Honda Motors : హోండా మోటార్స్ సక్సెస్ జర్నీ ఎలా సాగిందంటే!

హోండా మోటార్స్.. ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన ఈ ఆటోమొబైల్ కంపెనీ. కార్లు, బైకులను తయారు చేయడమే కాకుండా అనేక రకాల ఇంజిన్లను కూడా తయారు చేస్తుంది. మోటార్‌సైకిళ్ల తయారీ,అమ్మకంలో ఇది ప్రపంచంలోనే నంబర్ వన్ కంపెనీ. అయితే హోండా మోటార్స్ కంపెనీ ఈ స్థాయికి ఎదగడం వెనుక ఉన్న ముఖ్య వ్యక్తి సిచిరో హోండా. నేడు హోండా మోటార్స్ కంపెనీ ఈ స్థాయికి ఎదగడానికి సిచిరో హోండా అనేక ఇబ్బందులను ఎదుర్కోవలసి వచ్చింది. ఆయన సక్సెస్ జర్నీ ఎలా సాగిందో ఇప్పుడు చూద్దాం.
1906లో జపాన్ లోని షిజుయోకాలోని ఒక చిన్న గ్రామంలో సిచిరో హోండా జన్మించాడు. ఆయన తండ్రి గిహీ హోండా ఒక పేద కమ్మరి. సైకిల్ రిపేర్ పనులు కూడా చేసేవాడు. అయితే చిన్నప్పటి నుంచి సిచిరో హోండాకి చదువు మీద ఇంట్రెస్ట్ ఉండేది కాదు. అందుకే 16 ఏళ్లకే చదువు మానేసి తండ్రికి పనిలో సాయం చేయడం మొదలుపెట్టాడు. అయితే అదే సమయంలో ఓ రోజు న్యూస్ పేపర్ లో ‘ఆర్ట్‌షోకై’ కార్ కంపెనీలో మెకానిక్ ఉద్యోగం కోసం ప్రకటన చూశాడు. దీంతో ఈ ఉద్యోగం కోసం అప్లయ్ చేసుకున్నాడు. ఇంటర్వ్యూలో పాల్గొనేందుకు టోక్యో వెళ్లాడు. అయితే కంపెనీ యజమాని సిచిరో హోండాని చూడగానే మెకానిక్ ఉద్యోగం ఇచ్చేందుకు నిరాకరించాడు. గ్యారేజీని శుభ్రం చేసే స్వీపర్ పని ఇచ్చారు. అయితే హోండా మాత్రం నిరాశ చెందలేదు. స్వీపర్ పని చేస్తుండేవాడు. షోకై కంపెనీ.. బయటి నుంచి దిగుమతి చేసుకున్న కార్లను రిపేర్ చేసి విక్రయించింది.
ఇదే సమయంలో తన స్వీపర్ పని చేస్తూనే అక్కడ ఉన్న ఉద్యోగులతో ఫ్రెండ్షిప్ చేసేవాడు హోండా. వాళ్లు పనిలో ఎలాంటి మెళకులవలు పాటిస్తున్నారో గమనించేవాడు. అయితే అదే సమయంలో జపాన్‌లో పెద్ద భూకంపం వచ్చింది. దీంతో కంపెనీకి చెందిన చాలా మంది మెకానిక్‌లు వారి ఇళ్లకు వెళ్లారు. ఆ సమయంలో మెకానిక్ లు తక్కువగా ఉండటంతో అప్పటికే హోండా డెడికేషన్ ని గమనించిన ఆర్ట్‌షోకై కంపెనీ ఓనర్ కంపెనీకి చెందిన రెండో గ్యారేజీ బాధ్యతను హోండాకి అప్పగించాడు. అక్కడ రేసింగ్ కార్లు మరమ్మతులకు గురయ్యాయి. సిచిరో హోండా.. షోకై కంపెనీ యజమాని సహకారంతో అక్కడ ఓ రేసింగ్ కారును రూపొందించారు. 1924లో జరిగిన జపనీస్ మోటార్ కార్ రేసులో అద్భుతాలు చేసి మొదటి స్థానంలో నిలిచాడు. దీని తర్వాత అతను చాలా సంవత్సరాలు ఆర్ట్ షోకాయ్ కంపెనీలో పని చేస్తూనే ఉన్నాడు.
