Top 5 Cheapest CNG Cars : ఎక్కువ మైలేజ్, 6 ఎయిర్‌బ్యాగ్‌లతో వచ్చే చవకైన సీఎన్జీ కార్లు ఇవే.

Top 5 Cheapest CNG Cars : ఎక్కువ మైలేజ్, 6 ఎయిర్‌బ్యాగ్‌లతో వచ్చే చవకైన సీఎన్జీ కార్లు ఇవే.
X

Top 5 Cheapest CNG Cars : పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్న కారణంగా చాలా మంది వినియోగదారులు ఇప్పుడు ఎక్కువ మైలేజ్, తక్కువ ఖర్చుతో నడిచే వాహనాల కోసం చూస్తున్నారు. ఈ విషయంలో సీఎన్జీ కార్లు బెస్ట్ ఆప్షన్లుగా నిలుస్తున్నాయి. జీఎస్టీ తగ్గింపు, లో మెయింటెనెన్స్ ఖర్చుల కారణంగా ఈ కార్లు మరింత సరసమైన ధరల్లో లభిస్తున్నాయి. దసరా, దీపావళి పండుగల సందర్భంగా రూ. 6-7 లక్షల బడ్జెట్‌లో కొత్త కారు కొనాలనుకునే వారి కోసం, మార్కెట్‌లో లభిస్తున్న టాప్ 5 అత్యంత చవకైన సీఎన్జీ కార్ల గురించి తెలుసుకుందాం.

1. మారుతి ఎస్-ప్రెస్సో సీఎన్జీ

సీఎన్జీ విభాగంలో అత్యంత చవకైన కార్లలో ఒకటిగా మారుతి ఎస్-ప్రెస్సో సీఎన్జీ నిలుస్తోంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 4.62 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇందులో 1.0 లీటర్ K-సిరీస్ ఇంజిన్ ఉంది. ఈ కారు కిలోకు 32.73 కి.మీ మైలేజీని అందిస్తుంది. ఫీచర్ల విషయానికి వస్తే, ఇందులో డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్ తో ఈబీడీ, ఈఎస్పీ, 7-అంగుళాల టచ్‌స్క్రీన్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, 240 లీటర్ల బూట్ స్పేస్ వంటి సదుపాయాలు ఉన్నాయి.

2. మారుతి సుజుకి ఆల్టో K10 సీఎన్జీ

మైలేజ్ క్వీన్‌గా పేరుపొందిన మారుతి ఆల్టో K10 సీఎన్జీ ధర రూ. 4.82 లక్షల నుంచి మొదలవుతుంది. దీని 998సీసీ K10C ఇంజిన్ 33.85 కి.మీ/కేజీ మైలేజీని ఇస్తుంది. సేఫ్టీకి ప్రాధాన్యత ఇస్తూ ఈ మోడల్‌లో ఏకంగా 6 ఎయిర్‌బ్యాగ్స్, ఏబీఎస్, ఈబీడీ, ఈఎస్పీ, హిల్ హోల్డ్ అసిస్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. 7-అంగుళాల టచ్‌స్క్రీన్, 214 లీటర్ల బూట్ స్పేస్ వంటివి చిన్న కుటుంబాలకు ఈ కారును బెస్ట్ ఆప్షన్.

3. టాటా టియాగో సీఎన్జీ

భద్రతకు పెద్ద పీట వేసే టాటా టియాగో సీఎన్జీ ధర రూ. 5.49 లక్షల నుంచి మొదలవుతుంది. ఈ కారుకు 4-స్టార్ గ్లోబల్ ఎన్‌క్యాప్ సేఫ్టీ రేటింగ్ ఉంది, ఇది బడ్జెట్ విభాగంలో అత్యంత సురక్షితమైన కార్లలో ఒకటి. దీని 1.2 లీటర్ ఇంజిన్ కిలోకు 26.49 కి.మీ(మ్యాన్యువల్) నుండి 28.06 కి.మీ/కేజీ (ఏఎంటీ) వరకు మైలేజ్ ఇస్తుంది. 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ ఏసీ వంటి లేటెస్ట్ ఫీచర్లు దీని సొంతం.

4. మారుతి వాగన్ ఆర్ సీఎన్జీ

పెద్ద ఫ్యామిలీ కారుగా పేరున్న మారుతి వాగన్ ఆర్ సీఎన్జీ ధర రూ. 5.89 లక్షల నుంచి మొదలవుతుంది. ఈ కారు కిలోకు 34.05 కి.మీ మైలేజీని ఇస్తుంది. సేఫ్టీ కోసం ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్స్, ఏబీఎస్, ఈఎస్పీ, హిల్ హోల్డ్ అసిస్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. దీని 341 లీటర్ల బూట్ స్పేస్ కారణంగా, ఎక్కువ సామాన్లు తీసుకెళ్లాల్సిన కుటుంబాలకు ఇది సరైన ఎంపిక.

5. మారుతి సెలెరియో సీఎన్జీ

భారతదేశంలోనే అత్యధిక ఇంధన సామర్థ్యం గల సీఎన్జీ కారుగా మారుతి సెలెరియో సీఎన్జీ నిలుస్తోంది. దీని ధర రూ. 5.98 లక్షల నుంచి మొదలవుతుంది. ఈ కారు కిలోకు 34.43 కి.మీ మైలేజీని ఇస్తుంది. ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్, ఈబీడీ, ఈఎస్పీ వంటి భద్రతా ఫీచర్లు ఉన్నాయి. 7-అంగుళాల టచ్‌స్క్రీన్, కీ-లెస్ ఎంట్రీ, ఆటోమేటిక్ ఏసీ వంటి ఫీచర్లతో తక్కువ ఖర్చులో ఎక్కువ మైలేజ్ కోరుకునేవారికి ఇది బెస్ట్ ఛాయిస్.

Tags

Next Story