Meesho : మీషోకు భారీ షాక్.. రూ.1,500 కోట్ల పన్ను కట్టాలంటూ ఐటీ నోటీసులు.

Meesho : తక్కువ ధరలకే నాణ్యమైన వస్తువులు అందిస్తూ మధ్యతరగతి ప్రజలకు చేరువైన ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ మీషో ఇప్పుడు ఐటీ ఉచ్చులో చిక్కుకుంది. ఆదాయపు పన్ను శాఖ మీషో సంస్థకు అక్షరాలా రూ.1,500 కోట్ల భారీ పన్ను నోటీసును జారీ చేసింది. కంపెనీ తన వాస్తవ ఆదాయాన్ని తక్కువ చేసి చూపించిందని, పన్ను ఎగవేతకు పాల్పడిందని ఐటీ శాఖ ఆరోపిస్తోంది. నిత్యం మీషోలో తక్కువ ధరల డీల్స్ కోసం వెతికే కోట్ల మంది కస్టమర్లకు ఇది షాకింగ్ న్యూస్ అని చెప్పాలి. ఎందుకంటే ఒక కంపెనీపై ఇలాంటి భారీ ఆర్థిక భారం పడితే, ఆ ప్రభావం భవిష్యత్తులో వారు ఇచ్చే ఆఫర్లు, డిస్కౌంట్లపై పడే అవకాశం ఉంది.
అసలు గొడవ ఎక్కడ మొదలైంది?
2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మీషో సమర్పించిన ఆదాయ వివరాల్లో భారీ తేడాలు ఉన్నట్లు ఆదాయపు పన్ను శాఖ గుర్తించింది. కంపెనీ చూపించిన లెక్కలు సరిగా లేవని, అందుకే అదనపు సర్దుబాట్లు చేయాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. దీనికి భారీ వడ్డీని కూడా జోడించి రూ.1,500 కోట్లు చెల్లించాలని డిమాండ్ నోటీసు పంపారు. అయితే, మీషో యాజమాన్యం ఈ నోటీసును ధ్రువీకరించింది కానీ, ఐటీ అధికారుల అంచనాలతో తాము ఏకీభవించడం లేదని స్పష్టం చేసింది. ఈ నోటీసు వల్ల కంపెనీ రోజువారీ కార్యకలాపాలకు ఎలాంటి ఆటంకం కలగదని ఇన్వెస్టర్లకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తోంది.
డిస్కౌంట్ల వెనుక అసలు గేమ్ ఇదేనా?
సాధారణంగా ఈ-కామర్స్ కంపెనీలు కస్టమర్లను ఆకర్షించడానికి భారీ డిస్కౌంట్లు ఇస్తుంటాయి. అయితే, ఈ డిస్కౌంట్లే ఇప్పుడు కంపెనీలకు శాపంగా మారుతున్నాయి. కంపెనీలు తాము ఇచ్చే రాయితీలను వ్యాపార ఖర్చులుగా చూపిస్తాయి. ఇలా చేయడం వల్ల కంపెనీకి వచ్చే లాభం తక్కువగా కనిపిస్తుంది, తద్వారా కట్టాల్సిన పన్ను తగ్గుతుంది. కానీ, ఐటీ శాఖ ఈ డిస్కౌంట్లను పూర్తిగా ఖర్చుల కింద అంగీకరించడం లేదు. ఇదే మీషో మరియు ఐటీ శాఖ మధ్య ప్రధాన వివాదంగా మారింది. గతంలో కూడా మీషో ఇలాంటి పన్ను నోటీసులనే ఎదుర్కొంది. 2022 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.572 కోట్ల నోటీసు రాగా, కంపెనీ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకుంది. ఆ కేసు ఇప్పటికీ కోర్టులోనే ఉంది.
నష్టాల్లో మీషో.. ఇన్వెస్టర్లలో టెన్షన్
తాజా పన్ను నోటీసు ఒకవైపు ఉంటే, మీషో ఆర్థిక పరిస్థితి కూడా అంత ఆశాజనకంగా లేదు. అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో మీషో నికర నష్టం ఏకంగా 13 రెట్లు పెరిగి రూ.491 కోట్లకు చేరుకుంది. అయితే, ఆపరేటింగ్ రెవెన్యూ మాత్రం 31 శాతం పెరిగి రూ.3,517 కోట్లుగా నమోదు కావడం కొసమెరుపు. పన్ను గొడవలు, పెరుగుతున్న నష్టాల నేపథ్యంలో స్టాక్ మార్కెట్‌లో కూడా మీషో షేర్ల కదలికపై ఇన్వెస్టర్లు ఓ కన్నేసి ఉంచారు. గత శుక్రవారం బీఎస్ఈలో మీషో షేరు రూ.159.10 వద్ద ముగిసింది. అటు ఐపీఓ దిశగా అడుగులు వేస్తున్న మీషోకు ఈ రూ.1,500 కోట్ల నోటీసు పెను సవాల్‌గా మారనుంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
