Tata Sierra vs Renault Duster : టాటా సియెర్రా వర్సెస్ రెనాల్ట్ డస్టర్..పవర్‌ఫుల్ మొనగాడు ఎవరు?

Tata Sierra vs Renault Duster : భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో ప్రస్తుతం మిడ్ సైజ్ ఎస్‌యూవీల హవా నడుస్తోంది. ఒకప్పుడు రోడ్లపై రారాజులుగా వెలుగొంది, ఆ తర్వాత కనుమరుగైన రెండు దిగ్గజ బ్రాండ్లు ఇప్పుడు సరికొత్త అవతారంలో మళ్లీ మన ముందుకు వచ్చాయి. అవే టాటా సియెర్రా, రెనాల్ట్ డస్టర్. టాటా మోటార్స్ తన ఐకానిక్ సియెర్రాను ప్రీమియం లుక్‌తో రీ-లాంచ్ చేయగా, రెనాల్ట్ తన మోస్ట్ సక్సెస్‌ఫుల్ డస్టర్‌ను సరికొత్త జనరేషన్ ఫీచర్లతో రంగంలోకి దించింది. ఈ రెండింటిలో ఏది పవర్‌ఫుల్? దేని ఫీచర్లు అదిరిపోయాయి? ఎవరి సైజు పెద్దది? అనే ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం.
డిజైన్, కొలతలు: టాటా సియెర్రా సరికొత్త ARGOS ప్లాట్‌ఫామ్‌పై నిర్మించబడింది. ఇది కేవలం పెట్రోల్, డీజిల్ మాత్రమే కాకుండా ఎలక్ట్రిక్ వెర్షన్‌కు కూడా సపోర్ట్ చేసేలా డిజైన్ చేశారు. ఆఫ్-రోడింగ్ ఇష్టపడే వారి కోసం ఇందులో 205 mm గ్రౌండ్ క్లియరెన్స్, 450 mm వరకు వాటర్ వేడింగ్ (నీటిలో ప్రయాణించే) సామర్థ్యం ఇచ్చారు. దీని 10.6 మీటర్ల టర్నింగ్ సర్కిల్ ఇరుకైన రోడ్లపై కూడా సులభంగా మలుపులు తిరగడానికి సహాయపడుతుంది.
మరోవైపు, రెనాల్ట్ డస్టర్ RGMB ప్లాట్‌ఫామ్‌పై తయారైంది. ఇందులో 90 శాతం విడిభాగాలు కేవలం భారతీయ మార్కెట్ కోసం ప్రత్యేకంగా రూపొందించినవే. డస్టర్ గ్రౌండ్ క్లియరెన్స్ సియెర్రా కంటే కొంచెం ఎక్కువగా 212 mm ఉండటం విశేషం. దీని అప్రోచ్ యాంగిల్ (26.9 డిగ్రీలు), డిపార్చర్ యాంగిల్ (34.7 డిగ్రీలు) గతుకుల రోడ్లపై ప్రయాణాన్ని చాలా సులభం చేస్తాయి. డస్టర్ పైన ఉన్న రూఫ్ బార్స్ 50 కిలోల వరకు బరువును మోయగలవు, ఇది లాంగ్ ట్రిప్స్ వేసే అడ్వెంచర్ ప్రియులకు బాగా ఉపయోగపడుతుంది.
టెక్నాలజీ, ఫీచర్లు: హైటెక్ హంగులు టాటా సియెర్రాలో TiDAL 2.0 అనే అధునాతన ఎలక్ట్రికల్ ఆర్కిటెక్చర్‌ను వాడారు. ఇది 5G కనెక్టివిటీ, OTA అప్‌డేట్స్‌ను సపోర్ట్ చేస్తుంది. లోపల చూస్తే 12.29 అంగుళాల భారీ టచ్‌స్క్రీన్, 10.23 అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మనల్ని ఆకట్టుకుంటాయి. ప్రయాణికుల సౌకర్యం కోసం వెనుక సీట్లలో 2-స్టెప్ రీక్లైన్ ఆప్షన్, కూల్డ్ గ్లోవ్ బాక్స్, 65W ఫాస్ట్ ఛార్జింగ్ పోర్ట్స్ వంటి ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి.
