Tata Sierra 2026 : టాటా సియెర్రా సునామీ..డీజిల్ వేరియంట్ కోసం ఎగబడుతున్న జనం.

Tata Sierra 2026 : భారతీయ రోడ్లపై ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన ఐకానిక్ బ్రాండ్ సియెర్రా ఇప్పుడు సరికొత్త అవతారంలో వచ్చి మార్కెట్‌ను షేక్ చేస్తోంది. టాటా మోటార్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా పునఃప్రవేశపెట్టిన ఈ ఎస్‌యూవీకి కస్టమర్ల నుంచి ఊహించని స్పందన లభిస్తోంది. నవంబర్ 25, 2025న లాంచ్ అయిన మొదటి రోజే ఏకంగా 70,000 బుకింగ్‌లు సాధించిందంటే ఈ కారు క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం, ఈ బుకింగ్‌ల సంఖ్య రోజురోజుకూ రికార్డు స్థాయిలో పెరుగుతోంది.
చిత్రమేమిటంటే, ప్రస్తుతం అంతా పెట్రోల్, ఎలక్ట్రిక్ వైపు మొగ్గు చూపుతున్న తరుణంలో సియెర్రా విషయంలో మాత్రం కస్టమర్లు మళ్ళీ డీజిల్ వైపు మొగ్గు చూపుతున్నారు. మొత్తం బుకింగ్‌లలో దాదాపు 55 శాతం వాటా డీజిల్ వేరియంట్‌లదే కావడం విశేషం. మిగిలిన 25 శాతం బుకింగ్‌లు నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ మోడళ్లకు, కేవలం 20 శాతం మాత్రమే టర్బో-పెట్రోల్ వేరియంట్లకు వస్తున్నాయి. లాంగ్ జర్నీలు చేసే వారికి, పవర్‌ఫుల్ టార్క్ కావాలనుకునే వారికి డీజిల్ వెర్షనే బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తోంది.
సియెర్రా ఏకంగా 7 రకాల వేరియంట్లలో (స్మార్ట్+, ప్యూర్, ప్యూర్+, అడ్వెంచర్, అడ్వెంచర్+, అకమ్ప్లిష్డ్, అకమ్ప్లిష్డ్+) అందుబాటులో ఉంది.
డీజిల్ ఇంజిన్: 1.5 లీటర్ ఇంజిన్ 118 bhp పవర్, 280 Nm టార్క్‌ను అందిస్తుంది. బేస్ వేరియంట్ మినహా మిగిలిన అన్నింటిలో ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ ఉంది.
పెట్రోల్ ఇంజిన్: 1.5 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్ (106 bhp), 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లు ఉన్నాయి. టర్బో పెట్రోల్ కేవలం ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో మాత్రమే వస్తుంది.
టాటా మోటార్స్ ఈ కారును కేవలం ఫీచర్ల పరంగానే కాదు, రంగుల విషయంలోనూ అద్భుతంగా తీర్చిదిద్దింది. సియెర్రా మొత్తం 6 ఆకర్షణీయమైన కలర్లలో లభిస్తోంది. అండమాన్ అడ్వెంచర్, బెంగాల్ రూజ్, మున్నార్ మిస్ట్, ప్రిస్టైన్ వైట్, ప్యూర్ గ్రే మరియు కూర్గ్ క్లౌడ్. ఇందులో అండమాన్ అడ్వెంచర్ (ఎల్లో), మున్నార్ మిస్ట్ రంగులకు యూత్ నుంచి విపరీతమైన డిమాండ్ ఉంది. మీరు ఎంచుకునే వేరియంట్‌ను బట్టి ఈ కలర్ ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి.
ధర విషయానికి వస్తే, టాటా మోటార్స్ మధ్యతరగతి, లగ్జరీ ప్రియులు ఇద్దరినీ దృష్టిలో ఉంచుకుంది. బేస్ వేరియంట్ ప్రారంభ ధర రూ.11.49 లక్షలు కాగా, అన్ని ఫీచర్లు ఉన్న టాప్ మోడల్ ధర రూ.21.29 లక్షల (ఎక్స్‌షోరూమ్) వరకు ఉంది. ఇది నేరుగా హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి సుజుకి గ్రాండ్ విటారా, హోండా ఎలివేట్ వంటి దిగ్గజ కార్లతో తలపడుతోంది. అయితే సియెర్రాకు ఉన్న పాత బ్రాండ్ ఇమేజ్, కొత్త టెక్నాలజీ దీనికి ప్లస్ పాయింట్ అయ్యాయి. జనవరి 15, 2026 నుండి డెలివరీలు ప్రారంభం కానుండటంతో రోడ్లపై సియెర్రా హవా మొదలుకానుంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

