Tata Sierra Bookings : టాటా సియెర్రా మేనియా..లక్ష దాటిన బుకింగ్స్.. రికార్డులు బద్ధలు.

Tata Sierra Bookings : టాటా మోటార్స్ ఐకానిక్ బ్రాండ్ సియెర్రా మళ్ళీ మార్కెట్లోకి వచ్చి రాగానే సంచలనాలు సృష్టిస్తోంది. ఒకప్పుడు ఇండియన్ రోడ్లపై రాజులా ఏలిన ఈ ఎస్‌యూవీ, ఇప్పుడు సరికొత్త హంగులతో రీ-ఎంట్రీ ఇచ్చి కస్టమర్లను పిచ్చెక్కిస్తోంది. బుకింగ్స్ మొదలైన కొద్ది రోజుల్లోనే లక్ష మందికి పైగా దీని కోసం క్యూ కట్టారంటే ఈ కారు క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. డిమాండ్ మామూలుగా లేకపోవడంతో టాటా మోటార్స్ తన ప్రొడక్షన్ ప్లాన్‌ను కూడా మార్చుకోవాల్సి వచ్చింది.
టాటా మోటార్స్ తన లెజెండరీ ఎస్‌యూవీ సియెర్రాను సరికొత్త లైఫ్‌స్టైల్ అవతారంలో తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. 2025 డిసెంబర్ 16న అధికారికంగా బుకింగ్స్ ప్రారంభించగా, మొదటి రోజే ఏకంగా 70,000 మంది దీని కోసం పోటీ పడ్డారు. ఇప్పుడు ఆ సంఖ్య లక్ష మార్కును దాటేసింది. ఈ భారీ డిమాండ్‌ను చూసి కంపెనీ యాజమాన్యమే ఆశ్చర్యపోయింది. కస్టమర్లకు కారును త్వరగా అందించేందుకు వీలుగా తన మ్యాన్యుఫ్యాక్చరింగ్ ప్లాన్‌ను టాటా మోటార్స్ పునఃసమీక్షిస్తోంది. వెయిటింగ్ పీరియడ్ తగ్గించేందుకు వీలుగా ప్రొడక్షన్ షిఫ్టులను పెంచుతున్నారు.
ఈ కారు ముఖ్యంగా పెద్ద నగరాలతో పాటు చిన్న పట్టణాల్లోనూ విపరీతమైన ఆదరణ పొందుతోంది. ఇప్పటికే కొన్ని కీలక మార్కెట్లలో డెలివరీలు ప్రారంభం కాగా, రాబోయే నెలల్లో ఉత్పత్తిని మరింత వేగవంతం చేయాలని టాటా నిర్ణయించింది. కేవలం ఫీచర్లు మాత్రమే కాకుండా, దీని డిజైన్, పాత సియెర్రా బ్రాండ్ వాల్యూ కస్టమర్లను కట్టిపడేస్తోంది. క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడకుండానే ఉత్పత్తిని క్రమంగా పెంచనున్నట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.
టాటా సియెర్రాలో ప్రధానంగా మూడు ఇంజిన్ ఆప్షన్లను అందుబాటులోకి తెచ్చారు. ఇందులో 1.5 లీటర్ల నేచురల్లీ ఆస్పిరేటెడ్ రెవోట్రాన్ పెట్రోల్ ఇంజిన్, పవర్ఫుల్ క్రయోటెక్ డీజిల్ ఇంజిన్, అధునాతన TGDi హైపెరియన్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఉన్నాయి. ట్రాన్స్‌మిషన్ పరంగా 6-స్పీడ్ మాన్యువల్, 7-స్పీడ్ డీసీటీ, 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలను ఇచ్చారు. దీనివల్ల డ్రైవింగ్ అనుభవం ఎంతో స్మూత్‌గా ఉంటుందని కంపెనీ చెబుతోంది.
ధర విషయానికి వస్తే టాటా సియెర్రా బేస్ మోడల్ ధర రూ.11.49 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. టాప్-ఎండ్ మోడల్ ధర రూ.21.29 లక్షల వరకు ఉంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఈ కారు బేస్ వేరియంట్‌లో కూడా టాటా మోటార్స్ ప్రీమియం ఫీచర్లను అందించింది. భద్రతకు పెద్దపీట వేస్తూ అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS), విశాలమైన సన్‌రూఫ్, అల్ట్రా-మోడ్రన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో ఈ కారు మార్కెట్లో దుమ్మురేపుతోంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
