UPI : ఢిల్లీ, గోవాలను దాటేసిన తెలంగాణ పవర్..ఒక్కొక్కరు నెలకు ఎంత ఖర్చు చేస్తున్నారో తెలుసా?

UPI : ఢిల్లీ, గోవాలను దాటేసిన తెలంగాణ పవర్..ఒక్కొక్కరు నెలకు ఎంత ఖర్చు చేస్తున్నారో తెలుసా?
X

UPI : భారతదేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా నగదు కంటే డిజిటల్ పేమెంట్లే ఎక్కువగా కనిపిస్తున్నాయి. టీ కొట్టు దగ్గర నుంచి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వరకు అంతా యూపీఐమయం అయిపోయింది. ప్రతి నెలా దేశవ్యాప్తంగా దాదాపు 20 బిలియన్ల లావాదేవీలు జరుగుతున్నాయంటేనే అర్థం చేసుకోవచ్చు ఇది మన జీవితాల్లో ఎంతగా కలిసిపోయిందో. అయితే, దేశమంతా యూపీఐ వాడుతున్నా.. అన్ని రాష్ట్రాల్లోనూ ఇది ఒకేలా లేదు. తాజాగా టైమ్స్ ఆఫ్ ఇండియా వెల్లడించిన నివేదిక ప్రకారం.. కొన్ని రాష్ట్రాలు డిజిటల్ పేమెంట్లలో దూసుకుపోతుంటే, మరికొన్ని రాష్ట్రాలు మాత్రం చాలా వెనుకబడి ఉన్నాయి.

జనాభా ప్రాతిపదికన చూస్తే యూపీఐ వాడకంలో రాష్ట్రాల మధ్య భారీ తేడాలు కనిపిస్తున్నాయి. నవంబర్ 2025 నాటి గణాంకాల ప్రకారం, మహారాష్ట్ర లాంటి ఆర్థికంగా బలంగా ఉన్న రాష్ట్రంలో ఒక వ్యక్తి చేసే యూపీఐ లావాదేవీలు.. బీహార్‌లోని వ్యక్తితో పోలిస్తే ఏడు రెట్లు ఎక్కువగా ఉన్నాయి. ఇక జాతీయ స్థాయిలో రెండో స్థానంలో ఉన్న తెలంగాణలో ఒక వ్యక్తి చేసే పేమెంట్లు, త్రిపుర కంటే ఆరు రెట్లు ఎక్కువగా ఉండటం విశేషం. దీనిని బట్టి చూస్తే దక్షిణ, పశ్చిమ భారత రాష్ట్రాలు డిజిటల్ ఎకానమీలో మిగతా వారికంటే చాలా వేగంగా ముందుకెళ్తున్నాయని అర్థమవుతోంది.

రాష్ట్రాల విస్తీర్ణంతో సంబంధం లేకుండా, పట్టణీకరణ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో యూపీఐ వాడకం రికార్డు స్థాయిలో ఉంది. ఢిల్లీలో సగటున ఒక వ్యక్తి నెలకు 23.9 యూపీఐ లావాదేవీలు చేస్తున్నాడు. ఆ తర్వాత స్థానాల్లో గోవా (23.3), తెలంగాణ (22.6), చండీగఢ్ (22.5) నిలిచాయి. పెద్ద రాష్ట్రాల విషయానికి వస్తే, మహారాష్ట్ర 17.4 లావాదేవీలతో బలంగా ఉంది. ఇక్కడ క్యూఆర్ కోడ్ నెట్‌వర్క్ చాలా పటిష్టంగా ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలు కూడా జాతీయ సగటు కంటే ఎంతో మెరుగ్గా ఉన్నాయి.

కేవలం లావాదేవీల సంఖ్యలోనే కాదు, చెల్లించే మొత్తంలో కూడా తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. తెలంగాణలో ఒక వ్యక్తి నెలకు సగటున రూ.34,800 యూపీఐ ద్వారా చెల్లిస్తున్నాడు. అంటే నిత్యావసరాలే కాకుండా పెద్ద మొత్తంలో చేసే చెల్లింపులకు కూడా తెలంగాణ ప్రజలు యూపీఐపైనే ఆధారపడుతున్నారు. ఆ తర్వాత స్థానాల్లో గోవా, ఢిల్లీ నిలిచాయి. మరోవైపు జార్ఖండ్, అసోం, పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో మాత్రం ఇంకా డిజిటల్ చెల్లింపుల కంటే నగదు లావాదేవీలే ఎక్కువగా జరుగుతున్నాయి.

వెనుకబడిన తూర్పు రాష్ట్రాలు - కారణాలేంటి?

త్రిపుర, బీహార్ వంటి రాష్ట్రాల్లో ఒక వ్యక్తి నెలకు సగటున నాలుగు కంటే తక్కువ సార్లు మాత్రమే యూపీఐ వాడుతున్నాడు. ఈ వ్యత్యాసం డిజిటల్ అంతరాన్ని స్పష్టంగా చూపిస్తోంది. స్మార్ట్‌ఫోన్ల అందుబాటు తక్కువగా ఉండటం, ఇంటర్నెట్ కనెక్టివిటీ సమస్యలు, చిన్న వ్యాపారులకు ఇంకా యూపీఐపై పూర్తి అవగాహన లేకపోవడం ఇందుకు కారణాలుగా నిపుణులు చెబుతున్నారు. ఈ అంతరాన్ని తగ్గించాలంటే గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం అత్యవసరమని వారు సూచిస్తున్నారు.

Tags

Next Story