Trump Tariff Cut : ప్రపంచ వాణిజ్య చరిత్రలో పెను సంచలనం.. ట్రంప్ నిర్ణయంతో భారత్ గెలుపు.

Trump Tariff Cut : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత్‌కు అదిరిపోయే శుభవార్త చెప్పారు. గత కొంతకాలంగా టారిఫ్ విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్న ట్రంప్, అనూహ్యంగా తన వైఖరిని మార్చుకున్నారు. భారత్ నుంచి అమెరికాకు వెళ్లే ఉత్పత్తులపై విధించే రెసిప్రోకల్ టారిఫ్‌ను 25 శాతం నుంచి 18 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్లో మాట్లాడిన తర్వాత ట్రంప్ ఈ సంచలన నిర్ణయం తీసుకోవడం విశేషం. ఈ నిర్ణయం అటు భారత ఎగుమతిదారులకు, ఇటు స్టాక్ మార్కెట్లకు భారీ ఊరటనివ్వనుంది.
అమెరికా భారత దేశానికి అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. ఐటీ సేవలు, ఫార్మాస్యూటికల్స్, టెక్స్‌టైల్స్, ఆటో విడిభాగాలు, రత్నాలు, ఆభరణాల వంటి రంగాలు అమెరికా మార్కెట్‌పైనే ఎక్కువగా ఆధారపడి ఉన్నాయి. ఇప్పుడు టారిఫ్ 7 శాతం తగ్గడంతో, భారతీయ ఉత్పత్తులు అమెరికాలో చౌకగా లభిస్తాయి. దీనివల్ల మన ఎగుమతిదారులకు ఇతర దేశాల పోటీని తట్టుకునే శక్తి పెరుగుతుంది. ఫలితంగా దేశంలోకి విదేశీ మారక ద్రవ్యం భారీగా వచ్చే అవకాశం ఉంది.
టారిఫ్ తగ్గింపుతో పాటు ట్రంప్ మరో కీలక షరతు విధించారు. రష్యా నుంచి ముడి చమురు కొనడం తగ్గించి, అమెరికా, వెనిజులా నుంచి ఎక్కువ చమురు కొనాలని భారత్‌ను కోరారు. రష్యా చమురుతో పోలిస్తే అమెరికా చమురు ధర కాస్త ఎక్కువే అయినప్పటికీ, అమెరికాతో వ్యూహాత్మక సంబంధాలు బలపడటం వల్ల భారత్‌కు పెట్టుబడులు, సాంకేతిక సహకారం రూపంలో దీర్ఘకాలిక ప్రయోజనాలు కలుగుతాయి. ఈ నిర్ణయం భారత్ శక్తి వనరుల దిగుమతి సమీకరణాలను పూర్తిగా మార్చేయబోతోంది.
ట్రంప్ ప్రకటన వెలువడగానే భారత స్టాక్ మార్కెట్లలో ఉత్సాహం నెలకొంది. గత కొన్ని నెలలుగా టారిఫ్ భయంతో కుదేలైన ఐటీ, ఫార్మా, టెక్స్‌టైల్ కంపెనీల షేర్లు ఇప్పుడు రాకెట్‌లా దూసుకెళ్లే అవకాశం ఉంది. అమెరికా మార్కెట్‌లో డిమాండ్ పెరగడం వల్ల ఈ కంపెనీల ఆదాయాలు మెరుగుపడతాయని ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. అయితే, చమురు దిగుమతి బిల్లు పెరిగే అవకాశం ఉండటంతో రూపాయి విలువ, ఎనర్జీ కంపెనీల షేర్లలో కొంత ఒడిదుడుకులు ఉండవచ్చు.
భారత మార్కెట్లోకి అమెరికా ఉత్పత్తుల వెల్లువ?
ట్రంప్ వ్యూహం ప్రకారం.. అమెరికా తన సుంకాలను తగ్గించినట్లే, భారత్ కూడా అమెరికా నుంచి వచ్చే వస్తువులపై సుంకాలను తగ్గించాల్సి ఉంటుంది. ఒకవేళ భారత్ సుంకాలను సున్నా శాతానికి తగ్గిస్తే, అమెరికాకు చెందిన ఎలక్ట్రానిక్స్, మెడికల్ పరికరాలు భారత మార్కెట్లో చౌకగా దొరుకుతాయి. ఇది భారతీయ వినియోగదారులకు శుభవార్తే అయినప్పటికీ, స్వదేశీ తయారీ కంపెనీలకు గట్టి పోటీ ఎదురవుతుంది. ఏదేమైనా, ఈ ఒప్పందం వల్ల భారత్-అమెరికా ఆర్థిక బంధం మరో స్థాయికి చేరుకోబోతోంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
