Top 5 Diesel SUVs : డీజిల్ కార్ల ప్రియులకు పండగే..బడ్జెట్ ధరలో లభిస్తున్న టాప్-5 ఎస్‌యూవీలు ఇవే.

Top 5 Diesel SUVs : భారతదేశంలో పెట్రోల్ ధరలు మండిపోతున్నా, ఎలక్ట్రిక్ కార్లు వస్తున్నా.. డీజిల్ ఎస్‌యూవీల క్రేజ్ మాత్రం అస్సలు తగ్గడం లేదు. ఎక్కువ శక్తి, లాంగ్ డ్రైవ్స్‌లో మైలేజీ, కొండ ప్రాంతాల్లో కూడా దూసుకుపోయే పవర్ కోసం చాలా మంది ఇప్పటికీ డీజిల్ కార్లనే ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా ఉమ్మడి కుటుంబాలకు 7-సీటర్ డీజిల్ ఎస్‌యూవీలు వరప్రసాదంలాంటివి.
భారతదేశంలో డీజిల్ ఎస్‌యూవీల మార్కెట్‌లో మహీంద్రా రారాజుగా వెలుగుతోంది. అతి తక్కువ ధరలో లభించే డీజిల్ కార్లలో మహీంద్రా బోలెరో మొదటి స్థానంలో ఉంది. దీని ప్రారంభ ధర సుమారు రూ.9.28 లక్షలు. ఇది పల్లెటూళ్లలో, చిన్న పట్టణాల్లో అత్యంత ఆదరణ పొందిన కారు. దీనిలోని 1.5 లీటర్ ఇంజిన్ సుమారు 16 కి.మీ మైలేజీని ఇస్తుంది. దీనికి కొంచెం మోడ్రన్ వెర్షన్ కావాలనుకునే వారికి బోలెరో నియో అందుబాటులో ఉంది. దీని ధర రూ.9.43 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇందులో టచ్‌స్క్రీన్, ఎల్‌ఈడీ లైట్ల వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి.
ఇక ఎస్‌యూవీల అసలు సిసలు మజా కోరుకునే వారికి మహీంద్రా స్కార్పియో క్లాసిక్, స్కార్పియో ఎన్ అద్భుతమైన ఎంపికలు. స్కార్పియో క్లాసిక్ ధర రూ.13.03 లక్షల నుంచి మొదలవుతుండగా, అదిరిపోయే ఫీచర్లు ఉన్న స్కార్పియో ఎన్ ధర రూ.13.61 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. స్కార్పియో ఎన్ లో సన్‌రూఫ్, 4x4 ఆప్షన్స్ వంటి ప్రీమియం ఫీచర్లు ఉండటం విశేషం. మరోవైపు, టెక్నాలజీ ప్రియుల కోసం మహీంద్రా XUV700 ఉంది. దీని ప్రారంభ ధర రూ.14.18 లక్షలు. ఏడీఏఎస్, 360 డిగ్రీ కెమెరా వంటి అత్యాధునిక ఫీచర్లు ఈ కారు సొంతం.
చివరగా, టాటా మోటార్స్ నుంచి వస్తున్న దిగ్గజ కారు టాటా సఫారీ. దీని ధర రూ.14.66 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇది అత్యంత సురక్షితమైన, స్టైలిష్ 7-సీటర్ డీజిల్ ఎస్‌యూవీ. దీనిలోని 2.0 లీటర్ క్రాయోటెక్ ఇంజిన్ 170 బీహెచ్‌పీ పవర్‌ను ఇస్తుంది. కుటుంబంతో కలిసి సుఖవంతమైన ప్రయాణం చేయాలనుకునే వారికి సఫారీ ఒక అద్భుతమైన లగ్జరీ ఆప్షన్. మీరు తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ పవర్‌ను ఆశిస్తుంటే బోలెరో లేదా స్కార్పియో వైపు చూడవచ్చు, అదే మీకు లగ్జరీ,సేఫ్టీ కావాలంటే XUV700 లేదా సఫారీని ఎంచుకోవచ్చు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
