20 Feb 2021 2:30 AM GMT

Home
 / 
బిజినెస్ / ఇల్లు, స్థలం.. ఏదో...

ఇల్లు, స్థలం.. ఏదో ఒకటి కొనడం ఎంతైనా అవసరం.. మున్ముందు..!

పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే ఇల్లనేది సమకూర్చుకోవాలి. రాను రాను ఖర్చులు పెరిగిపోతుంటాయి ఇల్లాలు ఒకటే పోరు పెట్టినా బడ్జెట్ పెరిగిపోతే భరించడం కష్టమని ఇంటాయన ఇల్లు కొనడాన్ని వాయిదా వేస్తుంటారు.

ఇల్లు, స్థలం.. ఏదో ఒకటి కొనడం ఎంతైనా అవసరం.. మున్ముందు..!
X

పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే ఇల్లనేది సమకూర్చుకోవాలి. రాను రాను ఖర్చులు పెరిగిపోతుంటాయి ఇల్లాలు ఒకటే పోరు పెట్టినా బడ్జెట్ పెరిగిపోతే భరించడం కష్టమని ఇంటాయన ఇల్లు కొనడాన్ని వాయిదా వేస్తుంటారు. కానీ అద్దెలు కూడా అదే స్థాయిలో పెరుగుతుండడంతో ఈఎమ్ఐ కట్టుకుని ఇల్లు తీసుకోవడం బెటర్ అంటున్నారు స్థిరాస్థి నిపుణులు. మీ బడ్జెట్లో ఎక్కడో ఒక చోట ఇల్లు తీసుకోవడం ఉత్తమం. మున్ముందు స్థిరాస్థుల ధరలు పెరగడమే తప్ప తగ్గవని.. దూరమైనా భవిష్యత్తులో ఆ ఏరియా రూపు రేఖలు మారిపోతాయని భరోసా ఇస్తున్నారు నిపుణులు. రానున్న కాలంలో భూములు, నిర్మాణ వ్యయం మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు. అప్పుడు సొంత ఇంటి కల కలగానే మిగిలిపోతుందని, అందుకే ఇప్పుడే ధైర్యం చేయాలని అంటున్నారు.

హైదరాబాద్‌కి నలువైపులా నిర్మాణాలు..

హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ వేగంగా విస్తరిస్తోంది. కేపీహెచ్‌బీ, లింగంపల్లి దాటి బాచుపల్లి, పటాన్ చెరు, అమీన్ పూర్ ప్రాంతాలు కూడా సిటీకి దగ్గరగా మారిపోయాయి. ఈ ప్రాంతాల్లో బహుళ అంతస్థుల భవనాలు, గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్ మెంట్లు విస్తారంగా వెలుస్తున్నాయి. విల్లా ప్రాజెక్టులు కూడా పెద్ధ సంఖ్యలో చేపడుతున్నారు బిల్డర్లు. మరోవైపు కొల్లూరు, శంకరపల్లి వరకు కూడా స్థలాలు ఎక్కువగా అందుబాటులో ఉంటున్నాయి.

ఇంకోవైపు నార్సింగ్, అప్పా జెంక్షన్ దాటి కిస్మత్ పూర్, శంషాబాద్ వైపుకీ విస్తరిస్తున్నాయి. ఇక్కడ కూడా ఎక్కడ చూసినా అపార్ట్‌మెంట్లు కట్టేస్తున్నారు. సంవత్సరం తిరిగేలోపు కొందామంటే ఒక్కటి కూడా ఉండట్లేదు. ఈమార్గంలో మెట్రో రెండో దశ పనులు చేపట్టే ఆలోచన ఉండడంతో మరిన్ని నిర్మాణాలకు అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. కొత్త కొత్త టౌన్‌షిప్‌లకు భవిష్యత్తులో అవకాశం ఉంది.

గ్రిడ్ పాలసీతో కొంపల్లి నుంచి మేడ్చల్ వరకు, ఉప్పల్, ఘట్‌కేసర్, ఎల్బీనగర్, హయత్ నగర్, సాగర్ హైవే, ఆదిభట్ల వరకు, రాజేంద్ర నగర్, శంషాబాద్, తుక్కుగూడ వరకు నగరం విస్తరించడంతో ఇక్కడ స్థిరాస్థి లావాదేవీలు ఊపందుకున్నాయి.

శివార్లలో అత్యధిక ప్రాంతాల్లో ఇంటి ధరలు ఇప్పటికీ అందుబాలోనే ఉన్నాయని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. బాచుపల్లి, చందానగర్, దమ్మాయిగూడ, గాజుల రామారం, అత్తాపూర్, కిస్మత్ పూర్, కొంపల్లి, నాగోల్, బండ్లగూడ, సైనిక్‌పురి, యాప్రాల్, బోడుప్పల్, ఫిర్జాదిగూడ, ఆదిభట్ల, తుక్కుగూడ, కొల్లూరు వరకు చిన్న అపార్ట్‌మెంట్ మొదలు గేటెడ్ కమ్యూనిటీల్లోనూ చాలా వరకు అందుబాటులో ఉన్నాయి. ఇక గేటెడ్ కమ్యూనిటీల విషయానికి వస్తే ఇవి ఎక్కువగా అవుటర్‌కు చేరువలో ఉన్నాయి.

అవుటర్ నుంచి బయటివైపుకు 20 కి.మీ వరకు ప్లాటింగ్ వ్యాపారం జోరుగా సాగుతోంది. వంద, రెండు వందల ఎకరాలు తీసుకుని అక్కడే సామూహిక వ్యవసాయం చేస్తున్నారు. భవిష్యత్ అవసరాల కోసం ఎక్కువగా ఇక్కడ పెట్టుబడి పెడుతున్నారు.

హైవేల వెంట కూడా ఇళ్ల నిర్మాణం జోరందుకుంటోంది.

వరంగల్ హైవే మార్గంలో ప్రభుత్వం యాదాద్రి అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఐటీ కంపెనీలు విస్తరణ చేపడుతుండడంతో ఎక్కువ మందిని ఆకర్షిస్తోంది. యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ విస్తరణ ప్రణాళికలు ఉన్నాయి.

నాగార్జున సాగర్ హైవే, శ్రీశైలం రహదారి, బెంగళూరు జాతీయ రహదారి, నాగ్‌పూర్ జాతీయ రహదారి, పాత ముంబయి రహదారిలోనూ స్థిరాస్థి మార్కెట్ విస్తరించింది. ప్రము ఐటీ సంస్థలు, బడా సంస్థలు తమ ప్రాజెక్టులు ప్రారంభిస్తుండడంతో భవిష్యత్ అవసరాల దృష్ట్యా కొనుగోళ్లకు మొగ్గు చూపుతున్నారు.

Next Story