RBI Rules Update : 750 సిబిల్ ఉన్నా బ్యాంక్ లోన్ ఇవ్వడానికి నో చెప్పే 4 ప్రధాన కారణాలు ఇవే.

RBI Rules Update : 750 సిబిల్ ఉన్నా బ్యాంక్ లోన్ ఇవ్వడానికి నో చెప్పే 4 ప్రధాన కారణాలు ఇవే.
X

RBI Rules Update : మీరు ఏదైనా బ్యాంకు లేదా ఆర్థిక సంస్థ నుంచి రుణం తీసుకోవాలని అనుకుంటే మొదటగా చర్చకు వచ్చే అంశం సిబిల్ స్కోర్. రుణం పొందాలంటే సిబిల్ స్కోర్ కచ్చితంగా బాగుండాలి. సాధారణంగా 750 లేదా అంతకంటే ఎక్కువ స్కోర్‌ను మెరుగైనదిగా భావిస్తారు. అయితే సిబిల్ స్కోర్ 750 కంటే ఎక్కువగా ఉన్నప్పటికీ కొన్ని సందర్భాల్లో బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్ తిరస్కరించవచ్చు. దీనికి కేవలం సిబిల్ స్కోర్ మాత్రమే కాకుండా ఇంకా చాలా అంశాలు ప్రభావితం చేస్తాయి. ఆ అంశాలు ఏమిటి లోన్ తిరస్కరణకు గల కారణాలు, ఆర్బీఐ నియమాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

సిబిల్ స్కోర్ బాగున్నా లోన్ ఎందుకు రిజెక్ట్ అవుతుంది?

బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలు కేవలం మీ సిబిల్ స్కోర్‌ను మాత్రమే చూడవు. వాటితో పాటుగా, కింది కీలక అంశాలను కూడా పరిశీలిస్తాయి.

1. ఆర్థిక స్థితి,ఉద్యోగ స్థిరత్వం

రుణం మంజూరు అయ్యే విషయంలో మీ ఆదాయం, ఉద్యోగ స్థిరత్వం అత్యంత ముఖ్యమైనవి. మీరు తరచుగా ఉద్యోగాలు మారుతుంటే లేదా ఎక్కువ కాలం నిరుద్యోగిగా ఉంటే, బ్యాంకులు మిమ్మల్ని కొంచెం ప్రమాదకరంగా పరిగణిస్తాయి. అదే సమయంలో మీరు ఒకే రంగంలో స్థిరంగా పనిచేస్తూ, నమ్మకమైన సంస్థలో ఉంటే, రుణం తిరిగి చెల్లించే సామర్థ్యంపై బ్యాంకుకు నమ్మకం పెరుగుతుంది.

2. అధిక అప్పులు

మీపై ఇప్పటికే ఉన్న అప్పులు కూడా చాలా ముఖ్యమైనవి. మీ ఆదాయంలో 40-50% వరకు ఇప్పటికే EMIల రూపంలో పోతుంటే, మీకు కొత్త రుణం ఇవ్వడానికి బ్యాంకులు వెనుకాడతాయి. ఎందుకంటే కొత్త లోన్ తీసుకుంటే, మీరు ఆర్థికంగా ఒత్తిడికి గురై, EMIలు సరిగా కట్టలేరని భావిస్తాయి.

3. ఒకేసారి పలు దరఖాస్తులు

చాలా మంది ఒకే సమయంలో పలు బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలలో లోన్‌ల కోసం లేదా క్రెడిట్ కార్డుల కోసం దరఖాస్తు చేస్తారు. దీనివల్ల మీ సిబిల్ రిపోర్టులో ఒకేసారి చాలా హార్డ్ ఎంక్వైరీస్ కనిపిస్తాయి. దీనిని బ్యాంకులు మీరు తీవ్రమైన ఆర్థిక ఒత్తిడిలో ఉన్నట్లుగా భావించి, రిస్క్‌గా పరిగణిస్తాయి.

4. బ్యాంక్‌తో పాత సంబంధం

మీరు ప్రస్తుతం దరఖాస్తు చేస్తున్న బ్యాంక్‌తో గతంలో మీకు ఉన్న సంబంధం కూడా ప్రభావితం చేస్తుంది. గతంలో ఏదైనా EMI చెల్లింపు మిస్ అవ్వడం లేదా రుణ సెటిల్‌మెంట్‌లో ఆలస్యం వంటి చెడు రికార్డ్ ఉంటే, అది మీ దరఖాస్తు తిరస్కరణకు దారితీయవచ్చు.

కొత్త నిబంధనల్లో ఊరట

RBI తీసుకొచ్చిన కొత్త నియమాల ప్రకారం, మొదటిసారి రుణం తీసుకునేవారికి కనీస క్రెడిట్ స్కోర్ నిబంధనను సడలించారు. ఇంతకు ముందు తక్కువ స్కోర్ ఉందన్న ఒక్క కారణంతోనే దరఖాస్తును తిరస్కరించే అవకాశం ఉండేది. ఇప్పుడు బ్యాంకులు కేవలం తక్కువ స్కోర్‌ను చూసి రిజెక్ట్ చేయకూడదు. బదులుగా దరఖాస్తుదారు మొత్తం ఆర్థిక పరిస్థితి, అప్పులు తీర్చే సామర్థ్యం, ఉద్యోగ స్థిరత్వం వంటి అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని మాత్రమే రుణం మంజూరుపై నిర్ణయం తీసుకోవాలి. ఇది ముఖ్యంగా క్రెడిట్ హిస్టరీ లేని యువతకు, కొత్త లోన్ తీసుకునేవారికి ఊరట కలిగించే అంశం.

Tags

Next Story