Safest Cars : పంచ్ నుంచి ఈ విటారా దాకా.. భారత్ ఎన్‌క్యాప్‌లో 5-స్టార్ రేటింగ్ సాధించిన టాప్ 5 కార్లు ఇవే.

Safest Cars : పంచ్ నుంచి ఈ విటారా దాకా.. భారత్ ఎన్‌క్యాప్‌లో 5-స్టార్ రేటింగ్ సాధించిన టాప్ 5 కార్లు ఇవే.
X

Safest Cars : భారతదేశ ఆటోమొబైల్ రంగంలో ఇప్పుడు సేఫ్టీ అనేది ఒక పెద్ద ట్రెండ్‌గా మారింది. ఒకప్పుడు కారు మైలేజీ ఎంత అని అడిగే జనం, ఇప్పుడు ఆ కారు సేఫ్టీ రేటింగ్ ఎంత అని ఆరా తీస్తున్నారు. మన దేశపు సొంత సేఫ్టీ ప్రమాణం Bharat NCAP ఆధ్వర్యంలో నిర్వహించిన క్రాష్ టెస్టుల్లో పలు కార్లు అద్భుతమైన ప్రదర్శన కనబరిచి 5-స్టార్ రేటింగ్‌ను సొంతం చేసుకున్నాయి. టాటా ఆల్ట్రోజ్ నుంచి మారుతి సరికొత్త ఎలక్ట్రిక్ కారు వరకు.. ప్రాణాలకు రక్షణనిచ్చే ఆ టాప్ 5 కార్ల వివరాలు ఇవే.

1. టాటా ఆల్ట్రోజ్

భారతదేశపు అత్యంత సురక్షితమైన హ్యాచ్‌బ్యాక్‌గా టాటా ఆల్ట్రోజ్ రికార్డు సృష్టించింది. భారత్ ఎన్‌క్యాప్ పరీక్షల్లో ఈ కారు పెద్దల రక్షణలో 32కి 29.65 పాయింట్లు సాధించి 5-స్టార్ రేటింగ్ పొందింది. అంతేకాదు, పిల్లల రక్షణలో కూడా 44.90 పాయింట్లతో 5-స్టార్ స్కోర్ చేసింది. పెట్రోల్, డీజిల్, CNG వేరియంట్లలో లభించే ఈ కారు ప్రారంభ ధర రూ.6.30 లక్షలుగా (ఎక్స్-షోరూమ్) ఉంది.

2. మారుతి సుజుకి ఈ విటారా

మారుతి సుజుకి నుండి వచ్చిన మొదటి గ్లోబల్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఈ విటారా సేఫ్టీలో అదరగొట్టింది. దీనికి పెద్దల రక్షణలో 31.49 పాయింట్లు, పిల్లల రక్షణలో 43 పాయింట్లు లభించాయి. మొత్తంగా 5-స్టార్ రేటింగ్‌తో మారుతి ఈవీ పవర్‌ను చాటింది. ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, లెవల్-2 ADAS వంటి అడ్వాన్సుడ్ సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. దీని ప్రారంభ ధర రూ.10.99 లక్షలు.

3. సిట్రోయెన్ సి3 ఎయిర్‌క్రాస్

ఫ్రెంచ్ కంపెనీ సిట్రోయెన్ తన క్వాలిటీని భారత్ ఎన్‌క్యాప్‌లో నిరూపించుకుంది. ఈ ఎస్‌యూవీ పెద్దల రక్షణలో 5-స్టార్ (27.05 పాయింట్లు) రేటింగ్ సాధించగా, పిల్లల రక్షణలో 4-స్టార్ స్కోర్ చేసింది. ఈ కారులో స్టాండర్డ్‌గా 6 ఎయిర్‌బ్యాగ్‌లు వస్తున్నాయి. సురక్షితమైన ప్రయాణం కోరుకునే వారికి రూ.8.89 లక్షల ధరలో ఇది మంచి ఆప్షన్.

4. టాటా పంచ్

తక్కువ బడ్జెట్‌లో అదిరిపోయే సేఫ్టీ కావాలనుకునే వారికి టాటా పంచ్ కేరాఫ్ అడ్రస్. భారత్ ఎన్‌క్యాప్ టెస్టులో పెద్దల రక్షణలో 30.58 పాయింట్లు, పిల్లల రక్షణలో 45 పాయింట్లు సాధించి డబుల్ 5-స్టార్ రేటింగ్‌ను కైవసం చేసుకుంది. 6 ఎయిర్‌బ్యాగ్‌లు, రెయిన్ సెన్సింగ్ వైపర్లు వంటి ఫీచర్లతో వచ్చే ఈ మైక్రో ఎస్‌యూవీ ధర రూ.5.59 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

5. హోండా అమేజ్

కాంపాక్ట్ సెడాన్ సెగ్మెంట్‌లో హోండా అమేజ్ (3వ తరం) తన సత్తా చాటింది. పెద్దల రక్షణలో 5-స్టార్ (28.33 పాయింట్లు) సాధించి అత్యంత సురక్షితమైన సెడాన్‌లలో ఒకటిగా నిలిచింది. ఇందులో ADAS టెక్నాలజీ, లేన్ వాచ్ కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి. దీని ధర రూ.7.48 లక్షల నుంచి మొదలవుతుంది.

Tags

Next Story