VinFast : విన్‌ఫాస్ట్ సంచలనం.. పాత కారు ఇస్తే కొత్త ఈవీపై రూ.80 వేల వరకు అదనపు తగ్గింపు.

VinFast : విన్‌ఫాస్ట్ సంచలనం.. పాత కారు ఇస్తే కొత్త ఈవీపై రూ.80 వేల వరకు అదనపు తగ్గింపు.
X

VinFast : ప్రపంచ మార్కెట్‌లో ఇంధన ధరల పెరుగుదల, పర్యావరణ స్పృహ పెరుగుతున్న నేపథ్యంలో ప్రముఖ వియత్నామీస్ ఎలక్ట్రిక్ వాహనాల దిగ్గజం విన్‌ఫాస్ట్ భారతీయ వినియోగదారుల కోసం అదిరిపోయే ఆఫర్లను ప్రకటించింది. తమ పాత పెట్రోల్ లేదా డీజిల్ కార్లను వదిలేసి, ఎలక్ట్రిక్ కార్లకు మారాలనుకునే వారిని ప్రోత్సహించడానికి ట్రేడ్ గ్యాస్ ఫర్ ఎలక్ట్రిక్ పేరుతో ప్రత్యేక రాయితీలను అందిస్తోంది. ఈ ఆఫర్ ద్వారా కేవలం పర్యావరణానికే కాకుండా, వినియోగదారుల జేబుకు కూడా భారీగా లాభం చేకూరనుంది.

అదనపు డిస్కౌంట్లతో పండుగ

విన్‌ఫాస్ట్ తన పాపులర్ మోడల్స్ అయిన VF6, VF7 పై ప్రత్యేకంగా 3 శాతం డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తోంది. ఇప్పటికే అందుబాటులో ఉన్న ఇతర ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, ఫెస్టివ్ ఆఫర్లకు ఇది అదనం కావడం గమనార్హం. దీనివల్ల VF6 కొనేవారికి సుమారు రూ.57,570 వరకు, అలాగే VF7 కొనుగోలుపై గరిష్టంగా రూ.80,370 వరకు అదనపు ప్రయోజనం లభించనుంది. అంతేకాకుండా, పాత కస్టమర్ల కోసం మరో 3 శాతం లాయల్టీ బెనిఫిట్ కూడా అందుబాటులో ఉంది.

రీసేల్ వాల్యూపై భరోసా

ఎలక్ట్రిక్ కార్ల విషయంలో చాలామందికి ఉండే ప్రధాన సందేహం.. భవిష్యత్తులో ఆ కారును అమ్మితే మంచి ధర వస్తుందా? రాదా? అని. దీనికి విన్‌ఫాస్ట్ తన బైబ్యాక్ స్కీమ్ ద్వారా అదిరిపోయే పరిష్కారం ఇచ్చింది. ఈ ప్లాన్ ప్రకారం, కారు కొన్న 2 నుంచి 5 ఏళ్ల మధ్యలో తిరిగి కంపెనీకి అమ్మాలనుకుంటే, ఎక్స్-షోరూమ్ ధరలో 75 శాతం వరకు రీసేల్ వాల్యూ ఇస్తామని కంపెనీ హామీ ఇస్తోంది. ఇది భారతీయ ఈవీ మార్కెట్లో ఒక విప్లవాత్మక నిర్ణయమనే చెప్పాలి.

ధర, రేంజ్ వివరాలు

ప్రస్తుతం విన్‌ఫాస్ట్ తన లైనప్‌లో రెండు పవర్‌ఫుల్ e-SUVలను కలిగి ఉంది.

VF6: దీని ధర రూ. 17.29 లక్షల నుంచి రూ. 19.19 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉంది. 59.6kWh బ్యాటరీతో వచ్చే ఈ కారు ఒకసారి ఛార్జ్ చేస్తే 468 కి.మీ. ప్రయాణిస్తుంది.

VF7: దీని ధర రూ. 21.89 లక్షల నుంచి రూ. 26.79 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. ఇందులో 59.6kWh, 70.8kWh బ్యాటరీ ఆప్షన్లు ఉన్నాయి. ఇది గరిష్టంగా 532 కి.మీ. రేంజ్ ఇస్తుంది.

మార్కెట్ లో గట్టి పోటీ

విన్‌ఫాస్ట్ కార్లు భారత మార్కెట్లో టాటా హారియర్ EV, టాటా కర్వ్ EV, మహీంద్రా BE 6, హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ వంటి దిగ్గజ మోడళ్లతో పోటీపడుతున్నాయి. సేఫ్టీ విషయంలో కూడా ఈ కార్లు వెనకాడటం లేదు. భారత్ NCAP క్రాష్ టెస్టుల్లో VF6, VF7 రెండు కూడా 5-స్టార్ రేటింగ్ సాధించి, అత్యంత సురక్షితమైన కార్ల జాబితాలో చేరాయి. 10 ఏళ్ల వారంటీ, ఫ్రీ ఛార్జింగ్ ఆఫర్లతో విన్‌ఫాస్ట్ ఇప్పుడు ఈవీ రంగంలో హాట్ టాపిక్‌గా మారింది.

Tags

Next Story