Money Printing : మిషన్ మన దగ్గరే ఉంది కదా..ప్రభుత్వం కరెన్సీ నోట్లు ముద్రించి ఎందుకని అప్పులు తీర్చదు ?

Money Printing : ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సామాన్యులు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ధరల పెరుగుదల. ఇలాంటి సమయంలో చాలామందికి ఒక అమాయకమైన సందేహం వస్తుంటుంది. ప్రభుత్వమే నోట్లను ముద్రిస్తుంది కదా.. మరి అప్పులు తీర్చడానికి, పేదరిక నిర్మూలనకు ఇష్టం వచ్చినట్లు నోట్లను ముద్రించి అందరికీ పంచవచ్చు కదా? అని. వినడానికి ఇది చాలా బాగున్నా, వాస్తవంలో ఇది ఒక దేశ ఆర్థిక వ్యవస్థను నిలువునా ముంచేసే ప్రమాదకరమైన చర్య. వెనిజులా, జింబాబ్వే వంటి దేశాలు ఇలాంటి సాహసం చేసి ఇప్పుడు కోలుకోలేని స్థితిలో ఉన్నాయి.
ఎక్కువ నోట్లు ముద్రిస్తే ఏం జరుగుతుంది? ఏ దేశ ఆర్థిక వ్యవస్థలోనైనా వస్తువుల ఉత్పత్తి, చెలామణిలో ఉన్న డబ్బు మధ్య ఒక బ్యాలెన్స్ ఉండాలి. ఉదాహరణకు, ఒక ఊరిలో 100 కొబ్బరి బోండాలు ఉన్నాయి అనుకుందాం. వాటిని కొనడానికి ప్రజల వద్ద మొత్తం 100 రూపాయలు ఉంటే, ఒక బోండం ధర రూపాయి అవుతుంది. ఇప్పుడు ప్రభుత్వం కొత్తగా నోట్లు ముద్రించి ప్రజల వద్ద ఉన్న డబ్బును 200 రూపాయలకు పెంచిందనుకోండి.. బోండాలు మాత్రం 100 లోపే ఉంటాయి. అప్పుడు ప్రజలు ఆ బోండాల కోసం ఎక్కువ డబ్బు చెల్లించడానికి సిద్ధపడతారు, ఫలితంగా బోండం ధర రెండు రూపాయలకు పెరుగుతుంది. అంటే నోట్లు పెరిగిన కొద్దీ వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతాయి. దీనినే మనం ద్రవ్యోల్బణం అంటాం.
జింబాబ్వే వంటి దేశాల్లో ఈ పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే, అక్కడ ఒక రొట్టి ముక్క కొనాలన్నా సంచుల కొద్దీ నోట్లు పట్టుకెళ్లాల్సి వస్తుంది. అంటే అక్కడ కాగితం నోటు కంటే ఆ రొట్టి ముక్క విలువ ఎక్కువైపోయింది. ఇలా నోట్లు ముద్రిస్తూ పోతే డబ్బుకు విలువ తగ్గిపోయి ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుంది. అందుకే అప్పుల్లో ఉన్న పాకిస్థాన్, శ్రీలంక వంటి దేశాలు కూడా ఈ పిచ్చి పనికి ఒడిగట్టలేదు.
మరి కొత్త నోట్లు అసలు ముద్రించరా? ఖచ్చితంగా ముద్రిస్తారు, కానీ దానికి కొన్ని నియమాలు ఉంటాయి. దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నప్పుడు (GDP పెరుగుతున్నప్పుడు) దానికి అనుగుణంగా కొత్త డబ్బును మార్కెట్లోకి విడుదల చేయాలి. ఒకవేళ అలా చేయకపోతే డీఫ్లేషన్ (ధరలు పడిపోవడం) ఏర్పడి వ్యాపారాలు దెబ్బతింటాయి. అందుకే ఆర్బీఐ వంటి కేంద్ర బ్యాంకులు ప్రతి ఏటా దేశాభివృద్ధిని, ద్రవ్యోల్బణ లక్ష్యాలను (భారత్‌లో ప్రస్తుతం ఇది 4% గా ఉంది) లెక్కవేసి ఎంత కొత్త డబ్బు విడుదల చేయాలో నిర్ణయిస్తాయి.
కొత్త డబ్బును విడుదల చేయడం అంటే కేవలం నోట్లు ముద్రించడం మాత్రమే కాదు. డిజిటల్ రూపంలో కూడా డబ్బును ఆర్థిక వ్యవస్థలోకి పంపిస్తారు. దీనికోసం ఆర్బీఐ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ ద్వారా ప్రభుత్వ బాండ్లను కొనుగోలు చేసి బ్యాంకులకు డబ్బును సరఫరా చేస్తుంది. మొత్తానికి డబ్బు అనేది కేవలం ఒక కాగితం కాదు, అది దేశ ఉత్పత్తికి ప్రతిరూపం. ఆ ఉత్పత్తి పెరగకుండా నోట్లు పెంచితే అది కేవలం రంగు కాగితాల కుప్పగానే మిగిలిపోతుంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

