Financial Planning : 10 ఏళ్ల తర్వాత కోటి రూపాయల విలువ ఎంత అవుతుంది? లెక్క తెలిస్తే షాక్ అవుతారు.

Financial Planning : సాధారణంగా ద్రవ్యోల్బణం అంటే వస్తువుల ధరలు పెరగడం అని మనందరికీ తెలుసు. కానీ, దీని వెనుక ఉన్న అసలు భయం ఏమిటంటే అది మన డబ్బు కొనుగోలు శక్తిని క్రమంగా తగ్గించివేస్తుంది. ఉదాహరణకు.. పది ఏళ్ల క్రితం వంద రూపాయలతో నిండిపోయే సంచి, ఇప్పుడు కేవలం మూడు నాలుగు వస్తువులకే నిండిపోతోంది. భారతదేశంలో ద్రవ్యోల్బణాన్ని కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ద్వారా లెక్కిస్తారు. ఇందులో ఆహారం, ఇంధనం, వైద్యం, విద్య వంటి రోజువారీ అవసరాల ధరల పెరుగుదలను పరిగణనలోకి తీసుకుంటారు. ప్రభుత్వం లెక్కల్లో ఇది 4-6 శాతం ఉన్నట్లు కనిపించినా, నిజ జీవితంలో దీని ప్రభావం చాలా బలంగా ఉంటుంది.
ద్రవ్యోల్బణం సంవత్సరానికి సగటున 5 శాతం ఉంటుందని అంచనా వేస్తే, ఈ రోజు మీ దగ్గర ఉన్న రూ.కోటి విలువ 10 సంవత్సరాల తర్వాత కేవలం రూ.61 లక్షలకు సమానం అవుతుంది. అంటే, ఈ రోజు మీరు రూ.కోటితో ఎలాంటి జీవనశైలిని గడపగలరో, పదేళ్ల తర్వాత అదే జీవనశైలిని కొనసాగించాలంటే మీకు సుమారు రూ.1.63 కోట్లు అవసరమవుతాయి. ధరలు పెరగడం వల్ల మీ నోట్ల సంఖ్య మారకపోయినా, ఆ నోట్లతో మీరు కొనే వస్తువుల సంఖ్య మాత్రం సగానికి పడిపోతుంది. అందుకే కోటి రూపాయలు ఉంది కదా అని ధీమాగా ఉండటం కంటే, అది భవిష్యత్తులో ఎన్ని వస్తువులను కొనగలదు అని ఆలోచించడమే అసలైన ప్లానింగ్.
చాలామంది తమ 60 ఏళ్ల వయసులో రిటైర్మెంట్ కోసం రూ.కోటి ఉంటే చాలని భావిస్తారు. కానీ రిటైర్ అయిన తర్వాత సంపాదన ఆగిపోతుంది, ఖర్చులు మాత్రం పెరుగుతూనే ఉంటాయి. ముఖ్యంగా వృద్ధాప్యంలో వైద్య ఖర్చులు సాధారణ ద్రవ్యోల్బణం కంటే రెండు రెట్లు ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ మీరు కేవలం ఫిక్స్‌డ్ డిపాజిట్లు లేదా సేవింగ్స్ అకౌంట్లపైనే ఆధారపడితే, వాటిపై వచ్చే వడ్డీ రేటు ద్రవ్యోల్బణం కంటే తక్కువగా ఉండే అవకాశం ఉంది. దీనివల్ల మీ వద్ద ఉన్న డబ్బు పెరగకపోగా, కాలక్రమేణా కరిగిపోతూ రిటైర్మెంట్ జీవితాన్ని కష్టతరం చేస్తుంది.
ద్రవ్యోల్బణం అనే నిశ్శబ్ద హంతకుడిని ఎదుర్కోవాలంటే, మీ పెట్టుబడులు ద్రవ్యోల్బణం కంటే కనీసం 2-3 శాతం ఎక్కువ రాబడిని ఇచ్చేవిగా ఉండాలి. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్‌లు, ఇండెక్స్ ఫండ్‌లు దీర్ఘకాలంలో 12-15 శాతం రాబడిని ఇచ్చే సామర్థ్యం కలిగి ఉంటాయి, ఇది ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవడానికి ఉత్తమ మార్గం. అలాగే రిటైర్మెంట్ కోసం నేషనల్ పెన్షన్ సిస్టమ్లో పెట్టుబడి పెట్టడం వల్ల ట్యాక్స్ ప్రయోజనాలతో పాటు చక్రవడ్డీ లాభాలు కూడా అందుతాయి. వీటితో పాటు స్థిరత్వం కోసం బంగారం లేదా రియల్ ఎస్టేట్ వంటి ఆస్తుల్లో కూడా కొంత వాటా ఉంచుకోవడం వల్ల భవిష్యత్తులో ఆర్థిక కొరత ఏర్పడకుండా ప్రశాంతమైన జీవితాన్ని గడపవచ్చు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

