Volkswagen Tayron : ప్రీమియం అంటే ఇదే..ఫోక్స్‌వ్యాగన్ టాయ్‌రోన్ టీజర్ వచ్చేసింది.

Volkswagen Tayron : ప్రీమియం అంటే ఇదే..ఫోక్స్‌వ్యాగన్ టాయ్‌రోన్ టీజర్ వచ్చేసింది.
X

Volkswagen Tayron : జర్మన్ కార్ల దిగ్గజం ఫోక్స్‌వ్యాగన్ భారతీయ మార్కెట్లోకి తన సరికొత్త అస్త్రాన్ని ప్రయోగించడానికి సిద్ధమైంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న టిగువాన్ కంటే పెద్దదైన, మరింత శక్తివంతమైన టాయ్‌రోన్ ఎస్‌యూవీని కంపెనీ త్వరలో లాంచ్ చేయబోతోంది. దీనికి సంబంధించి తొలి అధికారిక టీజర్‌ను ఫోక్స్‌వ్యాగన్ ఇండియా తాజాగా విడుదల చేసింది. ప్రీమియం ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో ఈ కారు తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటుందని కంపెనీ ధీమాగా ఉంది.

ఫోక్స్‌వ్యాగన్ విడుదల చేసిన ఈ చిన్న టీజర్ వీడియోలో కారు డిజైన్‌కు సంబంధించిన కీలక అంశాలను చాలా తెలివిగా చూపించారు. కారును పూర్తిగా ఒక ముసుగుతో కప్పి ఉంచినప్పటికీ, దాని రూపురేఖలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. టిగువాన్ కంటే పెద్ద సైజులో ఉండబోతున్న ఈ ఎస్‌యూవీ, భారతీయ కుటుంబాలకు కావాల్సిన లగ్జరీని, స్పేస్‌ను అందిస్తుందని టీజర్ ద్వారా అర్థమవుతోంది. లాంచ్ డేట్ ఇంకా ప్రకటించనప్పటికీ, ఈ టీజర్ చూస్తుంటే లాంచ్ చాలా దగ్గరలోనే ఉందని తెలుస్తోంది.

టీజర్‌లో చూపించిన దాని ప్రకారం టాయ్‌రోన్ ముందు భాగం చాలా ఆకర్షణీయంగా ఉంది. కారు వెడల్పు అంతా కవర్ చేసేలా ఉన్న LED లైట్ బార్ మరియు డే-టైమ్ రన్నింగ్ లైట్లు కారుకు ఒక ఫ్యూచరిస్టిక్ లుక్‌ను ఇస్తున్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా, ఫోక్స్‌వ్యాగన్ లోగో కూడా లైటింగ్‌తో మెరిసిపోవడం ప్రత్యేక ఆకర్షణ. కారు వెనుక భాగంలో కూడా అదే తరహాలో కనెక్ట్ చేయబడిన టెయిల్ లైట్లు, వెలుగులీనే లోగోను అమర్చారు. ఇది రాత్రి వేళలో కారుకు విలాసవంతమైన రూపాన్ని ఇస్తుంది.

ప్రపంచ మార్కెట్లలో అందుబాటులో ఉన్న టాయ్‌రోన్ తరహాలోనే భారతీయ వెర్షన్ కూడా ఉండబోతోంది. గ్లోబల్ మార్కెట్‌లో ఈ కారు 5-సీటర్, 7-సీటర్ ఆప్షన్లలో లభిస్తోంది. అయితే, ఇండియాలో వీటిలో ఏ వేరియంట్‌ను లాంచ్ చేస్తారనేది ఫోక్స్‌వ్యాగన్ ఇంకా గోప్యంగా ఉంచింది. లోపల ఇంటీరియర్ గురించి కూడా ఇంకా వివరాలు బయటకు రాలేదు కానీ, జర్మన్ స్టాండర్డ్స్‌కు అనుగుణంగా అత్యంత ఖరీదైన మెటీరియల్స్, అత్యాధునిక టెక్నాలజీతో కూడిన డాష్‌బోర్డ్ ఉండబోతోందని సమాచారం.

ఈ భారీ ఎస్‌యూవీలో టిగువాన్ ఆర్-లైన్ నుంచి సేకరించిన 2.0 లీటర్ TSI పెట్రోల్ ఇంజిన్‌ను వాడనున్నారు. ఇది గరిష్టంగా 204 హార్స్ పవర్, 320 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ నాలుగు సిలిండర్ల ఇంజిన్‌కు 7-స్పీడ్ DSG (డ్యూయల్ క్లచ్) ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను జత చేశారు. అంతేకాదు, కొండ ప్రాంతాల్లో, క్లిష్టమైన రహదారులపై సులభంగా ప్రయాణించేందుకు ఫోక్స్‌వ్యాగన్ ప్రసిద్ధ 4MOTION ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్ కూడా ఇందులో ఉండబోతోంది.

ఫోక్స్‌వ్యాగన్ టాయ్‌రోన్‌ను సీకేడీ (CKD - Completely Knocked Down) రూట్ ద్వారా మహారాష్ట్రకు తీసుకువస్తారు. దీనిని ఔరంగాబాద్‌లోని కంపెనీ ప్లాంట్‌లో అసెంబుల్ చేయనున్నారు. దీనివల్ల కారు నాణ్యత తగ్గకుండా భారతీయులకు చేరువవుతుంది. మార్కెట్లోకి వచ్చిన తర్వాత టయోటా ఫార్చ్యూనర్, స్కోడా కొడియాక్ వంటి కార్లకు ఇది గట్టి పోటీనిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఎస్‌యూవీ లాంచ్‌తో ప్రీమియం సెగ్మెంట్‌లో తన ఆధిపత్యాన్ని మళ్ళీ చాటుకోవాలని ఫోక్స్‌వ్యాగన్ భావిస్తోంది.

Tags

Next Story