WhatsApp vs Govt : నెలకో కోటి నంబర్లను నిషేధిస్తున్నా ప్రభుత్వానికి సహకరించని వాట్సాప్.

WhatsApp vs Govt : నెలకో కోటి నంబర్లను నిషేధిస్తున్నా ప్రభుత్వానికి సహకరించని వాట్సాప్.
X

WhatsApp vs Govt : ప్రపంచంలోనే నంబర్ వన్ మెసేజింగ్ యాప్‌గా ఉన్న వాట్సాప్ భారతదేశంలో ప్రతి నెలా దాదాపు కోటి నంబర్లను బ్లాక్ చేస్తోంది లేదా నిషేధిస్తోంది. వాట్సాప్ ఇంత పెద్ద సంఖ్యలో నంబర్లను ఎందుకు నిషేధిస్తోందో తమకు తెలియజేస్తే, దేశంలో శాంతిభద్రతల సమస్యలు, సైబర్ క్రైమ్‌లను అదుపు చేయడానికి వీలవుతుందని భారత ప్రభుత్వం పదేపదే విజ్ఞప్తి చేస్తోంది. అయినప్పటికీ వాట్సాప్ మాత్రం తన డేటా గోప్యతను పంచుకోవడానికి నిరాకరిస్తోంది. ఈ వైఖరి భారత ప్రభుత్వానికి కొంత ఇబ్బందిని కలిగిస్తోంది.

దేశంలో జరుగుతున్న చాలా సైబర్ క్రైమ్‌లలో నేరగాళ్లు ఎక్కువగా వాట్సాప్‌నే వాడుతున్నారు. వాట్సాప్ ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ కలిగి ఉండటం వల్ల, నేరగాళ్లకు తమ రహస్య కార్యకలాపాలను నిర్వహించడానికి ఇది మరింత అనుకూలంగా మారింది. కొత్త సిమ్ తీసుకుని వాట్సాప్, టెలిగ్రామ్, సిగ్నల్ వంటి మెసేజింగ్ యాప్‌లలో అకౌంట్ తెరిస్తే, ఆ తర్వాత సిమ్ లేకపోయినా ఈ యాప్‌లు పనిచేస్తాయి. మెసేజ్‌లను కూడా స్వీకరించవచ్చు. దీంతో నేరగాళ్లు ఈ ఓటీటీ యాప్‌లను దుర్వినియోగం చేయడం బాగా పెరిగింది.

వాట్సాప్ ఒక నెలలో లక్షల్లో కాదు, కోటికి పైగా నంబర్లను బ్యాన్ చేస్తోంది. ఈ సంఖ్య చాలా పెద్దది. వాట్సాప్ తన నెలవారీ నివేదికలో కేవలం సంఖ్యను మాత్రమే ప్రచురిస్తుంది, కానీ ఆ నంబర్లను ఎందుకు నిషేధించారో మాత్రం చెప్పదు. మోసం లేదా ఇతర నేరాలకు పాల్పడిన కారణంగా నంబర్‌ను నిషేధించినట్లయితే, ఆ మొబైల్ నంబర్లను తమకు ఇస్తే, నేరగాళ్లు తదుపరి చేయబోయే మోసాలను అడ్డుకోవచ్చని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది. కేవలం నిషేధించిన నంబర్లను మాత్రమే ఇస్తే చాలు, వారి పేర్లు లేదా ఇతర వ్యక్తిగత వివరాలు అవసరం లేదని ప్రభుత్వం అడుగుతోంది. కానీ, డేటా సెక్యూరిటీ విధానం కారణంగా ఈ సమాచారాన్ని బహిర్గతం చేయకూడదని వాట్సాప్ నిర్ణయించింది. వివిధ దేశాలలో వ్యక్తిగత డేటా సెక్యూరిటీపై కఠినమైన నియమాలు ఉన్నందున, వాట్సాప్ ఇలాంటి సమాచారాన్ని పంచుకుంటే చట్టపరమైన చిక్కుల్లో పడే అవకాశం ఉంది.

నిషేధిత నంబర్లతో ప్రభుత్వం ఏం చేయగలదు?

స్కామర్లని అనుమానించి నిషేధించిన నంబర్లను ప్రభుత్వం సేకరించగలిగితే, ఆ నంబర్‌తో కూడిన సిమ్ కార్డును ఎక్కడ కొనుగోలు చేశారు, దానికి ఏ డాక్యుమెంట్లు సమర్పించారు, ఆ డాక్యుమెంట్లు నకిలీవా లేక అసలైనవా అనే సమాచారాన్ని ప్రభుత్వం తెలుసుకోవచ్చు. ఒకవేళ డాక్యుమెంట్లు నకిలీ అని తేలితే, ఆ నంబర్‌ను నేరాల కోసమే పొందారని నిర్ధారించవచ్చు. అలాంటి నంబర్లపై నిఘా ఉంచడానికి, నేరాలను అరికట్టడానికి ఇది ప్రభుత్వానికి బాగా ఉపయోగపడుతుంది.

Tags

Next Story