Toyota : టయోటా నుంచి తొలి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఎబెల్లా..ఒక్కసారి ఛార్జ్ చేస్తే 543 కిమీ ప్రయాణం.

Toyota : టయోటా కిర్లోస్కర్ మోటార్ భారత మార్కెట్లో తన మొదటి పూర్తి స్థాయి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ Urban Cruiser Ebellaను ప్రదర్శించింది. ఇది మారుతి సుజుకి ఈ-విటారాకు రీబ్యాజ్డ్ వెర్షన్ అయినప్పటికీ, టయోటా తనదైన స్టైలింగ్‌తో దీనికి సరికొత్త రూపాన్ని ఇచ్చింది. ఫ్యూచరిస్టిక్ డిజైన్, పిక్సెల్ తరహా ఎల్ఈడీ డీఆర్ఎల్స్ (DRLs), అగ్రెసివ్ బంపర్లతో ఈ కారు చూడటానికి చాలా పవర్‌ఫుల్‌గా కనిపిస్తోంది. ఈ ఈవీ కోసం బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. కేవలం రూ.25,000 చెల్లించి ఈ కారును రిజర్వ్ చేసుకోవచ్చు.
ఈ కారు లోపలి భాగం చాలా లగ్జరీగా ఉంది. బ్లాక్, ట్యాన్ కలర్ థీమ్ కారుకు ప్రీమియం లుక్‌ను ఇస్తోంది. ఇందులో 10.25 అంగుళాల భారీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10.1 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉన్నాయి. అలాగే జేబీఎల్ సౌండ్ సిస్టమ్, పనోరమిక్ గ్లాస్ రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు వంటి హై-ఎండ్ ఫీచర్లు ప్రయాణాన్ని మరింత సుఖవంతం చేస్తాయి. డ్రైవర్ సౌకర్యం కోసం 10 రకాలుగా సర్దుబాటు చేసుకోగలిగే ఎలక్ట్రిక్ సీట్లను కూడా టొయోటా అందించింది.
భద్రత విషయంలో టయోటా ఎక్కడా రాజీ పడలేదు. ఈ కారులో లెవల్-2 ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్) ఉంది. ఇది రోడ్డుపై ప్రమాదాలను ముందుగానే పసిగట్టి డ్రైవర్‌ను హెచ్చరిస్తుంది. అలాగే 7 ఎయిర్‌బ్యాగులు, 360-డిగ్రీ కెమెరా, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. మారుతి ఈ-విటారాకు భారత్ NCAPలో 5-స్టార్ రేటింగ్ వచ్చిన నేపథ్యంలో.. ఎబెల్లా కూడా అదే స్థాయి భద్రతను అందిస్తుందని కంపెనీ ధీమా వ్యక్తం చేస్తోంది.
ఇక అందరూ ఎదురుచూసే రేంజ్ విషయానికి వస్తే.. ఎబెల్లా ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 543 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదని కంపెనీ పేర్కొంది. ఇది రెండు రకాల బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో లభించనుంది. ఏసీ, డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ రెండింటినీ ఇది సపోర్ట్ చేస్తుంది. భారతీయ రోడ్లపై హ్యుందాయ్ క్రెటా ఈవీ, టాటా కర్వ్ ఈవీ, మహీంద్రా BE 6 వంటి దిగ్గజ కార్లతో ఎబెల్లా తలపడనుంది. ధర వివరాలు ఇంకా ప్రకటించనప్పటికీ.. ఈ సెగ్మెంట్లో గట్టి పోటీనిస్తుందని ట్రేడ్ అనలిస్టులు భావిస్తున్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
