Electric Scooter : ఈవీ మార్కెట్లో టీవీఎస్ సునామీ.. ఓలా ఎలక్ట్రిక్ ఆటలు ఇక సాగవ్.

Electric Scooter : భారత ఎలక్ట్రిక్ టూ-వీలర్ మార్కెట్‌లో పెను మార్పులు చోటుచేసుకున్నాయి. ఒకప్పుడు రారాజులా వెలిగిన ఓలా ఎలక్ట్రిక్ ఇప్పుడు పాతాళానికి పడిపోగా.. సాంప్రదాయ దిగ్గజ సంస్థలు టీవీఎస్, బజాజ్ అగ్రస్థానాలను కైవసం చేసుకున్నాయి. 2026 జనవరి నెల సేల్స్ రిపోర్ట్ చూస్తుంటే కస్టమర్లు ఇప్పుడు బ్రాండ్ విలువతో పాటు సర్వీస్‌కు కూడా పెద్దపీట వేస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాల్లో జనవరి 2026 ఒక చారిత్రక మైలురాయిగా నిలిచిపోయింది. టీవీఎస్ మోటార్ కంపెనీ తన ఐక్యూబ్ స్కూటర్ల ధాటికి ఓలాను వెనక్కి నెట్టి అగ్రస్థానాన్ని ఆక్రమించింది. జనవరిలో టీవీఎస్ ఏకంగా 34,440 యూనిట్లను విక్రయించి గత ఏడాది కంటే 43.3% వృద్ధిని సాధించింది. మరోవైపు, బజాజ్ ఆటో తన చేతక్ స్కూటర్లతో దూసుకుపోతోంది. బజాజ్ ఈ నెలలో 25,520 యూనిట్లను అమ్మి రెండో స్థానంలో నిలిచింది. ఇటీవల విడుదలైన చౌకైన వేరియంట్లు బజాజ్ సేల్స్ పెరగడానికి ప్రధాన కారణం.
అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. దేశంలోనే నంబర్ వన్ ఈవీ కంపెనీగా ఉన్న ఓలా ఎలక్ట్రిక్ అమ్మకాలు భారీగా పడిపోయాయి. గత ఏడాది జనవరిలో 24,027 యూనిట్లు అమ్మిన ఓలా, ఈ ఏడాది కేవలం 7,516 యూనిట్లకే పరిమితమైంది. సర్వీస్ సమస్యలు, కస్టమర్ల ఫిర్యాదులు ఓలా బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీశాయి. సాంప్రదాయ కంపెనీలపై కస్టమర్లు మళ్లీ నమ్మకాన్ని పెంచుకుంటున్నారని ఈ గణాంకాలు నిరూపిస్తున్నాయి.
కేవలం టీవీఎస్, బజాజ్ మాత్రమే కాదు.. ఇతర కంపెనీలు కూడా ఈవీ మార్కెట్లో అద్భుతాలు చేస్తున్నాయి. ముఖ్యంగా హీరో మోటోకార్ప్ కు చెందిన విడా బ్రాండ్ ఏకంగా 716% వార్షిక వృద్ధిని నమోదు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. గత ఏడాది కేవలం 1,600 యూనిట్లు అమ్మిన హీరో, ఈ ఏడాది జనవరిలో 13,274 యూనిట్లను విక్రయించింది. సామాన్యులకు అందుబాటులో ఉండే ధరలు, నమ్మకమైన సర్వీస్ హీరోకు కలిసొచ్చింది.
మరోవైపు టెక్నాలజీకి మారుపేరైన ఏథర్ ఎనర్జీ కూడా తన జోరును కొనసాగిస్తోంది. కొత్తగా వచ్చిన రిజ్తా ఫ్యామిలీ స్కూటర్ పుణ్యమా అని ఏథర్ 21,923 యూనిట్ల విక్రయాలను సాధించింది. ఓటిఏ అప్‌డేట్స్, స్మార్ట్ ఫీచర్లతో యువతను ఆకర్షిస్తోంది. మొత్తం మీద చూస్తుంటే, ఓలా మార్కెట్‌ను టీవీఎస్, బజాజ్, హీరోలు కలిసి పంచుకుంటున్నట్లు కనిపిస్తోంది. సర్వీస్ బాగుంటేనే సేల్స్ బాగుంటాయని ఈ ఫలితాలు ఈవీ కంపెనీలకు గట్టి గుణపాఠం నేర్పాయి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
