Tata Sierra : టాటా సియెర్రా ఊచకోత.. 10 వేల డెలివరీలు పూర్తి, లక్ష దాటిన బుకింగ్స్.

Tata Sierra : టాటా సియెర్రా ఊచకోత.. 10 వేల డెలివరీలు పూర్తి, లక్ష దాటిన బుకింగ్స్.
X

Tata Sierra : టాటా మోటార్స్ ఐకానిక్ బ్రాండ్ టాటా సియెర్రా మళ్ళీ భారత రోడ్లపై తన పతాకాన్ని ఎగురవేస్తోంది. కొత్త అవతారంలోకి వచ్చిన ఈ ఎస్‌యూవీ డెలివరీలు ప్రారంభమైన అతి తక్కువ కాలంలోనే సరికొత్త రికార్డును సృష్టించింది. జనవరి 15, 2026 నుంచి డెలివరీలు మొదలవ్వగా, ఇప్పటివరకు 10,000 యూనిట్ల మార్కును దాటేసింది. నిజానికి ఈ కారుకు ఉన్న క్రేజ్ బుకింగ్స్ సమయంలోనే అర్థమైంది. డిసెంబర్ 2025లో బుకింగ్స్ మొదలైన కేవలం 24 గంటల్లోనే 70 వేల ఆర్డర్లు రాగా, ప్రస్తుతం ఆ సంఖ్య లక్ష దాటిపోయింది. కస్టమర్ల నుంచి వస్తున్న ఈ భారీ డిమాండ్‌ను తట్టుకోవడానికి టాటా మోటార్స్ తన సానంద్ ప్లాంట్‌లో ఉత్పత్తిని యుద్ధ ప్రాతిపదికన పెంచుతోంది.

టాటా సియెర్రా ధరలు కూడా మధ్యతరగతి, ప్రీమియం కస్టమర్లను ఆకట్టుకునేలా ఉన్నాయి. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.11.49 లక్షల నుంచి రూ. 21.29 లక్షల మధ్యలో ఉంది. ఈ కారు మొత్తం 7 ట్రిమ్స్ (స్మార్ట్ ప్లస్, ప్యూర్, ప్యూర్ ప్లస్, అడ్వెంచర్, అడ్వెంచర్ ప్లస్, అకంప్లిష్డ్, అకంప్లిష్డ్ ప్లస్), 24 వేరియంట్లలో లభిస్తోంది. ఇంజిన్ ఆప్షన్ల విషయానికి వస్తే.. ఇందులో మూడు రకాలు ఉన్నాయి. 106 hp శక్తినిచ్చే 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్, 160 hp ఇచ్చే శక్తివంతమైన 1.5 లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్, 118 hp ఇచ్చే 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్. టర్బో-పెట్రోల్ వెర్షన్ కేవలం ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో మాత్రమే వస్తోంది.

ఫీచర్ల పరంగా టాటా సియెర్రా ఒక కదులుతున్న గదిలా ఉంటుంది. ఇందులో ట్రిపుల్-స్క్రీన్ సెటప్ ప్రధాన ఆకర్షణ. డ్రైవర్ కోసం 10.25 అంగుళాల డిజిటల్ డిస్‌ప్లే ఉండగా, పక్కన ఉన్న ప్యాసింజర్ కోసం రెండు 12.3 అంగుళాల టచ్‌స్క్రీన్‌లు ఉన్నాయి. వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో/యాపిల్ కార్‌ప్లే, పనోరమిక్ సన్‌రూఫ్, 12-స్పీకర్ల జేబీఎల్ సౌండ్ సిస్టమ్, పవర్డ్ టెయిల్‌గేట్, వెంటిలేటెడ్ సీట్లు, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్ వంటి అత్యాధునిక ఫీచర్లు ఇందులో ఉన్నాయి. వెనుక సీట్లలో కూర్చునే వారి కోసం సన్ షేడ్స్, బాస్ మోడ్ వంటి సౌకర్యాలు కూడా కల్పించారు.

సేఫ్టీ విషయంలో టాటా ఎప్పుడూ కాంప్రమైజ్ అవ్వదు. కొత్త సియెర్రాలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్ విత్ ఈబీడీ, ఈఎస్‌పీ, 360-డిగ్రీ కెమెరా వంటి స్టాండర్డ్ ఫీచర్లు ఉన్నాయి. వీటితో పాటు 22 ఫీచర్లతో కూడిన లెవల్ 2 ఏడీఏఎస్ టెక్నాలజీ ఈ కారును మరింత సురక్షితంగా మార్చింది. ఆల్-వీల్ డిస్క్ బ్రేక్‌లు ప్రయాణికులకు అదనపు భరోసానిస్తాయి. మార్కెట్లో హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి గ్రాండ్ విటారా వంటి దిగ్గజ కార్లకు టాటా సియెర్రా ఇప్పుడు గట్టి పోటీనిస్తోంది. పాత తరం సియెర్రా జ్ఞాపకాలతో పాటు కొత్త తరం టెక్నాలజీ తోడవ్వడంతో ఈ కారు హాట్ కేకుల్లా అమ్ముడవుతోంది.

Tags

Next Story