WhatsApp : వాట్సాప్, టెలిగ్రామ్ వినియోగదారులకు షాక్.. ప్రతి 6 గంటలకు లాగిన్ కావాల్సిందే.

WhatsApp : సైబర్ నేరాలను అరికట్టే ఉద్దేశంతో భారత ప్రభుత్వం మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్‌ల కోసం ఒక కొత్త, కీలకమైన నియమాన్ని తీసుకురాబోతోంది. ఈ కొత్త రూల్ ప్రకారం, WhatsApp, Telegram, Signal వంటి యాప్‌లు తమ వినియోగదారుల సిమ్ కార్డ్ ఎల్లప్పుడూ పనిచేసే స్థితిలో ఉండాలి. ఆ పరికరానికి నిరంతరం అనుసంధానమై ఉండాలి. ఈ టెలికమ్యూనికేషన్ సైబర్ సెక్యూరిటీ సవరణ నియమాలు 2025లో భాగంగా రాబోతున్న ఈ నిబంధనల వల్ల, WhatsApp వెబ్ వంటి సేవలు వాడుతున్న వారికి పెద్ద మార్పులు రాబోతున్నాయి.
టెలికమ్యూనికేషన్ విభాగం తీసుకురానున్న ఈ కొత్త నిబంధనలు సైబర్ భద్రతను పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఈ నియమం ప్రకారం, బ్యాంక్ లేదా యూపీఐ యాప్‌ల తరహాలోనే మెసేజింగ్ యాప్‌లు కూడా తమ వినియోగదారుల సిమ్ కార్డ్‌లను ప్రతి 90 రోజులకోసారి తప్పనిసరిగా వెరిఫై చేయాలి. మొబైల్‌లో సిమ్ కార్డ్ యాక్టివ్‌గా ఉంటే మాత్రమే మెసేజింగ్ సర్వీసులను అందించాలి. ఒక పరికరంలో వాట్సాప్ వెబ్ ను యాక్టివ్ చేస్తే, మొబైల్ సిమ్ లేకపోయినా ఆ సేవలు కొనసాగుతాయి. దీనిని సైబర్ నేరగాళ్లు దుర్వినియోగం చేసే అవకాశం ఉంది.
కొత్త నియమం అమలులోకి వస్తే, ఈ దుర్వినియోగాన్ని అరికట్టేందుకు, బ్రౌజర్‌లలో WhatsApp లేదా ఇతర మెసేజింగ్ సేవలు ప్రతి ఆరు గంటలకోసారి ఆటోమేటిక్‌గా లాగౌట్ అవుతాయి. వినియోగదారులు తిరిగి యాక్టివ్ మొబైల్ ఉపయోగించి మళ్లీ లాగిన్/లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ కొత్త చట్టం మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్‌లను టెలికాం ఆపరేటర్ల స్థాయికి తీసుకువస్తోంది.
ఈ కొత్త చట్టం ద్వారా వాట్సాప్ వంటి మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్‌లను టెలికమ్యూనికేషన్ ఐడెంటిఫైయర్ యూజర్ ఎంటిటీస్ గా అధికారికంగా వర్గీకరిస్తారు. అంటే, సాంప్రదాయ టెలికాం ఆపరేటర్ల మాదిరిగానే వీటిని కూడా పరిగణించడం జరుగుతుంది. డిజిటల్ ప్రపంచంలో మొబైల్ నంబర్ అనేది ఒక ముఖ్యమైన గుర్తింపుగా ఉంది. దీని దుర్వినియోగాన్ని అరికట్టేందుకు, డిజిటల్ నేరాలను నియంత్రించేందుకు ఈ కఠినమైన చట్టాలు చాలా అవసరమని ప్రభుత్వం భావిస్తోంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

