UPI: డిజిటల్ షాపింగ్‌లో యూపీఐకు గ్రీన్ సిగ్నల్!

UPI: డిజిటల్ షాపింగ్‌లో యూపీఐకు గ్రీన్ సిగ్నల్!
X
యూపీఐ పెంపొందించేందుకు ప్రభుత్వం వ్యూహం

ప్రస్తుతం దేశవ్యాప్తంగా షాపింగ్‌ అయినా, చిన్నచిన్న లావాదేవీలైనా – డిజిటల్‌ పేమెంట్స్‌దే హవా. ముఖ్యంగా యూపీఐ (UPI), క్రెడిట్ కార్డులతో బిల్లు చెల్లించే వారు పెరుగుతున్నారు. అయితే యూపీఐ వినియోగాన్ని మరింతగా పెంచేందుకు భారత ప్రభుత్వం కీలక ప్రణాళికలను రూపొందిస్తోంది. తాజా సమాచారం ప్రకారం, యూపీఐతో చెల్లింపులు చేస్తే వినియోగదారులకు తక్షణమే తక్కువ ధరలో వస్తువులు దొరికేలా చర్యలు తీసుకునే యోచనలో ఉంది కేంద్రం.

యూపీఐ VS క్రెడిట్ కార్డ్‌ .. వ్యత్యాసం ఇదే!

క్రెడిట్ కార్డ్‌లతో పేమెంట్‌ చేసినప్పుడు వ్యాపారులు బ్యాంకులకు 2-3 శాతం మేర "మర్చంట్ డిస్కౌంట్ రేట్" (MDR) చెల్లించాల్సి వస్తుంది. ఈ ఖర్చును కొంతమంది వ్యాపారులు ధరలపైనే వేస్తారు. కానీ యూపీఐ పేమెంట్స్‌కి అలాంటి ఛార్జీలు లేవు. దీని వల్ల వ్యాపారులు పూర్తి మొత్తం పొందుతారు. వినియోగదారులు కూడా అదనపు ఛార్జీల నుంచి తప్పించుకోవచ్చు.

యూపీఐ పెంపొందించేందుకు ప్రభుత్వం వ్యూహం

ఫైనాన్షియల్ ప్లాట్‌ఫార్మ్ ‘లైవ్‌మింట్‌’ ప్రకారం, వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ, యూపీఐ వాడే కస్టమర్లకు తక్షణ డిస్కౌంట్లు ఇవ్వాలన్న ఆలోచనతో ముందుకెళ్తోంది. ఈ స్కీమ్ అమలయ్యే పరిస్థితుల్లో, ₹100 విలువ చేసే వస్తువు యూపీఐతో చెల్లిస్తే ₹98కే లభించే అవకాశం ఉంటుంది. దీని వల్ల యూపీఐకి మరింత ఆదరణ పెరిగే అవకాశం ఉంది. ఈ ప్రణాళికపై ఈ-కామర్స్ సంస్థలు, పేమెంట్ ప్రొవైడర్లు, NPCI, ఆర్థిక శాఖలు కలిసి 2025 జూన్‌లో సమావేశమయ్యే అవకాశం ఉంది.

వేగంగా UPI, భారీ లావాదేవీలు

NPCI తాజాగా ప్రకటించిన ప్రకారం, జూన్ 16, 2025 నుంచి UPI ట్రాన్సాక్షన్లు కేవలం 15 సెకన్లలో పూర్తవుతాయి. ఇప్పటి వరకు ఈ వ్యవధి 30 సెకన్లు ఉండేది. ఇక FY2025లో దేశవ్యాప్తంగా 185.85 బిలియన్ UPI లావాదేవీలు జరిగాయి. ఇది గతేడాది కంటే 42% అధికం. లావాదేవీల విలువ కూడా ₹260.56 ట్రిలియన్లకు చేరింది.

UPI ఫ్రీగా ఉంటుందా?

ఇదే సమయంలో పేమెంట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, యూపీఐ, RuPay డెబిట్ కార్డులకు MDR ఛార్జీలు పెట్టాలని ఒత్తిడి చేస్తోంది. కానీ ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకు వాటిని ఆమోదించలేదు. యూపీఐపై ఎలాంటి ఛార్జీలు లేకుండా కొనసాగిస్తే వ్యాపారులు కూడా దీనిని ప్రాధాన్యతతో ఉపయోగించే అవకాశం ఉంది. భవిష్యత్తులో షాపింగ్ చేసేప్పుడు యూపీఐ వాడితే డిస్కౌంట్ పొందే అవకాశం ఉందనే వార్త వినిపిస్తుండటంతో, వినియోగదారుల్లో ఆసక్తి పెరిగే అవకాశముంది.

Tags

Next Story