Travel Insurance : అమెరికా-ఇరాన్ టెన్షన్..విదేశాల్లో చిక్కుకున్న భారతీయులు..మీ ట్రావెల్ ఇన్సూరెన్స్ పనిచేస్తుందా?

Travel Insurance : పశ్చిమాసియాలో ముదురుతున్న అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా విమాన ప్రయాణాలను అస్తవ్యస్తం చేశాయి. యుద్ధ మేఘాల వల్ల విమాన మార్గాలు మళ్లించడం, సర్వీసులు రద్దు కావడంతో వందలాది మంది భారతీయులు విదేశీ ఎయిర్‌పోర్టుల్లో చిక్కుకుపోయారు. దుబాయ్, ఖతార్ వంటి ట్రాన్సిట్ హబ్‌లలో గంటల తరబడి పడిగాపులు కాస్తున్న ప్రయాణికులకు ఇప్పుడు ఒకటే ప్రశ్న.. "లక్షలు పోసి తీసుకున్న ట్రావెల్ ఇన్సూరెన్స్ ఈ కష్టాల్లో ఆదుకుంటుందా?"
నిజానికి విదేశీ ప్రయాణాలకు వెళ్లేటప్పుడు ఇన్సూరెన్స్ తీసుకోవడం తప్పనిసరి. అయితే ఇలాంటి యుద్ధ వాతావరణంలో క్లెయిమ్ వస్తుందా లేదా అనేది మీరు పాలసీ ఎప్పుడు కొన్నారు అనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు.. ఇరాన్-అమెరికా మధ్య గొడవలు మొదలవ్వకముందే మీరు పాలసీ తీసుకుని ఉంటే.. విమానం ఆలస్యం, కనెక్షన్ ఫ్లైట్ మిస్ అవ్వడం వంటి వాటికి బీమా కంపెనీలు పరిహారం చెల్లిస్తాయి. కానీ, ఉద్రిక్తతలు మొదలయ్యాక పాలసీ కొంటే మాత్రం కంపెనీలు మొండిచేయి చూపే అవకాశం ఉంది.
ఇక్కడ గమనించాల్సిన మరో ముఖ్య విషయం వార్ ఎక్స్‌క్లూజన్ క్లాజ్. ఒకవేళ ఏదైనా ప్రభుత్వం అధికారికంగా యుద్ధాన్ని ప్రకటిస్తే, ఆ యుద్ధం వల్ల కలిగే నష్టాలకు బీమా కంపెనీలు బాధ్యత వహించవు. అంటే మిలిటరీ దాడుల వల్ల విమానాలు రద్దయితే క్లెయిమ్ రావడం కష్టం. అయితే, యుద్ధం అధికారికంగా ప్రకటించకుండా, కేవలం భద్రతా కారణాల దృష్ట్యా ఎయిర్‌లైన్స్ విమానాలను రద్దు చేస్తే మాత్రం ట్రిప్ ఇంటరప్షన్ కింద క్లెయిమ్ పొందే అవకాశం ఉంటుంది.
ఎయిర్‌పోర్టుల్లో చిక్కుకుపోయినప్పుడు ప్రయాణికుల ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం కూడా ఉంది. ఇలాంటి సమయాల్లో ట్రావెల్ మెడికల్ ఇన్సూరెన్స్ రక్షణగా నిలుస్తుంది. యుద్ధంతో సంబంధం లేకుండా ప్రయాణికుడు అనారోగ్యానికి గురైతే ఆసుపత్రి ఖర్చులు ఇన్సూరెన్స్ కంపెనీ భరిస్తుంది. కానీ, బాంబు దాడులు లేదా మిలిటరీ చర్యల వల్ల గాయపడితే మాత్రం వైద్య ఖర్చుల క్లెయిమ్ తిరస్కరణకు గురయ్యే ఛాన్స్ ఉంది. అందుకే ప్రయాణానికి ముందే పాలసీలోని చిన్న అక్షరాల నిబంధనలను క్షుణ్ణంగా చదవడం మంచిది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
