Inflation Calculator : మీ దగ్గర కోటి రూపాయలు ఉన్నాయా.. 2040 నాటికి వాటి విలువ ఎంతవుతుందో తెలుసా ?

Inflation Calculator : మీ దగ్గర కోటి రూపాయలు ఉన్నాయా.. 2040 నాటికి వాటి విలువ ఎంతవుతుందో తెలుసా ?
X

Inflation Calculator : ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ తమ భవిష్యత్తు అవసరాలైన ఇల్లు, పిల్లల చదువులు లేదా పెళ్లి కోసం డబ్బును పొదుపు చేస్తున్నారు. చాలా మంది 20-30 సంవత్సరాల తర్వాత రూ.కోటి కూడబెడితే అన్ని ఆర్థిక అవసరాలు తీరతాయని భావిస్తారు. అయితే మీరు కూడా ఇదే విధంగా ఆలోచిస్తుంటే ఈ లెక్కలు మీ ఆలోచనను మార్చవచ్చు. ఎందుకంటే కాలంతో పాటు డబ్బు కొనుగోలు శక్తి తగ్గుతుంది. నేడు రూ.కోటి సరిపోవచ్చు కానీ, 2040 నాటికి దాని విలువ ఇంత ఉండదు. సరైన పెట్టుబడి ప్రణాళిక లేకపోతే మీ పొదుపు ద్రవ్యోల్బణం ప్రభావానికి గురై, మీరు ఆశించిన ఫలితాన్ని ఇవ్వకుండా పోతుంది.

నిత్యావసర వస్తువులు, సేవలు, ఇల్లు, మందులు వంటి వాటి ధరలు ప్రతి సంవత్సరం పెరగడాన్నే ద్రవ్యోల్బణం అంటారు. భారతదేశంలో సగటున ద్రవ్యోల్బణం రేటు 5% - 7% మధ్య ఉంది. ద్రవ్యోల్బణం రేటును సగటున 6% గా పరిగణించినట్లయితే, 2025 నుంచి 2040 వరకు (15 సంవత్సరాల తర్వాత) రూ.కోటి కొనుగోలు శక్తిని నిలబెట్టుకోవడానికి, మీకు సుమారు రూ.2.39 కోట్లు అవసరం అవుతుంది. దీని అర్థం 2040లో రూ.కోటి విలువ దాదాపుగా నేటి రూ.40-45 లక్షల కొనుగోలు శక్తికి సమానం. అంటే, 15 సంవత్సరాల తర్వాత ఈ రోజు రూ.40-45 లక్షలతో కొనగలిగే వస్తువులను కొనడానికి మీరు రూ.కోటి ఖర్చు చేయాల్సి ఉంటుంది.

ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవడానికి, మీ డబ్బు విలువ పెరగడానికి, కేవలం బ్యాంకుల్లో సేవింగ్స్ అకౌంట్లలో డబ్బు ఉంచడం సరిపోదు. ఎందుకంటే బ్యాంక్ ఇచ్చే వడ్డీ రేటు ద్రవ్యోల్బణం రేటు కంటే తక్కువగా ఉండవచ్చు. అందుకే ద్రవ్యోల్బణం రేటు కంటే ఎక్కువ రాబడిని ఇచ్చే పెట్టుబడి విధానాలను ఎంచుకోవాలి. మ్యూచువల్ ఫండ్స్ వంటి సాధనాలు దీర్ఘకాలంలో సగటున 12% వరకు రాబడిని ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈ రాబడితో 15 ఏళ్లలో రూ.కోటి పెట్టుబడి రూ.5.47 కోట్లుగా పెరిగే అవకాశం ఉంది (అయితే ఇందులో రిస్క్ ఉంటుంది). ఫిక్స్‌డ్ డిపాజిట్లు వంటి వాటిలో సగటున 6.5% రాబడితో రూ.2.63 కోట్లు మాత్రమే అవుతుంది. ముఖ్యంగా మీ పెట్టుబడిని వివిధ రకాలుగా పంపిణీ చేయడం, రిస్క్‌ను తట్టుకోగలిగే సామర్థ్యం మేరకు స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారానే ద్రవ్యోల్బణం ప్రభావాన్ని సమర్థవంతంగా అధిగమించవచ్చు.

Tags

Next Story