Tata Sierra : సియెర్రా సునామీ.. లక్ష మార్కును దాటిన బుకింగ్స్.. టాటా చరిత్రలోనే బిగ్గెస్ట్ హిట్.

Tata Sierra : టాటా మోటార్స్ ఐకానిక్ బ్రాండ్ సియెర్రా రీ-ఎంట్రీ అదిరిపోయింది. గతేడాది నవంబర్ 25న మార్కెట్లోకి వచ్చిన ఈ సరికొత్త ఎస్‌యూవీ, అమ్మకాల్లో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఈ కారు పుణ్యమా అని టాటా మోటార్స్ 2026 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 6 లక్షల యూనిట్ల హోల్‌సేల్ విక్రయాల మైలురాయిని చేరుకోవడానికి సిద్ధమైంది. బుకింగ్స్ మొదలైన మొదటి రోజే 70,000 ఆర్డర్లు రావడమే దీని క్రేజ్ ఏపాటిదో నిరూపించింది. జనవరి 15 నుంచి డెలివరీలు ప్రారంభం కాగా, కేవలం ఫిబ్రవరి నెలాఖరుకే సుమారు 14,394 యూనిట్లు అమ్ముడయ్యాయంటే సామాన్యమైన విషయం కాదు.
టాటా పోర్ట్‌ఫోలియోలో మూడో స్థానం
ప్రస్తుతం టాటా మోటార్స్ విక్రయిస్తున్న కార్లలో నెక్సాన్, పంచ్ తర్వాత అత్యధికంగా అమ్ముడవుతున్న కారుగా సియెర్రా నిలిచింది. ఇది కంపెనీకి చెందిన పాపులర్ మోడల్స్ హారియర్, సఫారీలను కూడా వెనక్కి నెట్టి మూడో స్థానానికి చేరుకోవడం విశేషం. జనవరి నెలలో కంపెనీ సాధించిన రికార్డు విక్రయాల్లో (70,222 యూనిట్లు) సియెర్రా వాటా 10 శాతంగా ఉంది. ఫిబ్రవరిలో ఇది మరింత పెరిగి 11 శాతానికి చేరింది. ప్రస్తుతం ఈ కారు కోసం లక్షకు పైగా బుకింగ్స్ పెండింగ్‌లో ఉండటంతో, డిమాండ్‌కు తగ్గట్టుగా ఉత్పత్తిని పెంచేందుకు టాటా మోటార్స్ కసరత్తు చేస్తోంది.
ఫీచర్లు, ధరల వివరాలు
టాటా సియెర్రా మొత్తం 24 వేరియంట్లలో అందుబాటులో ఉంది. దీని ధర రూ.11.49 లక్షల నుంచి ప్రారంభమై టాప్ ఎండ్ వెరియంట్ రూ.21.29 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. ఇంజిన్ పరంగా చూస్తే, ఇందులో సరికొత్త 1.5 లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌ను ప్రవేశపెట్టారు. వీటితో పాటు రెగ్యులర్ 1.5 లీటర్ పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఆప్షన్లు కూడా ఉన్నాయి. మైలేజీ విషయానికి వస్తే, పెట్రోల్ వెర్షన్ లీటరుకు 16-18 కి.మీ, డీజిల్ వెర్షన్ 18-20 కి.మీ వరకు ఇస్తుందని ARAI ధృవీకరించింది.
గట్టి పోటీ.. తిరుగులేని క్రేజ్
మిడ్-సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో సియెర్రా నేరుగా హ్యుందాయ్ క్రెటా, మారుతి గ్రాండ్ విటారా, కియా సెల్టోస్, హోండా ఎలివేట్, త్వరలో రాబోతున్న రెనాల్ట్ డస్టర్‌లకు గట్టి పోటీ ఇస్తోంది. పాత తరం సియెర్రాకు ఉన్న ఎమోషనల్ కనెక్ట్, దానికి తోడు ఇప్పుడున్న మోడ్రన్ ఫీచర్లు, విశాలమైన క్యాబిన్ స్పేస్ ఈ కారును సూపర్ హిట్ చేశాయి. టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్ విభాగంలో గత ఏడాదితో పోలిస్తే 34 శాతం వృద్ధిని నమోదు చేయడం వెనుక సియెర్రా మ్యాజిక్ స్పష్టంగా కనిపిస్తోంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