1936లో రేసింగ్ పోటీలో జరిగిన ప్రమాదంలో సిచిరో హోండా తీవ్రంగా గాయపడ్డాడు. మూడు నెలల పాటు హాస్పిటల్ లోనే ఉన్నాడు. కోలుకున్న తర్వాత పిస్టన్ రింగుల తయారీకి ప్రత్యేక కంపెనీని ఏర్పాటు చేయాలని ఆర్ట్‌షోకై కంపెనీ యజమానికి సూచించాడు. అయితే ఆ ఓనర్ దానికి అంగీకరించబడలేదు. దీని తర్వాత ఆర్ట్‌షోకైలో 1939లో ఉద్యోగం వదిలి పిస్టన్ రింగులను తయారు చేసేందుకు స్నేహితుడితో కలిసి కంపెనీ ఏర్పాటు చేయాలని అనుకున్నాడు. ముందుగా పిస్టన్ రింగులను విక్రయించడానికి చాలా కంపెనీలను సంప్రదించారు. ఎట్టకేలకు టయోటా కంపెనీ నుండి ఆర్డర్ కూడా పొందాడు. అయితే అతని ప్రొడక్ట్ టయోటా కంపెనీ చేసిన క్వాలిటీ టెస్ట్ లో ఫెయిల్ అవడంతో రిజక్ట్ చేయబడింది. ఇది హోండాని చాలా నిరాశపరిచింది. కానీ హోండా ధైర్యం కోల్పోలేదు. మెరుగైన పిస్టన్ రింగ్‌ను తయారు చేసి మళ్లీ తీసుకొచ్చారు, దీనిని టయోటా అంగీకరించింది.
దీంతో హోండా హోమమాట్సు నగరంలో పిస్టన్ రింగ్ తయారీ కంపెనీని ప్రారంభించారు. ఇది ఆటోమేటెడ్ ప్లాంట్. ఇందులో 2,000 మంది ఉద్యోగులు పనిచేశారు. కానీ రెండో ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికా వైమానిక దాడిలో అతని ఫ్యాక్టరీ పూర్తిగా ధ్వంసమైంది. దీని తర్వాత భూకంపం కారణంగా వారి రెండవ యూనిట్ కూడా కూలిపోయింది. హోండా తన ఫ్యాక్టరీలో మిగిలిన యంత్రాలను టయోటా కంపెనీకి చాలా తక్కువ ధరకు అమ్మేశారు. 1946లో ఈ డబ్బుతో హోండా టెక్నికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌ని స్థాపించారు.
ప్రపంచ యుద్ధం కారణంగా జపాన్ పూర్తిగా దెబ్బతింది. అక్కడ రవాణా కోసం సైకిళ్లను ఉపయోగించారు. సిచిరో హోండా సైకిల్‌పై జనరేటర్ ఇంజిన్‌ను అమర్చారు. దీనిని ప్రజలు బాగా ఇష్టపడ్డారు. డిమాండ్ పెరగడంతో, హోండా రెండు-స్ట్రోక్ ఇంజిన్‌ను తయారు చేసారు. 1949లో, అతను తన కంపెనీకి హోండా మోటార్స్ అని పేరు పెట్టాడు. ఈ సైకిల్ తర్వాత సిచిరో హోండా మోటార్‌సైకిల్‌ను విడుదల చేశారు. అది ఎంతో కాలం నిలవలేదు. దీని తర్వాత అతను సూపర్ కబ్ పేరుతో లైట్ వెయిట్ బైక్‌ను రిలీజ్ చేశాడు. అది పెద్ద హిట్ అయింది. 1960లలో అమెరికాలో అడుగు పెట్టాడు. 1964 నాటికి, అమెరికాలో రోడ్డుపై ఉన్న ప్రతి రెండో బైక్ హోండా కంపెనీదే. హోండా కంపెనీ తన మొదటి కారు T360 మినీ ట్రక్కును 1963లో తయారు చేసింది. అనేక ఇతర కార్లను కూడా ఆయన కంపెనీ తయారు చేసింది, కానీ అవి బాగా వర్కవుట్ అవలేదు. ఆ తర్వాత మార్కెట్లోకి హోండా సివిక్‌ను విడుదల చేశారు. ఇది తక్కువ బరువున్న ఫ్యామిలీ కారు. ఈ కారు జపాన్ లోనే కాదు అమెరికాలో కూడా ప్రకంపనలు సృష్టించింది. దీని తర్వాత వచ్చిన హోండా అకార్డ్ చాలా సంచలనం సృష్టించింది. 1980 నాటికి హోండా మోటార్స్ ప్రపంచంలో మూడవ అతిపెద్ద కార్ కంపెనీగా అవతరించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com