Toyota : నంబర్-1 స్థానం పోగొట్టుకున్నఇన్నోవా..టాప్ ప్లేస్‌ను దక్కించుకున్న కొత్త ఎస్‌యూవీ ఇదే!

Toyota : నంబర్-1 స్థానం పోగొట్టుకున్నఇన్నోవా..టాప్ ప్లేస్‌ను దక్కించుకున్న కొత్త ఎస్‌యూవీ ఇదే!
X

Toyota : భారతీయ మార్కెట్లో దశాబ్దాలుగా తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయించిన టయోటా ఇన్నోవా కారు ఎట్టకేలకు తన నంబర్-1 స్థానాన్ని కోల్పోయింది. ఈసారి టయోటా మరొక పాపులర్ ఎస్‌యూవీ అయిన అర్బన్ క్రూయిజర్ హైరైడర్ ఒక పెద్ద సంచలనం సృష్టించింది. అక్టోబర్ 2025 నెలవారీ అమ్మకాలలో హైరైడర్, ఇన్నోవాను వెనక్కి నెట్టి టయోటాలో అత్యధికంగా అమ్ముడైన కారుగా నిలిచింది. అంతేకాకుండా, టయోటా చరిత్రలోనే ఇది అత్యధిక నెలవారీ అమ్మకాల రికార్డును కూడా బద్దలు కొట్టింది.

అక్టోబర్ 2025 నెల అమ్మకాలలో టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ తన సత్తా చాటింది. ఈ కారు మొత్తం 11,555 యూనిట్ల అమ్మకాలతో నెలవారీ అత్యధిక విక్రయాల రికార్డును నమోదు చేసింది. దీనికి పోటీగా ఉన్న ఇన్నోవా రెండు మోడల్స్, ఇన్నోవా హైక్రాస్, ఇన్నోవా క్రిస్టా రెండూ కలిపి 11,294 యూనిట్ల ఎంపీవీలను మాత్రమే విక్రయించగలిగాయి. దీనితో హైరైడర్ టయోటా బెస్ట్ సెల్లింగ్ కారుగా నిలిచింది. ఈ ఒక్క నెలలోనే ఎస్‌యూవీ, ఎంపీవీ సెగ్మెంట్లలో కలిపి టయోటా మొత్తం 33,809 యూనిట్లను పంపిణీ చేసి, తమ మునుపటి రికార్డులను కూడా బద్దలు కొట్టింది.

హైరైడర్ విజయం ఒక్క రోజులో జరిగింది కాదు. సెప్టెంబర్ 2022 లో లాంచ్ అయినప్పటి నుంచి ఈ కారు అమ్మకాలు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. ఆగస్టు 2025 లో నమోదైన 9,100 యూనిట్ల నెలవారీ అత్యధిక అమ్మకాల రికార్డును కూడా అక్టోబర్‌లో బద్దలు కొట్టింది. ఈ మిడ్-సైజ్ ఎస్‌యూవీ లీటరుకు 28కిమీ వరకు మైలేజీని ఇవ్వడం వలన మార్కెట్‌లో అత్యధిక మైలేజ్ ఇచ్చే వాహనాలలో ఒకటిగా ఉంది.

అక్టోబర్‌లో హైరైడర్ విజయం సాధించినప్పటికీ ఈ ఆర్థిక సంవత్సరం మొత్తం అమ్మకాలలో ఇన్నోవా పట్టు ఇంకా బలంగానే ఉంది. ఏప్రిల్ నుంచి అక్టోబర్ 2025 మధ్య ఇన్నోవా హైక్రాస్, క్రిస్టా మొత్తం 64,678 యూనిట్లు అమ్ముడయ్యాయి. అదే సమయంలో హైరైడర్ 57 శాతం భారీ వృద్ధిని నమోదు చేస్తూ 56,754 యూనిట్లు విక్రయించింది. అంటే, ఇప్పటికీ హైరైడర్ ఇన్నోవా కంటే 7,924 యూనిట్ల వెనుకబడి ఉంది.

సెగ్మెంట్, ధరల విషయానికి వస్తే హైరైడర్ ఒక 5-సీటర్ ఎస్‌యూవీ. దీని ధర రూ.10.95 లక్షల నుంచి రూ.19.57 లక్షల మధ్య ఉంది. ఇక ఇన్నోవా హైక్రాస్ ధర రూ.18.06 లక్షల నుంచి రూ.31.90 లక్షల వరకు, ఇన్నోవా క్రిస్టా ధర రూ.19.99 లక్షల నుంచి రూ.27.08 లక్షల వరకు ఉంది. తక్కువ ధర, మెరుగైన మైలేజ్ ఉండటమే హైరైడర్ ఈ విజయం సాధించడానికి ప్రధాన కారణమని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.

Tags

Next Story