Volvo : వోల్వో నుంచి అదిరిపోయే ఎలక్ట్రిక్ కారు..ఒక్కసారి ఛార్జ్ చేస్తే 810 కి.మీ ప్రయాణం.

Volvo : ప్రముఖ స్వీడిష్ కార్ల తయారీ సంస్థ వోల్వో ఎలక్ట్రిక్ వాహన రంగంలో సరికొత్త సంచలనానికి తెరలేపింది. తన పాపులర్ మోడల్ XC60 స్థానంలో పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ వెర్షన్ వోల్వో EX60ను ప్రపంచ దేశాలకు పరిచయం చేసింది. ఈ కారు కేవలం రేంజ్ విషయంలోనే కాకుండా, టెక్నాలజీ, సేఫ్టీ పరంగా కూడా ఈవీ మార్కెట్‌ను ఒక కుదుపు కుదిపేస్తోంది. సింగిల్ ఛార్జ్‌తో ఏకంగా 800 కిలోమీటర్లకు పైగా ప్రయాణించే సామర్థ్యం దీని సొంతం. ఈ సూపర్ పవర్‌ఫుల్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ విశేషాలు చూద్దాం.
వోల్వో EX60 మోడల్ ప్రధానంగా రెండు వేరియంట్లలో అందుబాటులోకి రానుంది. ఆల్-వీల్ డ్రైవ్ వేరియంట్ ఏకంగా 810 కిలోమీటర్ల భారీ రేంజ్ ఇస్తుండగా, రియర్-వీల్ డ్రైవ్ వేరియంట్ 620 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. అడ్వెంచర్ అంటే ఇష్టపడే వారి కోసం వోల్వో ప్రత్యేకంగా EX60 Cross Country వెర్షన్‌ను కూడా ప్రవేశపెట్టింది. దీనికి ఫ్రాస్ట్ గ్రీన్ అనే స్పెషల్ కలర్ ఇచ్చారు, ఇది స్కాండినేవియన్ ప్రకృతిని తలపిస్తుంది. సాధారణ మోడల్ కంటే దీని గ్రౌండ్ క్లియరెన్స్ 20 మిమీ ఎక్కువగా ఉంటుంది. అవసరమైతే ఎయిర్ సస్పెన్షన్ ద్వారా మరో 20 మిమీ వరకు పెంచుకోవచ్చు. దీనివల్ల కొండ ప్రాంతాలు, గుంతల రోడ్లపై కారు ఎంతో స్మూత్‌గా వెళ్తుంది.
సాంకేతిక పరంగా ఈ కారును సరికొత్త SPA3 ఆర్కిటెక్చర్ ప్లాట్‌ఫామ్‌పై నిర్మించారు. ఇందులో మెగా కాస్టింగ్, సెల్-టు-బాడీ అనే అధునాతన టెక్నాలజీని ఉపయోగించారు. అంటే బ్యాటరీని నేరుగా కారు ఫ్రేమ్‌కే జోడిస్తారు. దీనివల్ల కారు బరువు తగ్గి, బ్యాటరీ సామర్థ్యం పెరుగుతుంది. ఛార్జింగ్ విషయానికి వస్తే, 400 kW ఫాస్ట్ ఛార్జర్ సాయంతో కేవలం 10 నిమిషాల్లోనే 340 కిలోమీటర్ల మేర ప్రయాణించడానికి సరిపడా ఛార్జింగ్ ఎక్కుతుంది. దూర ప్రయాణాలు చేసేవారికి ఇది ఒక గొప్ప వరం అని చెప్పాలి.
ఈ కారులో ఉన్న మరో క్రేజీ ఫీచర్ Google Gemini AI. వోల్వో కార్లలోనే మొదటిసారిగా ఈ ఏఐ అసిస్టెంట్‌ను ప్రవేశపెట్టారు. మీరు వాయిస్ కమాండ్ ద్వారా మ్యూజిక్ మార్చడం, మ్యాప్స్ లో లొకేషన్ సెట్ చేయడం లేదా కారు ఫీచర్లను కంట్రోల్ చేయడం వంటివి ఎంతో వేగంగా చేయవచ్చు. ఇది ఒక మనిషిలాగా మీ ప్రశ్నలకు సమాధానాలు ఇస్తుంది. సేఫ్టీ విషయంలో వోల్వోకు సాటి మరొకటి లేదు. ఇందులో ఉన్న HuginCore సిస్టమ్ కారు చుట్టూ ఉన్న పరిసరాలను సెన్సార్ల సహాయంతో నిరంతరం పర్యవేక్షిస్తుంది. చిన్నపాటి ప్రమాద సూచన ఉన్నా డ్రైవర్‌ను అలర్ట్ చేస్తుంది.
ఈ వసంత కాలం నుంచి స్వీడన్‌లోని వోల్వో ఫ్యాక్టరీలో ఈ కార్ల ఉత్పత్తి ప్రారంభం కానుంది. ఈ వేసవి నుండే P6, P10 వేరియంట్ల డెలివరీలు మొదలవుతాయి. అత్యంత శక్తివంతమైన P12 వేరియంట్ కొంచెం ఆలస్యంగా మార్కెట్లోకి వస్తుంది. లగ్జరీ, టెక్నాలజీ, ఎకో-ఫ్రెండ్లీ ప్రయాణాన్ని కోరుకునే వారికి వోల్వో EX60 ఒక అద్భుతమైన ఎంపిక. భారత మార్కెట్లోకి ఈ కారు ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో వచ్చే అవకాశం ఉంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
