VIP Car Number : ఆన్‌లైన్ వేలంలో రికార్డు...రూ.27.50లక్షల ధర పలికిన కారు నంబర్.

VIP Car Number : ఆన్‌లైన్ వేలంలో రికార్డు...రూ.27.50లక్షల ధర పలికిన కారు నంబర్.
X

VIP Car Number : నోయిడా జిల్లాలో ప్రైవేట్ వాహనాల కోసం నిర్వహించిన VIP నంబర్ల ఆన్‌లైన్ వేలం ప్రక్రియలో ఒక రికార్డు నమోదైంది. అత్యంత ప్రీమియం నంబర్‌గా పరిగణించబడే UP16FH 0001 అత్యధిక ధరకు అమ్ముడుపోయింది. ఈ నంబర్‌ను M/S AVIORION PRIVATE LIMITED అనే కంపెనీ రూ.27,50,000 ల భారీ ధరతో దక్కించుకుంది. నవంబర్ 7, 2025 న ప్రారంభమైన ఈ వేలం కోసం ప్రారంభ బిడ్ కేవలం రూ.33,333 గా నిర్ణయించారు. చాలా మంది పోటీదారుల మధ్య తీవ్ర పోటీ నెలకొనగా చివరి బిడ్ రూ.27.50 లక్షల వద్ద నిలిచింది.

VIP నంబర్‌ను దక్కించుకున్న M/S AVIORION PRIVATE LIMITED అనేది నోయిడాలో ఉన్న ఒక ఔషధ కంపెనీ. ఈ కంపెనీ తమ కొత్త మెర్సిడెజ్ బెంజ్ కారు కోసం ఈ ఫ్యాన్సీ నంబర్‌ను దక్కించుకుంది. వేలంలో విజయం సాధించిన తర్వాత కంపెనీ రూ.27,16,667 మొత్తాన్ని ఆన్‌లైన్‌లో జమ చేసి ప్రక్రియను పూర్తి చేసింది. వేలం నిబంధనల ప్రకారం.. బిడ్ గెలిచిన దరఖాస్తుదారులు నిర్ణీత సమయంలో మిగిలిన మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. AVIORION కంపెనీ సమయానికి పేమెంట్స్ పూర్తి చేయడంతో UP16FH 0001 నంబర్‌ను వారికి కేటాయించినట్లు రవాణా శాఖ అధికారులు తెలిపారు.

ఉత్తరప్రదేశ్, ఢిల్లీ ఎన్‌సీఆర్ ప్రాంతాలలో 0001 నంబర్‌ను ఎల్లప్పుడూ VIP నంబర్ల జాబితాలో అగ్రస్థానంలో పరిగణిస్తారు. సాధారణంగా పెద్ద వ్యాపారవేత్తలు, కంపెనీలు, ఆటోమొబైల్ కలెక్టర్లు, ఉన్నత స్థాయి వాహన యజమానులు ఈ నంబర్‌ను ఇష్టపడతారు. ఈ కారణంగానే దీని వేలంలో తరచుగా అధిక బిడ్డింగ్ జరుగుతుంది. అసిస్టెంట్ డివిజనల్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసర్ నరేంద్ర కుమార్ మాట్లాడుతూ.. AVIORION PRIVATE LIMITED వేలంలో అత్యధికంగా రూ.27.50 లక్షల బిడ్ వేసిందని, ఇది ఇప్పటివరకు నమోదైన అత్యంత పెద్ద బిడ్లలో ఒకటి అని తెలిపారు. మిగిలిన మొత్తం జమ అయిన వెంటనే నంబర్‌ను కంపెనీకి కేటాయించారు.

నోయిడాలో గతంలో కూడా 0001 నంబర్లు అధిక ధరకు అమ్ముడయ్యాయి. కానీ రూ.27.50 లక్షల బిడ్ ఈసారి ప్రత్యేకతను సంతరించుకుంది. ఇలాంటి కొన్ని నంబర్లను హై కేటగిరీలో ఉంచుతారు. కొనుగోలుదారులు వారికి నచ్చిన నంబర్ కోసం బుక్ చేసుకుని, నిర్ణీత మొత్తాన్ని ప్రభుత్వ ఖాతాలో జమ చేయడం ద్వారా ఆ నంబర్‌ను తమ వాహనానికి కేటాయించుకోవచ్చు.

Tags

Next Story