Global Top 10 : ప్రపంచ వ్యాప్తంగా సత్తా చాటుతున్న భారతీయ బ్యాంకులు..గ్లోబల్ టాప్-10లో ఎస్‌బీఐ సహా మరో మూడు.

Global Top 10 : భారతదేశ ఆర్థిక రంగంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఛైర్మన్, సి.ఎస్. శెట్టి ఒక సంచలన ప్రకటన చేశారు. ఆయన అంచనా ప్రకారం.. 2030 నాటికి మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా ప్రపంచంలోని టాప్-10 బ్యాంకులలో ఎస్‌బీఐతో పాటు భారతదేశం నుంచి మరో రెండు అగ్రశ్రేణి ప్రైవేట్ రంగ బ్యాంకులు కూడా చేరబోతున్నాయి. ఈ ప్రకటన భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థ వేగవంతమైన వృద్ధి, అంతర్జాతీయ ఆధిపత్యం వైపు భారత్ వేస్తున్న అడుగులను స్పష్టం చేస్తోంది.
భారతీయ స్టేట్ బ్యాంక్ ఛైర్మన్ సి.ఎస్. శెట్టి, దేశీయ బ్యాంకుల భవిష్యత్తుపై అపారమైన విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా ప్రపంచంలోని అగ్రశ్రేణి బ్యాంకుల జాబితాలోకి భారత్ నుండి మూడు బ్యాంకులు ప్రవేశిస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎస్‌బీఐ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఇప్పటికే $100 బిలియన్ల మార్కును దాటింది. 2030 నాటికి ప్రపంచంలోని టాప్-10 గ్లోబల్ బ్యాంకులలో స్థానం సంపాదించాలని ఎస్‌బీఐ ఇప్పటికే లక్ష్యంగా పెట్టుకుంది.
ఎస్‌బీఐతో పాటుగా దేశంలోని మరో రెండు ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంకులు కూడా ఈ లక్ష్యాన్ని చేరుకుంటాయని శెట్టి పేర్కొన్నారు. అయితే, ఆయన ఆ రెండు బ్యాంకుల పేర్లను మాత్రం వెల్లడించలేదు. ఎస్‌బీఐ ఛైర్మన్ ప్రస్తావించిన ఆ రెండు ప్రైవేట్ బ్యాంకులు ప్రస్తుతం దేశంలో మార్కెట్ విలువ పరంగా అగ్రస్థానంలో ఉన్న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ అయ్యే అవకాశం ఉంది.హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ప్రస్తుతం రూ.15.11 లక్షల కోట్లకు పైగా మార్కెట్ విలువతో దేశంలోనే అత్యంత విలువైన బ్యాంక్‌గా ఉంది. ఐసీఐసీఐ బ్యాంక్ రూ.9.59 లక్షల కోట్లతో రెండో స్థానంలో ఉంది.
ఆస్తుల పరంగా భారత్‌లో అతిపెద్ద బ్యాంక్ అయినప్పటికీ, మార్కెట్ క్యాప్ పరంగా ఎస్‌బీఐ ప్రస్తుతం రూ.8.82 లక్షల కోట్లతో ఉంది. ప్రపంచ స్థాయిలో ఎస్‌బీఐ ప్రస్తుతం 43వ స్థానంలో ఉంది. కేంద్ర ప్రభుత్వం దేశంలో పెద్ద, ప్రపంచ స్థాయి బ్యాంకుల ఏర్పాటుపై దృష్టి సారించిన నేపథ్యంలో ఎస్‌బీఐ ఛైర్మన్ ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా ఇటీవల దేశానికి పెద్ద వరల్డ్ క్లాస్ బ్యాంకుల ఆవశ్యకత ఉందని నొక్కి చెప్పారు. దీనికోసం చిన్న బ్యాంకులను పెద్ద బ్యాంకులలో విలీనం చేసే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తోంది.
ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు ఎస్‌బీఐలో ఉద్యోగాల పట్ల ఆసక్తి చూపడం వల్ల, బ్యాంకుకు సాంకేతిక అనుకూలత, కొత్త టాలెంటును వేగంగా ఉపయోగించుకునే అవకాశం లభిస్తుందని శెట్టి తెలిపారు. ఎస్‌బీఐ ఇటీవల రూ.25,000 కోట్ల మూలధనాన్ని సమీకరించే ప్రక్రియను చేపట్టింది. ఈ సమీకరణ లక్ష్యం గురించి కూడా ఛైర్మన్ స్పష్టం చేశారు. ఈ మూలధన సమీకరణ ముఖ్య ఉద్దేశం కేవలం వృద్ధి కోసం నిధులు సమకూర్చుకోవడం మాత్రమే కాదు, ఎస్‌బీఐ క్యాపిటల్ బఫర్ స్థితి బలంగా ఉంది అని బ్యాంకింగ్ రంగానికి భరోసా ఇవ్వడమేనని శెట్టి వివరించారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

