Tata Motors : టాటా సంచలనం.. సియెర్రా రీ-ఎంట్రీతో రికార్డుల వేట.. 172 శాతం పెరిగిన కంపెనీ అమ్మకాలు.

Tata Motors : టాటా మోటార్స్ దశ తిరిగింది. ఒకప్పుడు రోడ్లపై రారాజుగా వెలిగిన టాటా సియెర్రా ఇప్పుడు సరికొత్త అవతారంలో వచ్చి మార్కెట్‌ను షేక్ చేస్తోంది. పాత జ్ఞాపకాలను ఆధునిక హంగులతో మేళవించి టాటా వదిలిన ఈ అస్త్రం, కంపెనీకి బంగారు గుడ్డు పెట్టే బాతులా మారింది. కేవలం ఒక్క కారుతోనే టాటా మోటార్స్ అమ్మకాలు ఏకంగా 172 శాతం పెరగడం ఇప్పుడు ఆటోమొబైల్ రంగంలో హాట్ టాపిక్ అయ్యింది. 90వ దశకంలో యువత కలల కారుగా ఉన్న టాటా సియెర్రా, ఇప్పుడు సరికొత్త లుక్‌తో తిరిగి వచ్చి మార్కెట్‌ను ఊపేస్తోంది. 2026 మొదటి త్రైమాసికంలో టాటా మోటార్స్ అమ్మకాలు 172 శాతం వృద్ధి చెందడంలో ఈ కారు కీలక పాత్ర పోషించింది. ముఖ్యంగా సియెర్రా, టాటా కర్వ్ మోడళ్లు కలిసి జనవరి నుంచి మార్చి మధ్యలో ఏకంగా 28,000 యూనిట్లకు పైగా అమ్ముడయ్యాయి. గత ఏడాది ఇదే సమయంలో అమ్మకాలు కేవలం 10,355 యూనిట్లు మాత్రమే ఉండటం గమనార్హం. అంటే టాటా వేసిన ప్లాన్ పక్కాగా పనిచేసింది.
సమయం మారుతున్నా టాటా అంటే సేఫ్టీ అనే బ్రాండ్ ఇమేజ్ మాత్రం తగ్గలేదు. సరికొత్త సియెర్రాకు భారత్ NCAP నుంచి 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ లభించింది. దీంతో కస్టమర్లు ఈ కారుపై విపరీతమైన ఆసక్తి చూపిస్తున్నారు. లాంచ్ అయిన మొదటి రోజే ఏకంగా 70,000 బుకింగ్స్ రాగా, ఇప్పుడు ఆ సంఖ్య లక్ష దాటేసింది. ఒక్క మార్చి నెలలోనే 9 వేల కార్లు డెలివరీ అయ్యాయంటేనే అర్థం చేసుకోవచ్చు ఈ కారుకు ఉన్న క్రేజ్ ఏంటో! ఇప్పటికే మార్కెట్లో సెటిల్ అయిన టాటా నెక్షన్, పంచ్ సరసన ఇప్పుడు సియెర్రా కూడా చేరిపోయింది.
పాత సియెర్రాలోని బాక్సీ లుక్‌ను అలాగే ఉంచుతూనే, ఆధునిక ఎల్‌ఈడీ లైటింగ్, ప్రీమియం ఫినిషింగ్‌తో దీనిని డిజైన్ చేశారు. కారు లోపలికి వెళ్తే అదో ఫ్యూచరిస్టిక్ ప్రపంచంలా అనిపిస్తుంది. కేబిన్‌లో మూడు డిజిటల్ స్క్రీన్‌లు, పైన పనోరమిక్ సన్‌రూఫ్, సరికొత్త స్టీరింగ్ వీల్ కారుకు హై-టెక్ లుక్ ఇస్తున్నాయి. ఈ కారు కేవలం చూడటానికి మాత్రమే కాదు, డ్రైవ్ చేయడానికి కూడా ఎంతో హుందాగా ఉంటుందని యూజర్లు చెబుతున్నారు.
అధునిక ఫీచర్ల విషయంలో టాటా ఎక్కడా తగ్గలేదు. 360-డిగ్రీ కెమెరా, వైర్‌లెస్ ఛార్జింగ్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, లెవల్-2 ADAS వంటి అడ్వాన్స్‌డ్ సేఫ్టీ సిస్టమ్స్ ఇందులో ఉన్నాయి. దీని ఇంజిన్ విషయానికి వస్తే.. 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ 170bhp పవర్‌ను జనరేట్ చేస్తుంది. ఇన్ని హంగులు ఉన్న ఈ ఎస్‌యూవీ ప్రారంభ ధర కేవలం రూ.11.49 లక్షలు (ఎక్స్-షోరూమ్) కావడం విశేషం. మిడిల్ క్లాస్ నుంచి లగ్జరీ ప్రియుల వరకు అందరినీ ఆకట్టుకునేలా ధర ఉండటంతో సియెర్రా అమ్మకాల్లో దూసుకుపోతోంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
