New Electric SUVs : ఒకసారి చార్జ్ చేస్తే 450 కి.మీ..భారత మార్కెట్‌లోకి రాబోతున్న 4 కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలు.

New Electric SUVs : దేశంలో ఎస్‌యూవీ కార్ల క్రేజ్ రోజురోజుకీ పెరుగుతోంది. ఈ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఆటోమొబైల్ కంపెనీలు కూడా ఈ విభాగంపై ప్రత్యేక దృష్టి సారించి కొత్త మోడళ్లను విడుదల చేస్తున్నాయి. 2025లో అనేక ఎస్‌యూవీలు లాంచ్ అయిన తర్వాత కంపెనీలు ఇప్పుడు వచ్చే సంవత్సరానికి సన్నాహాలు చేస్తున్నాయి. మీరు కూడా 2026లో కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే, వచ్చే ఏడాది భారత మార్కెట్‌లోకి రాబోయే నాలుగు కొత్త EVల వివరాలు తెలుసుకుందాం.
1. టయోటా అర్బన్ క్రూజర్ BEV
టయోటా కంపెనీ వచ్చే ఏడాది అర్బన్ క్రూజర్ BEVని మార్కెట్‌లోకి తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ఇది కంపెనీ నుంచి రాబోయే ప్రధాన ఎలక్ట్రిక్ మోడల్‌లలో ఒకటిగా భావిస్తున్నారు. అయితే ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని ఏ ప్లాట్‌ఫామ్‌పై తయారు చేస్తారు లేదా ఎంత సామర్థ్యం గల బ్యాటరీని అందిస్తారు అనే వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. ఇది భారత మార్కెట్‌లో టయోటా ఈవీ ప్రస్థానానికి కీలకమవుతుందని భావిస్తున్నారు.
2. టాటా సియెరా ఈవీ
టాటా మోటార్స్ తమ పాత సియెరా మోడల్‌ను తిరిగి తీసుకువస్తోంది. మొదట దీని ఐసీఈ (ICE-పెట్రోల్/డీజిల్) వెర్షన్‌ను లాంచ్ చేసిన తర్వాత, 2026 సంవత్సరం ప్రారంభంలో ఈ కారు ఆల్-ఎలక్ట్రిక్ వెర్షన్‌ను కంపెనీ విడుదల చేయవచ్చు. సియెరా ఈవీలో, ఇప్పటికే ఉన్న కర్వ్ ఈవీ, హారియర్ ఈవీ నుంచి కొన్ని కీలకమైన ఫీచర్లు ముఖ్యంగా బ్యాటరీ సిస్టమ్, ఎలక్ట్రికల్ సెటప్‌ను ఉపయోగించే అవకాశం ఉంది.
3. మహింద్రా XUV 3XO EV
మహింద్రా కంపెనీ కూడా వచ్చే ఏడాది XUV 3XO EV తో తమ కాంపాక్ట్ ఎలక్ట్రిక్ కార్ల శ్రేణిని విస్తరించాలని యోచిస్తోంది. ఈ మోడల్ మార్కెట్లో టాటా పంచ్ EV కి గట్టి పోటీ ఇవ్వగలదు. అంతేకాకుండా ఇది బ్రాండ్‌లోని అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ కారుగా కూడా ప్రవేశపెట్టబడే అవకాశం ఉంది. XUV 3XO EV ని రెండు రకాల బ్యాటరీ ఆప్షన్లతో విడుదల చేయవచ్చని అంచనా. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఒకసారి సింగిల్ ఛార్జ్‌పై 450 కిలోమీటర్ల కంటే ఎక్కువ డ్రైవింగ్ రేంజ్‌ను అందించవచ్చని తెలుస్తోంది.
4. మహింద్రా BE రాల్-ఈ
మహింద్రా నుంచి రాబోయే మరో ముఖ్యమైన ఈవీ మోడల్ BE రాల్-ఈ. ఇది అడ్వెంచర్ జర్నీ ఇతివృత్తంతో రూపొందించబడిన ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ. దీని ప్రొడక్షన్ వెర్షన్ 2026 నాటికి మార్కెట్‌లోకి వచ్చే అవకాశం ఉంది. ఈ ఎస్‌యూవీ, బ్రాండ్ అడ్వాన్సుడ్ INGLO ప్లాట్‌ఫామ్‌పై నిర్మించబడుతుంది. ఇది ఆఫ్-రోడ్ రైడింగ్‌కు ప్రేరణగా డిజైన్ అంశాలను, ప్రత్యేకమైన మెకానికల్ అప్‌డేట్‌లను కలిగి ఉంటుంది. అయితే, దీని లోపలి భాగం BE 6 మోడల్‌ను పోలి ఉండే అవకాశం ఉంది. ఈ నాలుగు మోడల్స్ 2026లో భారతీయ ఈవీ మార్కెట్ ముఖచిత్రాన్ని మార్చేయగలవని అంచనా.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

