UPI Record : యూపీఐ లావాదేవీలలో కొత్త రికార్డు..నవంబర్‌లో రూ.26.32 లక్షల కోట్ల వ్యాపారం.

UPI Record : భారతదేశంలో డిజిటల్ చెల్లింపుల విప్లవానికి యూపీఐ వినియోగం రోజురోజుకు పెరుగుతోంది. చిన్న టీ కొట్టు నుంచి పెద్ద మాల్స్ వరకు ప్రతిచోటా యూపీఐ కీలకంగా మారింది. తాజాగా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. నవంబర్ నెలలో యూపీఐ ద్వారా జరిగిన మొత్తం లావాదేవీల సంఖ్య 20 బిలియన్ మార్కును అధిగమించింది. ఈ ఒక్క నెలలోనే యూపీఐ ద్వారా రూ.26 లక్షల కోట్ల విలువైన భారీ నగదు లావాదేవీలు జరిగాయి. ఈ ఘనత భారతదేశ డిజిటల్ ఆర్థిక వ్యవస్థ బలాన్ని సూచిస్తోంది.
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. నవంబర్ 2025 నెలలో యూపీఐ ద్వారా జరిగిన లావాదేవీల సంఖ్య, విలువ గత సంవత్సరంతో పోలిస్తే గణనీయంగా పెరిగాయి. ఈ ఒక్క నెలలోనే మొత్తం 2,047 కోట్ల (20 బిలియన్) యూపీఐ లావాదేవీలు నమోదయ్యాయి. వీటి మొత్తం విలువ రూ. 26.32 లక్షల కోట్లుగా ఉంది. గత సంవత్సరం నవంబర్‌తో పోలిస్తే, లావాదేవీల సంఖ్యలో 32 శాతం పెరుగుదల, విలువలో 22 శాతం పెరుగుదల కనిపించింది. ముఖ్యంగా 2023 నవంబర్‌తో పోలిస్తే, ప్రస్తుత యూపీఐ లావాదేవీల సంఖ్య 70 శాతం పెరగడం యూపీఐ ప్రజాదరణకు, డిజిటల్ చెల్లింపుల పట్ల భారతీయ వినియోగదారుల విశ్వాసానికి స్పష్టమైన నిదర్శనం.
గత ఐదు సంవత్సరాలలో యూపీఐ వాడకంలో స్థిరమైన, భారీ పెరుగుదల నమోదైంది. ఉదాహరణకు 2021 నవంబర్‌లో ఈ ప్లాట్‌ఫారమ్‌లో 418 కోట్ల లావాదేవీలు జరిగాయి. వీటి విలువ రూ. 7.68 లక్షల కోట్లు. 2022 నాటికి ఈ వినియోగం దాదాపు రెట్టింపు అయ్యింది. ఆ తర్వాత కూడా యూపీఐ వాడకం స్థిరంగా పెరుగుతూ వచ్చింది. ముఖ్యంగా చిన్న విలువ కలిగిన లావాదేవీలలో యూపీఐ కీలకంగా మారింది. ప్రస్తుతం అక్టోబర్, నవంబర్ నెలల్లో రోజువారీ సగటు యూపీఐ లావాదేవీల సంఖ్య 66 కోట్ల నుంచి 68 కోట్ల మధ్య కొనసాగుతోంది. ఇది యూపీఐ దేశీయ ఆర్థిక వ్యవస్థలో ఎంతగా స్థిరపడిందో సూచిస్తుంది.
పండుగల సీజన్ ప్రభావం వల్ల నెలవారీ లావాదేవీల సంఖ్యలో స్వల్ప హెచ్చుతగ్గులు కనిపించాయి. పండుగ సీజన్ అయిన అక్టోబర్ నెలలో రికార్డు స్థాయిలో 2,070 కోట్ల లావాదేవీలు జరగగా, నవంబర్‌లో ఈ సంఖ్య స్వల్పంగా తగ్గి 2,040 కోట్లుగా నమోదైంది. ఇదే ట్రెండ్ విలువలో కూడా కనిపించింది. అక్టోబర్‌లో లావాదేవీల విలువ రూ. 27.28 లక్షల కోట్లు ఉండగా, నవంబర్‌లో అది రూ. 26.32 లక్షల కోట్లకు తగ్గింది. సెప్టెంబర్‌లో 1,963 కోట్ల లావాదేవీలు (రూ.24.90 లక్షల కోట్లు) నమోదయ్యాయి. అక్టోబర్‌లో దీపావళి వంటి ప్రధాన పండుగలు ఉండటం వల్ల లావాదేవీల సంఖ్య రికార్డు స్థాయిలో పెరిగింది. ఆ తర్వాత నవంబర్‌లో స్వల్పంగా తగ్గినప్పటికీ, యూపీఐ స్థిరంగా 20 బిలియన్ మార్కు వద్ద కొనసాగుతుండటం గమనార్హం.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

