VinFast Electric Scooters : ఏథర్, ఓలాకు కొత్త టెన్షన్..మార్కెట్లోకి వందల కోట్లతో వస్తున్న విన్‌ఫాస్ట్ స్కూటర్లు.

VinFast Electric Scooters : వియత్నాంకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ విన్‌ఫాస్ట్ త్వరలోనే భారతీయ ఎలక్ట్రిక్ టూ-వీలర్ విభాగంలోకి ప్రవేశించడానికి సిద్ధమవుతోంది. వచ్చే ఏడాది అంటే 2026లో విన్‌ఫాస్ట్ కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్లు భారత మార్కెట్‌లో వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి. కంపెనీ ఇప్పటికే విన్‌ఫాస్ట్ VF 7, VF 6 వంటి ఎలక్ట్రిక్ కార్లను భారత్‌లో ప్రవేశపెట్టింది. ఇప్పుడు ఎలక్ట్రిక్ టూ-వీలర్ విభాగంలోకి కూడా ప్రవేశించడం ద్వారా భారత్‌లో తమ పట్టును మరింత బలోపేతం చేసుకోవాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.
భారతదేశంలో ఎలక్ట్రిక్ టూ-వీలర్స్ మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది. ఈ సమయంలో విన్‌ఫాస్ట్ ఈ విభాగంలోకి ప్రవేశిస్తే, ఇప్పటికే మార్కెట్‌లో ఉన్న ఓలా, ఏథర్, టీవీఎస్, బజాజ్ వంటి దేశీయ కంపెనీలకు గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. అంతర్జాతీయ బ్రాండ్ భారత్‌లో అడుగుపెట్టడం వల్ల వినియోగదారులకు ఎలక్ట్రిక్ స్కూటర్ల విభాగంలో మరిన్ని ఆప్షన్లు అందుబాటులోకి వస్తాయి. విన్‌ఫాస్ట్ తమ ఉత్పత్తులను ఆకర్షణీయమైన ధరలలో, సరికొత్త టెక్నాలజీతో విడుదల చేస్తే, దేశీయ కంపెనీల విక్రయాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.
భారతీయ ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్‌లో తమ వ్యాపారాన్ని విస్తరించడానికి విన్‌ఫాస్ట్ ఒక భారీ ప్రణాళికతో సిద్ధమైంది. కంపెనీ ఏకంగా 2 బిలియన్ డాలర్లు (సుమారు రూ.16 వేల కోట్లు) పెట్టుబడి పెట్టాలని యోచిస్తోంది. ఇందులో భాగంగా, కంపెనీ ఇప్పటికే తమిళనాడులోని తూత్తుకుడి వద్ద తమ ఉత్పత్తి ప్లాంట్‌ను సిద్ధం చేసింది. ప్రస్తుతం ఈ ప్లాంట్ ఏడాదికి 50,000 ఎలక్ట్రిక్ కార్లను తయారు చేసే సామర్థ్యం కలిగి ఉంది. త్వరలోనే ఎలక్ట్రిక్ స్కూటర్ల ఉత్పత్తిని కూడా ఇక్కడ ప్రారంభించే అవకాశం ఉంది.
విన్‌ఫాస్ట్ ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో పలు ఎలక్ట్రిక్ స్కూటర్ మోడళ్లను విక్రయిస్తోంది. వాటిలో Feliz, Klara Neo, Theon S, Vero X, Vento S, Evo Grand వంటి మోడళ్లు ఉన్నాయి. ఈ స్కూటర్లన్నీ ప్రస్తుతం వియత్నాంలోని కంపెనీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. అయితే, ఈ మోడళ్లలో ఏవి భారత్‌లో లాంచ్ అవుతాయనేది ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. భారతీయ వాతావరణం, రోడ్ల పరిస్థితులకు అనుగుణంగా కంపెనీ ఈ మోడళ్లన్నింటినీ టెస్టింగ్ చేయవచ్చు. ఆ తర్వాత ఏ మోడళ్లను ఇక్కడ విడుదల చేయాలనే దానిపై తుది జాబితా తయారు చేస్తారు. విన్‌ఫాస్ట్ తమ బెస్ట్ మోడళ్లను భారతీయ వినియోగదారుల కోసం ఎంచుకునే అవకాశం ఉంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

