RBI : బంగారం ధర ఎంత పెరిగినా తగ్గేదేలే.. సెప్టెంబర్లో 200 కిలోల గోల్డ్ బిస్కెట్ల కొనుగోలు.

RBI : ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నా, భారతదేశంలో మాత్రం ఒక సంస్థ భారీ స్థాయిలో బంగారు బిస్కెట్లు కొనుగోలు చేస్తోంది. ఈ ఏడాది బంగారం ధర 60 శాతం పైగా పెరిగినా, ఆ సంస్థ తమ ఖజానాను పసిడితో నింపుకుంటోంది. ముఖ్యంగా సెప్టెంబర్ నెలలో ఒక్క రోజుకు సుమారు 7 కిలోల చొప్పున, నెల మొత్తం మీద దాదాపు 200 కిలోల బంగారాన్ని కొనుగోలు చేసింది. ఇంతటి భారీ కొనుగోళ్లు చేస్తున్న ఆ సంస్థ ఏది? ఈ కొనుగోళ్ల వెనుక కారణాలేమిటి? ఆ వివరాలు తెలుసుకుందాం.
భారతదేశంలో ఇంత భారీ స్థాయిలో బంగారాన్ని కొనుగోలు చేస్తున్నది సామాన్య వ్యక్తులు కాదు, ఏ ఒక్క బిలియనీర్ కూడా కాదు. ఆ సంస్థ పేరు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దేశపు కేంద్ర బ్యాంకు అయిన ఆర్‌బీఐ సెప్టెంబర్ నెలలో భారీగా పసిడి కొనుగోళ్లు చేసింది. సెప్టెంబర్ నెలలో ఆర్‌బీఐ ఏకంగా 200 కిలోల బంగారాన్ని కొనుగోలు చేసింది. అంటే ఈ నెలలో రోజుకు సుమారు 7 కిలోల బంగారాన్ని కొన్నట్లు లెక్క. ఈ భారీ కొనుగోళ్ల ఫలితంగా, ఆర్‌బీఐ మొత్తం బంగారు నిల్వ 880 టన్నుల స్థాయిని దాటింది. దీంతో బంగారం నిల్వల విషయంలో భారత్ జపాన్‌ను కూడా దాటేసింది.
ఆర్థిక సంవత్సరం 2025-26 మొదటి ఆరు నెలల్లో ఆర్‌బీఐ బంగారు నిల్వలు 880 టన్నుల స్థాయిని దాటాయి. ఆర్‌బీఐ తాజా గణాంకాల ప్రకారం, సెప్టెంబర్ 26, 2025 నాటికి బంగారం మొత్తం విలువ 95 బిలియన్ డాలర్లుగా ఉంది. సెప్టెంబర్‌తో ముగిసిన ఆరు నెలల కాలంలో రిజర్వ్ బ్యాంక్ ఏకంగా 600 కిలోల బంగారాన్ని కొనుగోలు చేసింది. ఆర్థిక సంవత్సరం 2024-25 చివరి నాటికి 879.58 టన్నులుగా ఉన్న మొత్తం బంగారం నిల్వ, సెప్టెంబర్ చివరి నాటికి 880.18 టన్నులకు పెరిగింది. అంతకుముందు 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఆర్‌బీఐ మొత్తం 54.13 టన్నుల బంగారాన్ని జోడించింది.
కేంద్ర బ్యాంకులు, పెట్టుబడిదారులు బంగారంపై దృష్టి సారించడానికి ప్రధాన కారణం అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితులు. ప్రపంచ ఆర్థిక, భౌగోళిక రాజకీయ అనిశ్చితులు పెరుగుతున్న కారణంగా, సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం డిమాండ్ ఇటీవల బాగా పెరిగింది. ఈ కారణంగానే అంతర్జాతీయంగా బంగారం ధరలు పెరిగాయి. అంతర్జాతీయ స్థాయిలో, ఇతర కేంద్ర బ్యాంకులు కూడా అధికారిక నిల్వలకు 166 టన్నుల బంగారాన్ని జోడించాయి. ఈ కేంద్ర బ్యాంకులు, పెట్టుబడిదారులు ఆర్థిక ఆస్తిగా బంగారాన్ని నిరంతరం కొనుగోలు చేయడం వలన దేశీయ ధరలు కూడా పెరిగాయి. ఈ డిమాండ్ కారణంగానే సెప్టెంబర్ నెలలో బంగారం ధరలు అత్యధిక స్థాయికి చేరుకున్నాయి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com