన్ దీనికి కొండ ప్రాంతాల్లో కూడా సునాయాసంగా దూసుకెళ్లే శక్తిని ఇస్తుంది. ఒక పక్క ఫ్యామిలీకి కావాల్సిన సౌకర్యం, మరోపక్క యువతకు కావాల్సిన పవర్.. రెండూ కలిపి సఫారీని ఒక కంప్లీట్ ప్యాకేజీగా మార్చాయి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
