Tesla : టెస్లా సెన్సేషన్.. గురుగ్రామ్‌లో తొలి ఆల్-ఇన్-వన్ సెంటర్ ప్రారంభం.

Tesla : టెస్లా సెన్సేషన్.. గురుగ్రామ్‌లో తొలి ఆల్-ఇన్-వన్ సెంటర్ ప్రారంభం.
X

Tesla : ప్రపంచ ప్రఖ్యాత ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా భారతదేశంలో తమ ఉనికిని బలోపేతం చేసుకుంటూ కీలక అడుగు వేసింది. హర్యానాలోని గురుగ్రామ్‌లో తమ మొట్టమొదటి ఆల్-ఇన్-వన్ సెంటర్‎ను ప్రారంభించింది. ఈ సెంటర్ నవంబర్ 27, 2025 నుంచి కస్టమర్ల కోసం అందుబాటులోకి వచ్చింది. ఈ సెంటర్ ప్రధాన ఉద్దేశ్యం ఏంటంటే.. కారు కొనుగోలు చేయడం నుంచి, డెలివరీ, సర్వీసింగ్, ఛార్జింగ్ వంటి అన్ని ముఖ్యమైన సేవలను ఒకే చోట కస్టమర్లకు అందించడం. ఈ కేంద్రం ద్వారా టెస్లా భారతీయ ఈవీ మార్కెట్‌లో అధికారికంగా విస్తరణ ప్రణాళికను మొదలుపెట్టింది.

ఈ కొత్త ఆల్-ఇన్-వన్ సెంటర్‌లో కస్టమర్లు టెస్లా ప్రముఖ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ అయిన టెస్లా మోడల్ Yని టెస్ట్ డ్రైవ్ చేసే సదుపాయం కూడా ఉంది. ఉత్తర భారతదేశంలో మోడల్ Y కి పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ కేంద్రాన్ని గురుగ్రామ్‌లో ఏర్పాటు చేశారు. టెస్లా కంపెనీ జూలై 2025లో మోడల్ Y తోనే భారత మార్కెట్‌లోకి అడుగుపెట్టింది. మోడల్ Y ఒక ప్రీమియం ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ. దీనిలో 15.4 అంగుళాల టచ్‌స్క్రీన్, వెంటిలేటెడ్ సీట్లు, యాంబియెంట్ లైటింగ్, 9-స్పీకర్ సౌండ్ సిస్టమ్ వంటి అడ్వాన్సుడ్ ఫీచర్లు ఉన్నాయి. ఈ మోడల్ Y రెండు రేంజ్ ఆప్షన్లలో లభిస్తుంది.. స్టాండర్డ్ మోడల్ 500 కి.మీ వరకు, లాంగ్ రేంజ్ మోడల్ 622 కి.మీ వరకు ప్రయాణించగలదు. భారత్‌లో మోడల్ Y ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.59.89 లక్షలు కాగా, లాంగ్ రేంజ్ మోడల్ ధర రూ.67.89 లక్షలుగా ఉంది.

టెస్లా మోడల్ Y లో అత్యాధునిక సేఫ్టీ ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇందులో ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, బ్లైండ్ స్పాట్ వార్నింగ్ వంటి ముఖ్యమైన ఫీచర్లు ఉన్నాయి. అలాగే, దీనికి టింటెడ్ గ్లాస్ రూఫ్ కూడా ఉంది. ఇది ఈ కారును దాని సెగ్మెంట్‌లో చాలా ఆకర్షణీయంగా, హై-టెక్‌గా నిలబెడుతుంది. ఒకే చోట అమ్మకాలు, సర్వీస్, ఛార్జింగ్ సదుపాయాలు లభించడం వల్ల కస్టమర్లకు సౌకర్యవంతంగా ఉంటుంది. అలాగే భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల ఆదరణ మరింత పెరుగుతుందని టెస్లా ఆశిస్తోంది.

Tags

Next Story