VinFast : టాటా, ఎంజీలకు విన్‌ఫాస్ట్ చుక్కలు..2026లో మూడు అదిరిపోయే ఎలక్ట్రిక్ కార్లు.

VinFast :వియత్నాంకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ విన్‌ఫాస్ట్ భారత మార్కెట్లోకి తుపానులా దూసుకురావడానికి సిద్ధమైంది. ఇప్పటికే తమిళనాడులోని తూత్తుకుడిలో భారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేసిన ఈ కంపెనీ, 2026 నాటికి మూడు సరికొత్త ఎలక్ట్రిక్ కార్లను లాంచ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. కేవలం ప్రీమియం కార్లకే పరిమితం కాకుండా, సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులో ఉండేలా మైక్రో ఈవీ నుంచి ఫ్యామిలీ ఎంపీవీ వరకు పూర్తి స్థాయి శ్రేణిని సిద్ధం చేస్తోంది. టాటా మోటార్స్, మహీంద్రా, ఎంజీ మోటార్స్ హవాకు చెక్ పెట్టడమే లక్ష్యంగా విన్‌ఫాస్ట్ అడుగులు వేస్తోంది.
విన్‌ఫాస్ట్ తన ఇండియా ఇన్నింగ్స్‌ను 2026 మొదటి త్రైమాసికంలో లిమో గ్రీన్ అనే 7-సీటర్ ఎలక్ట్రిక్ ఎంపీవీతో ప్రారంభించనుంది. ఇది ముఖ్యంగా పెద్ద కుటుంబాలకు, ట్రావెల్ ఏజెన్సీలకు వరంగా మారనుంది. దీని తర్వాత మధ్యతరగతి ప్రజలే లక్ష్యంగా అతి తక్కువ ధరకే VF3 మైక్రో ఎస్‌యూవీని, టాటా పంచ్ ఈవీకి గట్టి పోటీ ఇచ్చేలా VF5 కాంపాక్ట్ ఎస్‌యూవీని తీసుకురానుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న 35 షోరూమ్‌లను 2026 చివరి నాటికి 75కి పెంచాలని కంపెనీ నిర్ణయించుకుంది.
విన్‌ఫాస్ట్ లిమో గ్రీన్ : ఇది విన్‌ఫాస్ట్ నుంచి రాబోతున్న మొట్టమొదటి త్రీ-రో ఎలక్ట్రిక్ వాహనం. 60.1kWh బ్యాటరీ సామర్థ్యంతో వచ్చే ఈ కారు, ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు 450 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. దీని ధర రూ. 18 నుంచి 20 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉండే అవకాశం ఉంది. కియా కారెన్స్ ఈవీ, బివైడి ఈ-మ్యాక్స్ 7 వంటి కార్లకు ఇది నేరుగా పోటీ ఇవ్వనుంది. విశాలమైన క్యాబిన్, అడ్వాన్స్‌డ్ టచ్‌స్క్రీన్ ఇంటర్ఫేస్ దీని ప్రధాన ఆకర్షణలు.
విన్‌ఫాస్ట్ VF3: నగరాల్లో ట్రాఫిక్ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని విన్‌ఫాస్ట్ రూపొందించిన కారు ఇది. 2026 ప్రథమార్థంలో విడుదల కానున్న ఈ కారు ధర రూ. 8 నుంచి 10 లక్షల లోపే ఉండే అవకాశం ఉంది. ఇది ఎంజీ కామెట్ ఈవీకి నేరుగా పోటీ ఇస్తుంది. 18.6kWh బ్యాటరీతో వచ్చే ఈ కారు 200 కిలోమీటర్ల పైగా రేంజ్ ఇస్తుంది. చిన్న కారే అయినప్పటికీ, దీనికి 191mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉండటం విశేషం, దీనివల్ల గుంతల రోడ్లపై కూడా సునాయాసంగా ప్రయాణించవచ్చు.
విన్‌ఫాస్ట్ VF5: విన్‌ఫాస్ట్ తన మూడవ అస్త్రంగా VF5 కాంపాక్ట్ ఎలక్ట్రిక్ కారును ప్రయోగిస్తోంది. ఇది టాటా పంచ్ ఈవీ కంటే పొడవుగా ఉండటమే కాకుండా, ఎక్కువ వీల్ బేస్ కలిగి ఉండి లోపల ఎక్కువ స్థలాన్ని కల్పిస్తుంది. ఇందులో 29.6kWh , 37.23kWh బ్యాటరీ ఆప్షన్లు ఉండవచ్చు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 326 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. 8-ఇంచుల టచ్‌స్క్రీన్, 7-ఇంచుల డిజిటల్ క్లస్టర్, అడ్వాన్స్‌డ్ సేఫ్టీ ఫీచర్లు దీని సొంతం.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

