EV Charging Tips : ఎలక్ట్రిక్ కారు బ్యాటరీ పదికాలాల పాటు పదిలంగా ఉండాలా? అయితే ఇవి పాటించండి.

EV Charging Tips : దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల హవా నడుస్తోంది. పెట్రోల్, డీజిల్ ధరల భారం నుంచి తప్పించుకోవడానికి సామాన్యులు సైతం ఈవీల వైపు మొగ్గు చూపుతున్నారు. కంపెనీలు కూడా వీటిని అందుబాటులోకి తెచ్చేందుకు ధరలను తగ్గిస్తున్నాయి. ఇటీవల లాంచ్ అయిన టాటా పంచ్ EV ఫేస్‌లిఫ్ట్ పాత మోడల్ కంటే ఏకంగా రూ. 1.85 లక్షలు తక్కువకే లభిస్తుండటం దీనికి నిదర్శనం. అయితే ఈవీ కొన్నంత మాత్రాన సరిపోదు.. దాన్ని ఎలా కాపాడుకోవాలో కూడా తెలియాలి. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనదారులందరూ తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన ఒక సూత్రం ఉంది, అదే 80% ఛార్జింగ్ రూల్. ఈ ఒక్క చిన్న విషయాన్ని పాటిస్తే మీ బ్యాటరీ లైఫ్ పెరగడమే కాకుండా, మీ సమయం, డబ్బు కూడా ఆదా అవుతాయి.
ఏమిటి ఈ 80% ఛార్జింగ్ నియమం?
ఆధునిక ఎలక్ట్రిక్ కార్లలో బ్యాటరీ మేనేజ్‌మెంట్ సిస్టమ్ అనే అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ ఉంటుంది. ఇది బ్యాటరీ ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తుంది. సాధారణంగా చాలా మంది తమ మొబైల్ ఫోన్‌లాగే ఈవీని కూడా 100% ఛార్జ్ చేయాలని అనుకుంటారు. కానీ, నిపుణుల అభిప్రాయం ప్రకారం.. బ్యాటరీని ఎప్పుడూ 80 శాతం వరకే ఛార్జ్ చేయడం వల్ల నాలుగు రకాల అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి.
1. బ్యాటరీ లైఫ్ పెరుగుతుంది
ఎలక్ట్రిక్ కార్లలో వాడే లిథియం-అయాన్ బ్యాటరీలకు ఒక ప్రత్యేకత ఉంటుంది. ఇవి సున్నా నుంచి 80 శాతం వరకు చాలా వేగంగా ఛార్జ్ అవుతాయి. కానీ 80 నుంచి 100 శాతం ఛార్జ్ అవ్వడానికి మాత్రం చాలా ఎక్కువ సమయం తీసుకుంటాయి. దీనికి కారణం బ్యాటరీ లోపల పెరిగే రెసిస్టెన్స్. ప్రతిరోజూ 100 శాతం ఛార్జ్ చేయడం వల్ల బ్యాటరీ సెల్స్ త్వరగా బలహీనపడతాయి. కాబట్టి 80% దగ్గర ఆపేస్తే బ్యాటరీ ఏళ్ల తరబడి కొత్తదానిలా పనిచేస్తుంది.
2. సమయం భారీగా ఆదా అవుతుంది
పెట్రోల్ కార్లతో పోలిస్తే ఈవీలకు ఛార్జింగ్ సమయం ఎక్కువే. మీరు ఛార్జింగ్ స్టేషన్‌లో ఉన్నప్పుడు 80 శాతం తర్వాత మిగిలిన 20 శాతం ఛార్జ్ అవ్వడానికి పట్టే సమయంలోనే, మరో కారు 0 నుంచి 60 శాతం వరకు ఛార్జ్ చేసుకోవచ్చు. ఆ చివరి 20 శాతం ఛార్జింగ్ వల్ల మీకు వచ్చే అదనపు మైలేజీ కంటే, అక్కడ మీరు వృథా చేసే సమయమే ఎక్కువ. 80% వద్ద ఛార్జర్ తీసేయడం వల్ల మీ టైమ్ సేవ్ అవ్వడమే కాకుండా, వేచి ఉన్న ఇతర ఈవీ వినియోగదారులకు కూడా ఛార్జింగ్ స్టేషన్ అందుబాటులోకి వస్తుంది.
3. బ్రేక్ వేస్తే ఛార్జింగ్ ఎక్కుతుంది
ఎలక్ట్రిక్ వాహనాల్లో రీజనరేటివ్ బ్రేకింగ్ అనే అద్భుత ఫీచర్ ఉంటుంది. అంటే మీరు బ్రేక్ వేసినప్పుడు లేదా కారు వేగాన్ని తగ్గించినప్పుడు ఆ శక్తి తిరిగి విద్యుత్తుగా మారి బ్యాటరీని ఛార్జ్ చేస్తుంది. ఒకవేళ మీ బ్యాటరీ ఇప్పటికే 100% నిండి ఉంటే, ఈ రీజనరేటివ్ బ్రేకింగ్ ద్వారా వచ్చే ఉచిత విద్యుత్తును నిల్వ చేయడానికి బ్యాటరీలో చోటు ఉండదు. అదే 80% దగ్గర ఉంచితే, ప్రయాణంలో బ్రేకులు వేసినప్పుడల్లా బ్యాటరీ ఉచితంగా రీఛార్జ్ అవుతూనే ఉంటుంది.
4. వారానికి ఒకసారి మాత్రం వంద శాతం
అయితే, ప్రతిరోజూ 80 శాతం నియమం పాటించినా.. వారానికి ఒకసారి మాత్రం మీ ఇంటి వద్ద ఉండే స్లో ఛార్జర్‌తో బ్యాటరీని 100% ఛార్జ్ చేయాలి. ఇలా చేయడం వల్ల బ్యాటరీ మేనేజ్‌మెంట్ సిస్టమ్ తిరిగి రీ-కాలిబ్రేట్ అవుతుంది. దీనివల్ల మీ కారు డ్యాష్‌బోర్డ్‌పై రేంజ్ (కారు ఎంత దూరం వెళ్తుంది అనేది) ఖచ్చితంగా కనిపిస్తుంది. ప్రయాణానికి ముందే పక్కా ప్లానింగ్ ఉంటే ఈవీ డ్రైవింగ్ అత్యంత సుఖవంతంగా మారుతుంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
