Volkswagen : ఫోక్స్‎వ్యాగన్ పంచ్ పటాకా..2026లోకి భారత మార్కెట్లోకి దిగుతున్న బ్రహ్మాస్త్రాలు.

Volkswagen : ఫోక్స్‎వ్యాగన్ పంచ్ పటాకా..2026లోకి భారత మార్కెట్లోకి దిగుతున్న బ్రహ్మాస్త్రాలు.
X

Volkswagen : జర్మన్ కార్ల తయారీ దిగ్గజం ఫోక్స్‌వ్యాగన్ 2026 సంవత్సరానికి సంబంధించి గ్రాండ్ ప్లాన్ సిద్ధం చేసింది. భారత్‌లో ఒకేసారి 5 కొత్త కార్లను లాంచ్ చేస్తున్నట్లు అదిరిపోయే టీజర్ వదిలింది. ఈ టీజర్‌లో ఐదు కార్లను క్లాత్‌తో కప్పి ఉంచి ఇన్వెస్టర్లలో, కారు ప్రేమికుల్లో విపరీతమైన క్యూరియాసిటీని పెంచేసింది. వీటిలో పవర్‌ఫుల్ ఎస్‌యూవీలు, ఎలక్ట్రిక్ కార్లతో పాటు ఫ్యామిలీ సెడాన్‌లు కూడా ఉన్నాయి. ఆ 5 మిస్టరీ కార్ల వెనుక ఉన్న అసలు వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఫోక్స్‌వ్యాగన్ ఇండియా తన 2.0 స్ట్రాటజీ తర్వాత ఇప్పుడు మరో పెద్ద ముందడుగు వేస్తోంది. 2026లో ప్రతి క్వార్టర్‌కు ఒక కొత్త ఉత్పత్తిని ప్రవేశపెట్టాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. తాజాగా విడుదల చేసిన టీజర్‌లో ఐదు కార్లు వరుసగా నిలబడి ఉండటం గమనార్హం. ఇందులో ఎస్‌యూవీలు, సెడాన్, ఎలక్ట్రిక్ మోబిలిటీపై కంపెనీ ప్రధానంగా ఫోకస్ పెట్టింది.

1. ఫోక్స్‌వ్యాగన్ టెరాన్ R-లైన్ : ఇది కంపెనీకి కొత్త ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీగా నిలవనుంది. ఇప్పటికే భారత్‌లో దీన్ని రివీల్ చేశారు. ఇది ప్రస్తుతం ఉన్న టిగువాన్ కంటే పైన ఉంటుంది. 7-సీటర్ లేఅవుట్, 2.0 లీటర్ టీఎస్‌ఐ పెట్రోల్ ఇంజిన్‌తో వచ్చే ఈ కారు.. టయోటా ఫార్చ్యూనర్, జీప్ మెరిడియన్ వంటి కార్లకు గట్టి పోటీ ఇవ్వనుంది. ఇది మార్చి 2026 నాటికి మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.

2. ఫోక్స్‌వ్యాగన్ టెరా : భారత్‌లో మారుతి బ్రెజా, టాటా నెక్సాన్ వంటి సబ్-4 మీటర్ ఎస్‌యూవీలకు పోటీగా ఫాక్స్‌వ్యాగన్ టెరాను తీసుకురాబోతోంది. ఇది స్కోడా కైలాక్ ప్లాట్‌ఫామ్‌పైనే తయారవుతోంది. రూ.8 లక్షల నుంచి రూ.9 లక్షల ప్రారంభ ధరలో ఉండే ఈ కారు.. కంపెనీకి పెద్ద ఎత్తున అమ్మకాలను తెచ్చిపెడుతుందని భావిస్తున్నారు.

3 & 4. వర్టిస్, టైగూన్ ఫేస్‌లిఫ్ట్‌లు : ప్రస్తుతం మార్కెట్లో ఉన్న వర్టీస్ సెడాన్, టైగూన్ ఎస్‌యూవీలకు కంపెనీ మేకోవర్ ఇవ్వనుంది. కొత్త లుక్, మరిన్ని ఫీచర్లతో వీటిని అప్‌డేట్ చేయనున్నారు. ముఖ్యంగా టైగూన్‌లో పనోరమిక్ సన్‌రూఫ్, అడ్వాన్స్‌డ్ ఏడీఏఎస్ వంటి ఫీచర్లు వచ్చే ఛాన్స్ ఉంది. హ్యుందాయ్ వెర్నా, క్రెటా వంటి కార్లతో పోటీ పడటానికి ఇవి సిద్ధమవుతున్నాయి.

5. ఫోక్స్‌వ్యాగన్ ID.4 : భారత్‌లో ఫాక్స్‌వ్యాగన్ నుంచి రాబోతున్న మొట్టమొదటి మెయిన్ స్ట్రీమ్ ఎలక్ట్రిక్ కారు ఇదే. ఐడీ.4 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని పూర్తిస్థాయిలో దిగుమతి చేసుకుని ఇక్కడ విక్రయించనున్నారు. సింగిల్ ఛార్జ్‌పై సుమారు 400 కిలోమీటర్ల కంటే ఎక్కువ రేంజ్ ఇచ్చే ఈ కారు, ప్రీమియం ఈవీ సెగ్మెంట్‌లో నిలవనుంది. అలాగే చిన్నపాటి ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ కూడా రేసులో ఉండవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి.

Tags

Next Story