Tata Sierra : సరికొత్త లుక్‌లో 90s ఐకాన్ కారు మళ్లీ వచ్చేసింది..లాంచ్ డేట్ కూడా ఫిక్స్.

Tata Sierra : ఒకప్పుడు రోడ్లపై చాలా ఫేమస్ అయిన టాటా సియెరా ఎస్‌యూవీ ఇప్పుడు సరికొత్త రూపంలో మార్కెట్‌లోకి రాబోతోంది. 90వ దశకంలో ఈ కారుకు యువతలో మంచి క్రేజ్ ఉండేది. ఇప్పుడు టాటా మోటార్స్ సంస్థ, పాత సియెరా స్టైల్‌ను అస్సలు మిస్ కాకుండా దానికి ఈ తరం అడ్వాన్స్‌డ్ టెక్నాలజీని జోడించి కొత్త మోడల్‌ను తయారు చేసింది. ఈ కారు నవంబర్ 25, 2025న లాంచ్ కానుంది. దీని ధర సుమారు రూ.11 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉండే అవకాశం ఉంది. ఈ ధరలో వస్తే, ఇది క్రెటా, సెల్టోస్ వంటి కార్లకు గట్టి పోటీ ఇవ్వగలదు.
డిజైన్, లుక్స్
కొత్త సియెరా డిజైన్ చూస్తే పాత సియెరాను గుర్తు చేసినా ప్రతి భాగంలోనూ మోడర్న్ టచ్ కనిపిస్తుంది. ముందు భాగంలో నిలువుగా ఉండే LED హెడ్‌ల్యాంప్స్, బ్లాక్ గ్రిల్, సిల్వర్ స్కిడ్ ప్లేట్ దీనికి చాలా బోల్డ్ లుక్ ఇస్తాయి. ఈ ఎస్‌యూవీ పక్కల నుంచి చూస్తే, బాక్సీ ఆకారంలో ఉండి, 18 లేదా 19 అంగుళాల పెద్ద అల్లాయ్ వీల్స్‌తో కనిపిస్తుంది. డోర్ హ్యాండిల్స్ లోపలికి ఉండేలా డిజైన్ చేశారు. వెనుకవైపు, చుట్టూ అద్దం, ఫుల్ LED టెయిల్‌లైట్స్ పాత సియెరా జ్ఞాపకాలను మళ్లీ తెస్తాయి. మొత్తం సుమారు 4.3 మీటర్ల పొడవుతో ఈ కారు కుటుంబ అవసరాలకు చాలా బాగా సరిపోతుంది.
ట్రిపుల్ స్క్రీన్ స్పెషల్
కొత్త సియెరా కారు ఇంటీరియర్ చాలా మోడర్న్‌గా, లగ్జరీగా ఉంది. దీనిలో అత్యంత ముఖ్యమైన ఆకర్షణ ట్రిపుల్ స్క్రీన్ సెటప్. అంటే, డ్రైవర్ కోసం ఒకటి, పెద్ద టచ్‌స్క్రీన్ ఒకటి, పక్కన కూర్చునే ప్యాసింజర్ కోసం ప్రత్యేకంగా మరో స్క్రీన్ ఇందులో ఉంటాయి. ఇందులో 12.3 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంటుంది. దీనికి వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే కనెక్ట్ చేసుకోవచ్చు. వీటితో పాటు రెండు వైపులా ఉష్ణోగ్రతను అడ్జస్ట్ చేసుకునే డ్యూయల్-జోన్ ఏసీ, వెంటిలేటెడ్ సీట్లు, పెద్ద సన్‌రూఫ్, వైర్‌లెస్ ఛార్జింగ్, లోపల లైటింగ్ వంటి ప్రీమియం ఫీచర్లు కూడా ఉన్నాయి.
ఇంజిన్ ఆప్షన్లు, మైలేజ్
టాటా సంస్థ ఈ సియెరాను మూడు రకాల ఇంజిన్ ఆప్షన్లలో తీసుకురాబోతోంది.. పెట్రోల్, డీజిల్, పూర్తిగా ఎలక్ట్రిక్. పెట్రోల్ వెర్షన్‌లో 1.5 లీటర్ టర్బో ఇంజిన్ ఉంటుంది. ఇది దాదాపు 170 హార్స్‌పవర్ శక్తిని ఇస్తుంది. డీజిల్ వెర్షన్ దాదాపు 118 హార్స్‌పవర్ శక్తితో వస్తుంది. ఇందులో మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. మైలేజ్ విషయానికి వస్తే పెట్రోల్, డీజిల్ కార్లు 15 నుంచి 20 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇచ్చే అవకాశం ఉందని కంపెనీ చెబుతోంది.
సేఫ్టీ ఫీచర్లు
ప్రస్తుతం టాటా కార్లు సేఫ్టీలో చాలా పటిష్టంగా ఉంటాయి. అదే విధంగా కొత్త సియెరాలో కూడా సేఫ్టీకి పెద్ద పీట వేశారు. ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, కారు చుట్టూ చూసుకునేందుకు 360° కెమెరా, లెవెల్-2 ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్) వంటి ఫీచర్లు ఉన్నాయి. వీటితో పాటు ABS, ESC, హిల్ కంట్రోల్ వంటి ముఖ్యమైన సేఫ్టీ ఫీచర్లు కూడా ఇందులో ఉంటాయి. స్టైలిష్ లుక్, అదిరిపోయే ఫీచర్లు, పూర్తి భద్రతతో రాబోతున్న ఈ కొత్త సియెరా కారు కొనాలనుకునే వారికి ఒక బెస్ట్ ఆప్షన్ కావచ్చు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