రెనాల్ట్ డస్టర్ కూడా తక్కువ తినలేదు. ఇందులో 6-వే పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, వెంటిలేటెడ్ సీట్లు (వేసవిలో చల్లగా ఉండే సీట్లు), 360-డిగ్రీ కెమెరా ఉన్నాయి. అంతేకాకుండా, గూగుల్ అసిస్టెంట్ ఇన్‌బిల్ట్‌గా రావడం, ఎలక్ట్రిక్ టెయిల్‌గేట్ (బటన్ నొక్కగానే డిక్కీ తెరుచుకోవడం, అదిరిపోయే ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ వంటివి డస్టర్‌ను ఒక కంప్లీట్ ప్యాకేజీగా మార్చాయి.
ఇంజిన్ సామర్థ్యం:
1.5L టర్బో పెట్రోల్: ఇది 160 PS పవర్, 255 Nm టార్క్‌ను అందిస్తుంది.
1.5L డీజిల్: ఇది 118 PS పవర్, 280 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
1.5L నార్మల్ పెట్రోల్: మైలేజ్ కోరుకునే వారి కోసం ఇది బెస్ట్ ఆప్షన్. ఇందులో 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ (DCT) గేర్‌బాక్స్ ఉండటం డ్రైవింగ్ అనుభవాన్ని పెంచుతుంది.
రెనాల్ట్ డస్టర్ ఇంజిన్ పరంగా సరికొత్త ప్రయోగాలు చేస్తోంది.
TCe 160 టర్బో పెట్రోల్: ఇది ఏకంగా 163 PS పవర్, 280 Nm టార్క్‌ను ఇస్తుంది. అంటే సియెర్రా కంటే ఇది కొంచెం పవర్‌ఫుల్‌గా కనిపిస్తోంది.
E-Tech 160 స్ట్రాంగ్ హైబ్రిడ్: ఇందులో 1.8L పెట్రోల్ ఇంజిన్ తో పాటు బ్యాటరీ, రెండు మోటార్లు ఉంటాయి. నగరం లోపల 80 శాతం ప్రయాణాన్ని కేవలం ఎలక్ట్రిక్ మోడ్‌లోనే పూర్తి చేయవచ్చని కంపెనీ చెబుతోంది. దీనివల్ల మైలేజ్ అదిరిపోతుంది.
TCe 100: ఇది తక్కువ బడ్జెట్ లో ఉండాలనుకునే వారి కోసం 100 PS పవర్ తో వస్తుంది.
సేఫ్టీ : ప్రాణాలకు రక్షణ భద్రత విషయంలో టాటా ఎప్పుడూ నంబర్ వన్. సియెర్రాలో అన్ని వేరియంట్లలో 6 ఎయిర్‌బ్యాగ్స్ స్టాండర్డ్ గా వస్తాయి. టాప్ మోడల్స్ లో లెవెల్-2 ADAS ఉంది, ఇది రోడ్డుపై ప్రమాదాలను ముందే పసిగట్టి కారును నియంత్రిస్తుంది. రెనాల్ట్ డస్టర్ కూడా వెనకబడలేదు. ఇందులో కూడా 17 రకాల ఫీచర్లతో కూడిన ADAS ప్యాకేజీ, బలమైన బాడీ స్ట్రక్చర్ ఉన్నాయి.
మంచి మైలేజ్ ఇచ్చే హైబ్రిడ్ కారు, ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ కావాలనుకుంటే రెనాల్ట్ డస్టర్ సరైన ఛాయిస్. అలా కాకుండా, అత్యంత ప్రీమియం లుక్, టాటా భరోసా, పవర్‌ఫుల్ డీజిల్ ఇంజిన్ కావాలనుకుంటే టాటా సియెర్రా వైపు చూడవచ్చు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
